Advertisement
Advertisement
Abn logo
Advertisement

కేసముద్రం మార్కెట్‌కు పోటెత్తిన ధాన్యం

కేసముద్రం, డిసెంబరు 6 : మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌కు సోమవారం ఈ ధాన్యం సీజన్లో అత్యధికంగా 21,911 బస్తాల ధాన్యం విక్రయానికి రైతులు తీసుకువచ్చారు. ఈ మార్కెట్‌కు గత నెల 15న ధాన్యం సీజన్‌ ప్రారంభం కాగా గత వారం 14వేల బస్తాలు విక్రయానికి వచ్చాయి. తాజాగా 236 మంది రైతులు 7822 బస్తాల ఆర్‌ఎన్‌ఆర్‌ రకం ధాన్యం, 325 మంది రైతులు 13,274 బస్తాల హెచ్‌ఎంటీ రకం, 24 మంది రైతులు 815 బస్తాల జైశ్రీరాం పాత రకం ధాన్యం వెరసి 585 మంది రైతులు 21,911 బస్తాల ధాన్యాన్ని మార్కెట్‌కు తీసుకువచ్చారు. ఇందులో ఆర్‌ఎన్‌ఆర్‌ రకం ధాన్యం క్వింటాకు గరిష్ఠంగా రూ.1969, కనిష్ఠంగా రూ.1359, సగటున రూ.1889 ధరలతో ఈ-నామ్‌ విధానంలోని ఈ-వేలం ద్వారా వ్యాపారులు ఖరీదులు చేశారు. హెచ్‌ఎంటీ రకం క్వింటాకు గరిష్ఠంగా రూ.2000, కనిష్ఠంగా రూ.1209, సగటున రూ.1939, జైశ్రీరాం రకం పాతవి రూ.2261, రూ.1739, రూ.2217 ధరలతో ఖరీదులు కొనసాగాయి. 17శాతం కంటే తేమ తక్కువగా ఉంటూ నూక శాతం అతితక్కువగా ఉన్న ధాన్యం రాశులకు రూ.1900 నుంచి రూ.1930 వరకు ధరలు వచ్చాయి. యార్డులో 585 ధాన్యం రాశులు ఉండడంతో వేలంలో దక్కించుకున్న వ్యాపారులకు తమ లాట్‌ ఐడీకి సంబంధించిన సరుకు ఎక్కడ ఉందో దొరకక ఇబ్బందులు పడ్డారు. రాత్రి వరకు సగం సరుకుకే కాంటాలు నిర్వహించి మిగతావి మరుసటి రోజుకు వాయిదా వేశారు. 

Advertisement
Advertisement