ఔషధంలో అవినీతి మత్తు!

ABN , First Publish Date - 2020-07-05T09:26:34+05:30 IST

ప్రభుత్వంలో కీలకమైన ఔషధ నియంత్రణ పరిపాలన శాఖ అవినీతి మత్తులో జోగుతోంది. ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడంతో ఇక్కడి అధికారుల

ఔషధంలో అవినీతి మత్తు!

  • డ్రగ్‌ విభాగంలో నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు
  • కడప, అనంత, కర్నూలులో భారీగా ఖాళీలు
  • అయినా సొంత జిల్లాల్లోనే ఏడీలు, డీఐలు 
  • వర్క్‌ ఆర్డర్‌పై ఉత్తరాంధ్రకు డీఐలు
  • శాఖపై కొరవడిన ఆరోగ్యశాఖ పర్యవేక్షణ


(అమరావతి, ఆంధ్రజ్యోతి): ప్రభుత్వంలో కీలకమైన ఔషధ నియంత్రణ పరిపాలన శాఖ అవినీతి మత్తులో జోగుతోంది. ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడంతో ఇక్కడి అధికారుల ఇష్టారాజ్యమైపోయింది. శాఖకు ఎంత మంది కొత్త బాస్‌లు వచ్చినా పాత మరకలు మాత్రం పోవడం లేదు. పదోన్నతుల దగ్గర నుంచి పోస్టింగ్‌ల వరకూ వసూళ్ల పర్వం నడుస్తూనే ఉంటుంది. ఫార్మా కంపెనీల దగ్గర నుంచి చిన్న చిన్న మందుల షాపుల వరకూ దేనినీ వదిలిపెట్టడం లేదు. ముఖ్యంగా విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, తిరుపతి వంటి నగరాల్లో పరిస్థితి మరీ దారుణం. శాఖలో పదోన్నతులు చాలా ‘ప్రియం’గా మారాయి.  ఏడీలు, డీఐలతో పాటు ఎనలి్‌స్టలు కూడా ఫార్మా కంపెనీలను పిండేస్తున్నారు.


నిబంధనలను తోసిరాజని...!

శాఖలోని నిబంధనల ప్రకారం ఏడీలు, డీఐలు సొంత జిల్లాల్లో విధులు నిర్వహించకూడదు. కానీ ప్రస్తుతం 30 నుంచి 40 శాతం మంది సొంత జిల్లాల్లోనే పనిచేస్తున్నారు. విషయం అధికారులకు తెలిసినా నెలావారీ మామూళ్లకు అలవాటుపడి పట్టించుకోవడమే మానేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్ల పోస్టులు భారీగా ఖాళీలు ఏర్పడ్డాయి. ఇదే అదునుగా కొంత మంది ఏడీలు, డీఐలు అడగడమే ఆలస్యం.. అధికారులు ఆమ్యామ్యాలు తీసుకుని బదిలీలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.  చివరికి ప్రభుత్వ అనుమతి లేకుండానే కొంతమంది డీఐల బదిలీలు జరిగిపోతున్నాయి. కొన్ని నెలల క్రితం రాయలసీమకు చెందిన కొంత మంది డీఐలు ఉత్తరాంధ్ర, కృష్ణా జిల్లాలకు బదిలీ చేయించుకోవాలని విశ్వప్రయత్నం చేసినా వీలుకాలేదు. దీంతో ఉన్నతాధికారులతో మాట్లాడుకుని రాయలసీమ నుంచి ఉత్తర, కోస్తాంధ్ర జిల్లాలకు వర్క్‌ ఆర్డర్‌ తెప్పించుకున్నారు. కొందరు అధికారులు ప్రభుత్వ అనుమతి లేకుండానే వర్క్‌ ఆర్డర్‌ ఇచ్చేశారు. వర్క్‌ ఆర్డర్‌ ఇచ్చిన తర్వాత ర్యాటిఫికేషన్‌ కోసం ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శికి ఫైల్‌ను పంపిస్తే, కొన్ని అనుమానాలతో ఆయన ఆఫైలును పెండింగ్‌లో పెట్టారు. అయినా వర్క్‌ఆర్డర్‌పై బదిలీ అయిన డీఐలు ప్రభుత్వ అనుమతి లేకపోయినా ఇంకా అక్కడే విధులు నిర్వహిస్తున్నారు. ఈ వర్క్‌ ఆర్డర్‌ వల్ల రాయలసీమలోని అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చివరికి సీఎం సొంత జిల్లాలోనూ సిబ్బంది కొరత ఉంది. కడపలో జిల్లాలో ఒక్క ఏడీతో పాటు నలుగురు డీఐలు ఉండాలి. కానీ కేవలం ఒక్క ఏడీ, ఒక్క డీఐ మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. అనంతపురం, కర్నూలులోనూ ఇదే పరిస్థితి. ఫార్మా కంపెనీలు ఎక్కువగా ఉన్న చోట పోస్టింగ్‌ వేయించుకుంటే ఆదాయం ఎక్కువగా ఉంటుందన్న ఉద్దేశంతోనే ఇలా బదిలీలు చేయించుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి.


ఎనలిస్ట్‌ పోస్టుకు మాం..చి గిరాకీ

శాఖలో ప్రభుత్వ ఎనలిస్ట్‌ పోస్టులకు సీనియర్‌, జూనియర్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్లు పోటీపడుతుంటారు. మెడికల్‌ షాపుల్లో ఉపయోగించే మందులు నాణ్యమైనవో.. కావో నిర్ధారించేందుకు డీఐ (డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు)లు కొన్ని శాంపిల్స్‌ సేకరించి వాటిని విజయవాడలోని రాష్ట్ర స్థాయి ల్యాబ్‌కు పంపిస్తారు. డీఐలు పంపించిన మందులు నాణ్యమైనవో, కావో అన్నది అక్కడ వాటిని పరీక్షించే సైంటిఫిక్‌ ఆఫీసర్ల రిపోర్టుపై ఆధారపడి ఉంటుంది. మందులు నాణ్యమైనవే అని రిపోర్టులు వెల్లడించినా.. ప్రభుత్వ ఎనలి్‌స్టలు సంతకాలు చేస్తేనే వాటిని మార్కెట్‌లోకి అమ్ముకునేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఇద్దరు ప్రభుత్వ ఎనలిస్టులు మాత్రమే ఉండేవారు. ప్రభుత్వం కొత్తగా మరో ఎనలిస్టును నోటిఫై చేసింది. అయితే అధికారులు ముడుపులకు కక్కుర్తిపడి ప్రభుత్వ ఎనలిస్ట్‌ గా అర్హత లేని వారిని తీసుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు కొంతమంది ఎనలిస్టులు నేరుగా ఫార్మా కంపెనీల వద్దకు వెళ్లి పర్సంటేజీలు మాట్లాడుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

Updated Date - 2020-07-05T09:26:34+05:30 IST