మెడ్‌టెక్‌ ఔత్సాహికులకు ‘ప్రాజెక్ట్‌ తేజ్‌’

ABN , First Publish Date - 2020-02-20T06:23:20+05:30 IST

మెడికల్‌ టెక్నాలజీ రంగంలోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తమ వినూత్న ఆలోచనలు, ఉత్పత్తులను పరీక్షించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ‘ప్రాజెక్ట్‌ తేజ్‌’

మెడ్‌టెక్‌ ఔత్సాహికులకు ‘ప్రాజెక్ట్‌ తేజ్‌’

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): మెడికల్‌ టెక్నాలజీ రంగంలోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తమ వినూత్న ఆలోచనలు, ఉత్పత్తులను పరీక్షించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ‘ప్రాజెక్ట్‌ తేజ్‌’ పేరుతో ఒక వేదికను కల్పిస్తోంది. మెడికల్‌ టెక్‌ వినూత్నాల అభివృద్ధి వేగంగా పెరగడానికి ఇది దోహదం చేస్తుంది. ఇందుకోసం మెడ్‌టెక్‌ కనెక్ట్‌తో ప్రభుత్వం చేతులు కలిపింది. సైయెంట్‌, జింటియోకు చెందిన ఇండియా 2022 కొలీషన్‌లు మెడిటెక్‌ కనెక్ట్‌ను ఏర్పాటు చేశాయి. బయోఏషియా 2020లో భాగంగా ప్రాజెక్ట్‌ తేజ్‌పై  రీసెర్చ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ సర్కిల్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ (రిచ్‌), మెడిటెక్‌ కనెక్ట్‌లు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ప్రాజెక్ట్‌ తేజ్‌ దేశీయంగా, తక్కువ ధర కు మెడికల్‌ టెక్నాలజీ వినూత్న ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి దోహదపడగలదని సైయెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ బీవీఆర్‌ మోహన్‌ రెడ్డి తెలిపారు.


మెడికల్‌ టెక్నాలజీలోని కంపెనీలు, ఆసుపత్రులు, స్టార్ట్‌పలు తదితరాలు కలిసి పనిచేయొచ్చని చెప్పారు. కొత్త టెక్నాలజీలను పరీక్షించి, వాణిజ్యపరంగా మార్కెట్లోకి ప్రవేశపెట్టడానికి ప్రాజెక్ట్‌ తేజ్‌ దోహదపడుతుందన్నారు. తెలంగాణలోని మెడ్‌టెక్‌ పార్క్‌కు ఇది మద్దతు గా నిలుస్తుందని, మెడ్‌టెక్‌ రంగంలో పెట్టుబడులకు తెలంగాణను గమ్యస్థానంగా మార్చడంలో ఉపకరిస్తుందని రిచ్‌ డైరెక్టర్‌ జనరల్‌ అజిత్‌ రంగ్నేకర్‌ చెప్పారు. మెడ్‌టెక్‌ కనెక్ట్‌ ప్రాజెక్ట్‌ తేజ్‌ను నిర్వహిస్తుంది. దేశ వ్యాప్తంగా 25 సంస్థలు దీనికి అండగా నిలుస్తాయి. 

Updated Date - 2020-02-20T06:23:20+05:30 IST