మక్క రైతు.. మార్కెట్‌లో చిత్తు!

ABN , First Publish Date - 2021-12-06T08:23:43+05:30 IST

అటు సర్కారు కొనక, ఇటు మార్కెట్‌లో ధర లేక మక్క రైతులు మనో వ్యథకు గురవుతున్నారు.

మక్క రైతు.. మార్కెట్‌లో చిత్తు!

  • మద్దతు ధర ప్రకటించి చేతులెత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం..జాడలేని కొనుగోలు కేంద్రాలు
  • యథేచ్ఛగా దళారుల దందా 
  • అతి తక్కువ ధరకు కొనుగోళ్లు 
  • పెట్టుబడి సైతం రాని రైతులు

జగిత్యాల, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): అటు సర్కారు కొనక, ఇటు మార్కెట్‌లో ధర లేక మక్క రైతులు మనో వ్యథకు గురవుతున్నారు. వరి సాగును నిరుత్సాహపర్చడానికి మొక్కజొన్నలను పండించాలని రైతులకు సూచించిన రాష్ట్ర ప్రభు త్వం తీరా పంట చేతికొచ్చే సమయానికి చేతులెత్తేసింది. కేవలం మద్దతు ధర ప్రకటించి, కొనుగోలు కేంద్రాల ఏర్పాటును గాలికి వదిలేసింది. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. చేతిలో చిల్లిగవ్వ లేక పంటను అయిన కాడికి అమ్ముకుంటున్నారు. పెట్టుబడి సైతం రాక నష్టాలపాలవుతున్నారు. జగిత్యాల జిల్లాలో వానాకాలంలో 54,086 ఎకరాల్లో పంట సాగైంది. వాస్తవానికి ఎకరానికి 25 క్వింటాళ్ల చొప్పున జిల్లాలో మొత్తం 13.52 లక్షల క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉంది. వర్షాలు అధికంగా కురవడంతో పంట దెబ్బతింది. దీంతో రైతులు ఎకరాకు 19 క్వింటాళ్ల వరకు మాత్రమే దిగుబడిని పొందారు. జిల్లా వ్యాప్తంగా 10లక్షల క్వింటాళ్ల మొక్కజొన్న దిగుబడి వచ్చింది. ప్రస్తుత సీజన్‌లో మొక్కజొన్న క్వింటాలుకు రూ.1,870 మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించిం ది. ప్రతీయేటా మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పంటను సేకరిస్తుండగా ప్రస్తుతం కొనుగోలు కేంద్రాలు తెరవలేదు. దీంతో రైతులు వ్యాపారులను, దళారులను ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ తరుణంలో రైతుల వద్ద నుంచి దళారులు క్వింటాలు మక్కకు రూ.1,550 నుంచి రూ. 1,600 వరకు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే క్వింటాకు రూ. 270లు తక్కువగా ఉత్పత్తిని అమ్ముకుంటూ రైతులు నష్టాల పాలవుతున్నారు. దీనికి తోడు హమాలీ, నగదు చెల్లింపుల పేరిట దళారులు.. కోత విధిస్తున్నారు. తూకాల్లో సైతం మోసాలు జరిగాయని రైతులు వాపోతున్నారు.

 

పన్నులు ఎగ్గొడుతూ వ్యాపారం 

ప్రభుత్వానికి పన్ను చెల్లించకుండా దళారులు అక్ర మ దందాను యథేచ్ఛగా నడిపిస్తున్నారు. క్వింటాలు మక్కలకు రూ. 18.70 ఫీజును చెల్లించకుండా ఖజానాకు గండి కొడుతున్నారు. రైతుల పేరిట వ్యాపారులు మక్కలను తరలిస్తూ పన్నులను ఎగవేస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం, లైసెన్స్‌ పొందిన వ్యాపారులు మక్కలు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోకపోవడం వల్ల వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు ఆదాయాన్ని కోల్పోతున్నాయి. 


మిర్చి పంటకు తెగులు.. ట్రాక్టర్లతో పొలాన్ని చదును చేసిన రైతు

దుగ్గొండి, డిసెంబరు 5: రేయింబవళ్లు కష్టపడి సాగు చేసిన మిర్చిపంట తెగుళ్ల బారినపడి పూత, కాత లేకపోవడంతో ఆవేదన చెందిన రైతు.. ఆ పంటను ట్రాక్టర్లతో దున్నేశాడు. ఈ ఘటన వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండం తిమ్మంపేటలో ఆదివారం జరిగింది.  రైతు శివరాత్రి రవి రెండెకరాల్లో రూ.25వేలతో బాడిక రకం( దొడ్డు) మిరప విత్తనాలు కొనుగోలు చేసి సాగు చేశాడు. మూడు నెలలకు పంట పూత, కాత దశకు చేరుకోగా  తామర పురుగు సోకింది. దీంతో చేసేదేమీ లేక పంటను ట్రాక్టర్‌తో దున్నేశాడు. రెండెకరాల్లో రూ.60వేల పెట్టుబడి పెట్టినట్లు  రైతు వెల్లడించారు. మండలంలో సుమారు 1,625 ఎకరాల్లో మిరప సాగు చేసినట్లు రైతులు తెలిపారు.  


అయిన కాడికి అమ్ముకుంటున్నాం 

ప్రస్తుత సీజన్‌లో ప్రభుత్వం మొక్కజొన్నకు మద్దతు ధర ప్రకటించినా కొనుగోలు కేంద్రాలను మాత్రం తెరవలేదు. దీంతో పల్లెల్లో కాంటాలు నిర్వహించి కొనుగోలు చేసే వ్యాపారులు, దళారులకు తక్కువ ధరకు మొక్కజొన్న విక్రయించాల్సి వస్తోంది. 

- అల్లూరి మహేందర్‌ రెడ్డి, రైతు 

Updated Date - 2021-12-06T08:23:43+05:30 IST