బాలిక మృతదేహం లభ్యం

ABN , First Publish Date - 2021-04-16T05:30:00+05:30 IST

బాలిక మృతదేహం లభ్యం

బాలిక మృతదేహం లభ్యం
సాయి సహస్త్ర మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబసభ్యులు, బంధువులు

మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ పరామర్శ

మహబూబాబాద్‌ రూరల్‌, ఏప్రిల్‌ 16 : మహబూబాబాద్‌ శివారు జమాండ్లపల్లి మున్నేరువాగులో గురువారం రాత్రి గల్లంతైన బాలిక బొల్లెపల్లి సాయి సహాస్త్ర మృతదేహం శుక్రవారం ఉదయం లభ్యమైంది. జమాండ్లపల్లి చెందిన బట్టుపల్లి బాబు-లలిత దంపతుల రెండో కుమారుడు బట్టుపల్లి యశ్వంత్‌ (10) బొల్లెపల్లి బద్రి-నర్మదల ఏకైక కుమార్తె బొల్లెపల్లి సాయిసహస్ర (10) ఇరువురు గురువారం మధ్యాహ్నాం ఇంటి నుంచి ఆడుకోవడానికి బయటకు వెళ్లారు. రాత్రి పొద్దుపోయే వరకు చిన్నారులు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. అదేవీధిలో ఎక్కడైన ఆడుకుంటున్నారా అని వెతికారు. ఎంతకు అచూకీ లభ్యం కాకపోవడంతో గృహాలకు సమీపంలోని మున్నేరు వాగు పరివాహక ప్రాంతానికి వెళ్లి అక్కడ వెతికారు. చిన్నారుల చెప్పులు కన్పించడంతో వారు పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మున్నేరువాగులో ఈతగాళ్లతో వెతికించారు. సుమారు రాత్రి 10:30 గంటల సమయంలో బాలుడు బట్టుపల్లి యశ్వంత్‌ మృతదేహం లభ్యమైంది. బాలిక బొల్లెపల్లి సాయిసహస్ర మృతదేహం కోసం ఈతగాళ్లు మూమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినప్పటికి ఆచూకీ దొరకలేదు. దీంతో శుక్రవారం ఉదయం సాయిసహాస్త్ర మృతదేహాన్ని వెతికేందుకు పోలీసులు అక్కడికి చేరుకోగా అప్పటికే నీళ్లపై శవమై తేలింది. దీంతో బాలిక మృతదేహాన్ని వెలికితీసి ఇరువురి మృతదేహాలను జిల్లా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. అనంతరం జమాండ్లపల్లి గ్రామశివారులో చిన్నారుల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, జిల్లా ఆస్పత్రిలో చిన్నారుల మృతదేహాలను  ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌ సందర్శించి ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు అనంతరం ఒక్కొక్క కుటుంబానికి రూ.5 వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు. కౌన్సిలర్‌ వట్టం జోత్స్నశివ, బండి ఇందిరావెంకన్న, మాజీ ఎంపీపీ గోనె ఉమారాణి శ్రీపతి, మాజీ సర్పంచ్‌ చిట్టోజు రమరవీంద్రాచారి, టీఆర్‌ఎస్‌ నాయకులు, గ్రామస్తులు చిన్నారుల మృతదేహాలను సందర్శించి కన్నీటి పర్యంతమయ్యారు.

చిన్నారుల మృతితో జమాండ్లపల్లిలో విషాదం..

మహబూబాబాద్‌ జిల్లా కేంద్రం శివారు జమాండ్లపల్లి గ్రామంలో ఇద్దరు చిన్నారుల మృతితో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎదురెదురు ఇండ్లలో ఉండే పదేళ్ల వయస్సుగల చిన్నారులు యశ్వంత్‌, సాయిసహాస్త్రలు ఆడుకునేందుకు వెళ్లి కొద్ది గంటల్లోనే కానరాని లోకానికి వెళ్లడం గ్రామస్థులను కలచివేసింది. ఇరువురు చిన్నారులు ఆడుకుంటూ వెళ్లి మున్నేరువాగులో పడి విఘత జీవులుగా మారడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Updated Date - 2021-04-16T05:30:00+05:30 IST