ధ్యానం అంటే...

ABN , First Publish Date - 2021-10-01T05:30:00+05:30 IST

ఎప్పుడూ ఏదో పని చేస్తూ ఉండడం ఉత్తమమైన విషయమని లోకంలో జనులు

ధ్యానం అంటే...

ఎప్పుడూ ఏదో పని చేస్తూ ఉండడం ఉత్తమమైన విషయమని లోకంలో జనులు భావిస్తూ ఉంటారు. ఊరికే ఉండడం సోమరితనమనీ, ఉండరాని దుర్లక్షణమనీ అందరూ భావిస్తారు. నిరంతరం ఏదో ఒక కార్యంలో నిమగ్నమై ఉండడాన్నే పాలకులు, ప్రజలు, ప్రభుత్వాలు కోరుకోవడం, మెచ్చుకోవడం జరుగుతుంది. నిష్ర్కియగా ఉండడాన్ని ఎవరూ ఒప్పుకోరు, అభినందించరు.

ఓషో (రజనీశ్‌) చెప్పిన... ఒక జెన్‌ మఠంలో చోటు చేసుకున్న కథ ఇది:


ఒక ఊళ్ళో చాలా విశాలమైన మఠం ఉండేది. మధ్యలో ఆలయం, చుట్టూ సాధువులు ఉండే భవనాలు, వంటశాల, భోజన శాల, మరుగుదొడ్లు, మూత్రశాలలు, గ్రంథాలయం, అన్నదాన మండపాలతో ఎంతో అందంగా కనిపించేది. సందర్శకులందరూ దాన్ని చూసి ‘అద్భుతం’ అని ప్రశంసించేవారు. ఈ విషయం రాజు చెవిన పడింది. అతను ఆ మఠాన్ని సందర్శించాలనుకున్నాడు. మఠాధిపతి దగ్గరకు దూతలతో కబురు పంపి, తాను మఠాన్ని సందర్శించే రోజునూ, సమయాన్నీ తెలియజేశాడు. 


రాజుకు మఠాధిపతి ఎదురొచ్చి, ఘనంగా స్వాగతం పలికాడు. ఆయన వచ్చినందుకు సంతోషం వ్యక్తపరిచాడు. ఆలయం చుట్టూ ఉన్న వాటిని రాజుకు చూపిస్తూ ‘‘ఇవి సాధువుల గృహాలు. ఇది వంటశాల, ఇది భోజనశాల. ఇవి స్నానాలు, కాలకృత్యాల గదులు. ఇది గ్రంథాలయం. ఇదిగో, ఇక్కడే పేదలకు అన్నదానం జరుగుతుంది’’ అని వివరించాడు. అయితే ఆలయంలోనికి మాత్రం రాజును తీసుకువెళ్ళలేదు. 


అంతా అయిన తరువాత తీసుకువెళతాడేమోనని రాజు చాలాసేపు ఎదురు చూశాడు. కానీ మఠాధికారి ఆలయ ప్రస్తావన ఎంతసేపటికీ చేయడం లేదు. ఆ ప్రాంగణంలో అన్నిటికన్నా ముఖ్యమైనది ఆ ఆలయమే.


ఇక రాజు ఉండబట్టలేక ‘‘ఆలయాన్ని చూద్దాం’’ అన్నాడు. ఆ మాట విననట్టు ఊరుకున్నాడు మఠాధిపతి.


రాజుకు కోపం వచ్చింది. ‘‘మీకేమైనా పిచ్చి ఉందా? అన్నిటినీ చూపించారు. ఆ ఆలయంలోకి మాత్రం మమ్మల్ని ఎందుకు తీసుకువెళ్ళరు? అసలు అక్కడ మీరేం చేస్తూ ఉంటారు?’’ అని అడిగాడు.


అప్పుడు మఠాధిపతి ‘‘మహారాజా! వంటశాలలో వంట చేస్తాం. భోజనశాలలో బోజనం చేస్తాం. స్నానపు గదుల్లో స్నానం చేస్తాం. గ్రంథాలయంలో గ్రంథాలను చదువుతాం. ఇక, ఈ ఆలయంలో అంటారా? ఏమీ చేయం. అలాంటిది మీకు నచ్చదు. దాన్ని మీరు మెచ్చరు. అందుకే దాన్ని మీకు చూపించడం ఇష్టంలేక ఊరికే ఉండిపోయాం’’ అంటూనే రాజును ఆ ఆలయంలోకి తీసుకువెళ్ళాడు పీఠాధిపతి.


అక్కడ కొన్ని వందలమంది విగ్రహాల్లా మౌనంగా, ఆనందంగా ఉండడం చూశాడు రాజు. ఆయనకు ఊహలకు అందని హాయి ఏదో కలిగింది. ‘‘ధ్యానం... అదే ఇక్కడ జరుగుతోంది. ‘ధ్యానం’ అంటే ఏదో చెయ్యడం కాదు. ఏదీ చెయ్యకపోవడం’’ అన్నాడు పీఠాధిపతి.


నిష్ర్కియులై ఉండడంలోని ఆనందాన్ని చవిచూసిన తరువాత నిష్కామకర్మ ఎవరైనా చెయ్యగలరు. వారి సంఖ్య ఎక్కువయ్యే కొద్దీ ఈ సంఘం బాగుపడుతుంది. ‘నేను కర్తను’ అనే భావన లేకపోతే... చేసేదంతా ధ్యానమే అవుతుంది. 

 రాచమడుగు శ్రీనివాసులు


Updated Date - 2021-10-01T05:30:00+05:30 IST