చిత్తచాంచల్యమే దుఃఖ హేతువు

ABN , First Publish Date - 2020-06-11T09:10:25+05:30 IST

మనసు ఎక్కడ ఉంటుందో ప్రపంచం అక్కడ భాసిస్తుంది. మనసు ఎక్కడ ఉండదో అక్కడ జగత్కథ ఏమాత్రం

చిత్తచాంచల్యమే దుఃఖ హేతువు

  • యత్ర చిత్తం తత్ర విశ్వం స్వయమేవ ప్రతీయతే
  • యత్ర చిత్తం నాస్తి తత్ర నాస్తి కించిజ్జగత్కథా


మనసు ఎక్కడ ఉంటుందో ప్రపంచం అక్కడ భాసిస్తుంది. మనసు ఎక్కడ ఉండదో అక్కడ జగత్కథ ఏమాత్రం కనిపించదని దీని భావం. శంకర భగవత్పాదులవారు ‘మహావాక్య దర్పణం’లో చెప్పిన మాట ఇది. మనసు ఒక పక్షిలాంటిది. దానికి విషయాలను గురించిన నిరంతర స్మృతి, వాటి గురించిన ఆశ అనే రెండు రెక్కలున్నాయి. ఆ రెక్కల సాయంతో అది పైకి ఎగురుతుంది. పక్షికి రెక్కలు వచ్చిన తర్వాత.. ఆ రెక్కలు కదిలించడానికి అభ్యాసము చేత గాలిని పుట్టించుకొంటుంది. ఆ గాలి సాయంతో ఎత్తుగా ఎగిరి.. ఆకాశంలోని పెనుగాలిలో తన రెక్కలు చాచి బడలిక తీర్చుకుంటుంది.


అలాగే మనసు కూడా ఇంద్రియ గోచరములైన విషయాల వెంటబడి తిరిగి తిరిగి వాటి వల్ల కలిగే దుష్ట సంకల్ప, వికల్పాలతో సతమతమవుతూ చివరికి కుంగి, అలసిపోతుంది. దారిలోని ఎముకను కుక్కలు అటూ ఇటూ లాగినట్టు.. దంభం, అభిమానం, కామ, క్రోధ, లోభాలు మనసును అటూఇటూ ఆకర్షిస్తాయి. కోరుకున్నది పొందలేకపోయినప్పుడు మనసు దుఃఖాన్ని పొందుతుంది. విషయ సుఖాలను పొందినప్పుడు ఆనందించి.. అవి దూరం కాగానే దుఃఖమనుభవిస్తుంది. ఇలా సుఖ, దుఃఖాల మధ్యే జీవితం గడచిపోతుంది. జాలరి చూపిన ఎరను తిని చేప నశించునట్లు మానవుడు కాలప్రేరితుడై ఆయా విషయాలను అనుభవిస్తూ పతితుడు అవుతాడు.


స్థిరత్వం,  చంచలత్వం.. ఈ రెండూ మన మనసులో పరిణామం చెందుతుంటాయి. కనుకనే కావాల్సిన వస్తువు లభించనంతవరకూ మనసు నిలకడ లేక చంచలమై తిరుగుతుంది. చిత్తం యొక్క ఈ చాంచల్యమే దుఃఖహేతువు. కోరుకున్నది దొరకగానే మనసు చాంచల్యాన్ని వదిలి కొంతసేపు స్థిరమవుతుంది. ఈ చిత్తస్థైర్యం ఎంతకాలం ఉంటుందో.. సుఖం కూడా అంతకాలమే ఉంటుంది. 


మనసనే సముద్రంలో లెక్కలేనన్ని వృత్తులు పుట్టి, అణుగుతుంటాయి. ఈ వృత్తులే మనసును కలవరపెడుతుంటాయి. ఒక వృత్తి అణగిపోయిన తర్వాత అది మనసుపై గుర్తుగా మిగిలిపోతుంది. దీనినే ‘సంస్కారం’ అంటారు. ఈ సంస్కారాలే వాసనామయ రూపంలో క్రియలన్నింటిలో ప్రవర్తించుచూ సంసార బంధంలో చిక్కుకుంటాయి. ఆత్మజ్ఞానంతోనే ఆ వాసనల నుంచి విముక్తి. అనగా వాసనాక్షయమే ముక్తి మార్గం. భోగాసక్తిగలవారికి చిత్తవికారం సహజం. దుర్గుణాల వల్ల కలిగే దోషాలకు చిత్తవికారమే హేతువు. మనసు విషయ భోగాలతో ఉద్రేకించి.. తమోగుణ ప్రధానమై కలుషితమవుతుంది. వైరాగ్యంతో విషయవాసనలు నశించినంతనే ఆ మనసు తిరిగి సత్వ గుణాన్ని పొందుతుంది. చిత్తంలో సత్వగుణంతోనే జ్ఞానం ఉదయిస్తుంది. అంటే.. చిత్తశుద్ధితోనే జ్ఞాన సిద్ధి.


మేఘశ్యామ (ఈమని), 8332931376

Updated Date - 2020-06-11T09:10:25+05:30 IST