Advertisement
Advertisement
Abn logo
Advertisement

మెడికవర్‌ హాస్పిటల్స్‌ రూ.1,000 కోట్ల పెట్టుబడులు

కొత్తగా 10 సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటు 

7,500 స్థాయికి పడకల సామర్థ్యం

2024 తర్వాత పబ్లిక్‌ ఇష్యూకు

మెడికవర్‌ హాస్పిటల్స్‌ సీఎండీ అనిల్‌ కృష్ణ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో ఆసుపత్రులను నిర్వహిస్తున్న మెడికవర్‌ హాస్పిటల్స్‌ భారీ విస్తరణను చేపట్టనుంది. మూడేళ్లలో కొత్తగా 10 సూప ర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులను ప్రధాన మెట్రో నగరాలలో ఏర్పాటు చేయనుంది. కొత్తగా ఆసుపత్రులను ఏర్పాటు చేయడంతో పాటు ఒకటి, రెండు హాస్పిటల్స్‌ను ఆంధ్రప్రదేశ్‌లో కొనుగోలు చేయాలని యోచిస్తోంది. మెడికవర్‌ హాస్పిటల్స్‌ విస్తరణ, నిధుల సమీకరణ తదితర అంశాలపై ‘ఆంధ్రజ్యోతి’తో మెడికవర్‌ గ్రూప్‌ ఆఫ్‌ హాస్పిటల్స్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అనిల్‌ కృష్ణ జీ ఇష్ఠాగోష్ఠిగా ముచ్చటించారు. ఆ వివరాలు..   

కొవిడ్‌ అనంతరం హెల్త్‌కేర్‌ రంగంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి?

కొవిడ్‌ అనంతరం ప్రజల్లో హెల్త్‌కేర్‌పై అవగాహన పెరిగింది. ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. ఇది అనుకూల పరిణామం. ఆరోగ్య బీమాను తప్పనిసరి చేయాలన్నది నా అభిప్రాయం. మూడో దశ కరోనా విజృంభిస్తే మా వరకూ మౌలిక సదుపాయాలపరంగా సిద్ధంగా ఉన్నాం. మొదటి దశ కరోనాకు ఇప్పటికీ మౌలిక సదుపాయాలపరంగా ఆసుపత్రులు మెరుగయ్యాయి. మూడో దశ వస్తే.. ఔషధాలు, కన్స్యూమబుల్స్‌ కొరత రాకుండా సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది. 


కొవిడ్‌ కాలంలో పడకల సామర్థ్యాలను పెంచుకున్నారా?

గత ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకూ కొత్తగా 2,000 పడకల సామర్థ్యాన్ని సమకూర్చుకున్నాం. ఇందుకు రూ.750 కోట్ల పెట్టుబడులు పెట్టాం. ఈ కాలంలో హైదరాబాద్‌, విశాఖ, శ్రీకాకుళం, మహారాష్ట్రలో సంఘమ్నేర్‌, ఔరంగాబాద్‌ ప్రాంతాల్లో ఆసుపత్రులను ఏర్పాటు చేశాం. ఇందులో భాగంగానే 300 పడకలతో 2022 జనవరిలో ముంబైలో కొత్త ఆసుపత్రిని ప్రారంభించనున్నాం. ఇప్పటి వరకూ 4,500 పడకల సామర్థ్యం ఉంది. మొత్తం 20 ఆసుపత్రులను నిర్వహిస్తున్నాం.

  

భవిష్యత్తు విస్తరణ ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా?

 ప్రధాన మెట్రో నగరాల్లో కనీసం రెండు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు కలిగి ఉండాలన్నది మా లక్ష్యం. ఇందుకు అనుగుణంగా 2024 నాటికి రూ.1,000 కోట్లతో 10 సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ను ఏర్పాటు చేయనున్నాం. ఈ ఆసుపత్రుల మొత్తం పడకల సామర్థ్యం 3,000. హైదరాబాద్‌, పుణె, బెంగళూరు, చెన్నై, ముంబై, వరంగల్‌ తదితర నగరాల్లో ఈ హాస్పిటల్స్‌ నెలకొల్పనున్నాం. ఇవి అందుబాటులోకి వస్తే మొత్తం పడకల సామర్థ్యం 7,500 స్థాయికి చేరుతాయి. విస్తరణకు అవసరమైన నిధులను ఈక్విటీ, రుణాల రూపంలో మెడికవర్‌ సమకూరుస్తోంది. మాక్స్‌క్యూర్‌ హాస్పిటల్స్‌లో 2017లో యూర్‌పనకు చెందిన మెడికవర్‌ వాటా తీసుకుంది. 2019లో మాక్స్‌క్యూర్‌ పేరు మెడికవర్‌గా మారింది. 2020 మార్చికి ముందు మెడికవర్‌కు 53 శాతం వాటా ఉంది. ఇప్పుడు 61 శాతానికి పెరిగింది. తాజా విస్తరణ తర్వాత 65 శాతానికి చేరుతుంది. 


పబ్లిక్‌ ఇష్యూకు వచ్చే ఆలోచన ఉందా?

2020లో రూ.750 కోట్ల ఆదాయం నమోదైంది. 2021కి రూ.1,100 కోట్లకు చేరుతుంది. వచ్చే ఏడాదిలో (2022) రూ.1,600 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నాం. 2024 తర్వాత ఆదాయం రూ.4,000 కోట్లకు చేరొచ్చని భావిస్తున్నాం. అప్పుడు పబ్లిక్‌ ఇష్యూకు వచ్చే ఆలోచన ఉంది. 


తెలుగు రాష్ట్రాల్లో విస్తరణ ప్రత్యేక ప్రణాళికలు ?

కొత్తగా 3,000 పడకల సామర్థ్యాన్ని సమకూర్చుకోవడం కాకుండా వేరుగా ఆంధ్రప్రదేశ్‌లో విజయనగరం, రాజమహేంద్రవరంల్లో ఉన్న ఆసుపత్రులను కొనుగోలు చేయాలనుకుంటున్నాం. ఇందుకోసం ఒక్కో ఆసుపత్రికి రూ.25-30 కోట్లు వెచ్చించనున్నాం. అలాగే విశాఖపట్నంలో రూ.60 కోట్లతో క్యాన్సర్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నాం. 

Advertisement
Advertisement