కరెంట్‌కు గరిష్ఠ చిల్లర ధర!

ABN , First Publish Date - 2022-08-06T08:38:54+05:30 IST

విద్యుత్‌ రంగంలో పెను మార్పులు రానున్నాయి. విద్యుత్‌ సం స్థలు అమ్మే కరెంటుకు రెగ్యులేటరీ కమిషన్లు యూనిట్‌ కనీస ధర, గరిష్ఠ ధరలను నిర్ణయించనున్నాయి.

కరెంట్‌కు గరిష్ఠ చిల్లర ధర!

  • అంతకు మించిన రేటుకు అమ్మొద్దు..
  • కనీస ధర కూడా ఉంటుంది..
  • నిర్ణయించేది రెగ్యులేటరీ కమిషనే
  • దాని నియామకాలు కేంద్రం చేతిలోకి
  • డిస్కమ్‌లకు పోటీగా ప్రైవేటు కంపెనీలు
  • రెండు ధరల మధ్య ఎంతకైనా అమ్మొచ్చు
  • డిస్కమ్‌ల లైన్లపై ప్రైవేటు కరెంటుకు చాన్స్‌
  • వాడుకున్నందుకు వీలింగ్‌ చార్జీలు కట్టాలి
  • ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో బిల్లు
  • అడ్డుకునేందుకు కార్మిక సంఘాల కసరత్తు


హైదరాబాద్‌, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ రంగంలో పెను మార్పులు రానున్నాయి. విద్యుత్‌ సం స్థలు అమ్మే కరెంటుకు రెగ్యులేటరీ కమిషన్లు యూనిట్‌ కనీస ధర, గరిష్ఠ ధరలను నిర్ణయించనున్నాయి. ఆ రెండింటి మధ్యలో ధరకే విద్యుత్‌ను వినియోగదారులకు విక్రయించాల్సి ఉంటుంది. విద్యుత్‌ సవరణ బిల్లు తుది ముసాయిదాను కేంద్రం విడుదల చేసింది. నేడో రేపో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. బిల్లుకు ఆమోదం లభించి చట్టరూపం దాల్చితే పంపిణీ వ్యవస్థలోనూ కీలక సంస్కరణలు వస్తాయి. ఒకే ప్రాంతంలో ఒకటికి మించి విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లకు సరఫరా అవకాశం ఇస్తారు. ప్రస్తుతం తెలంగాణలో రెండే డిస్కమ్‌లు ఉన్నాయి. కొత్త చట్టంతో ఒకే ప్రాంతంలో పలు డిస్కమ్‌లు వస్తాయి. ఏదేనీ సంస్థ లైసెన్స్‌ కోసం రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(ఎ్‌సఈఆర్సీ)కి దరఖాస్తు చేసుకుంటే నిర్ణీత  సమయంలోగా లైసెన్సును మంజూరు చేయాలి. చేయకపోతే లైసెన్స్‌ ఇచ్చినట్లుగానే భావించి ముందుకు వెళ్లొచ్చు.


లైన్లు డిస్కమ్‌లవే

ప్రభుత్వ డిస్కమ్‌లకు చెందిన విద్యుత్‌ స్తంభాలు, లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్‌ ేస్టషన్లను వినియోగించి ప్రైవేట్‌ డిస్కమ్‌లు కార్యకలాపాలు చేపట్టనున్నాయి. దీనికి ప్రతిఫలంగా వీలింగ్‌ చార్జీలను ప్రైవేటు కంపెనీలు చెల్లిస్తాయి. వీలింగ్‌ చార్జీలను కూడా ఈఆర్సీ నిర్ణయిస్తుంది. కనిష్ఠ, గరిష్ఠ ధరల మధ్య ఎవరు తక్కువకు ఇస్తారో వారి నుంచే వినియోగదారులు కొనుక్కుంటారు. ప్రస్తుత డిస్కమ్‌లు జెన్‌కోల నుంచి చేసుకున్న విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల(పీపీఏ)లతో పాటు విద్యుత్‌ కొనుగోలు వ్యయాన్ని ప్రైవేట్‌, ప్రభుత్వ డిస్కమ్‌లు పంచుకోవాల్సి ఉంటుంది.


క్రాస్‌ సబ్సిడీలకు ప్రత్యేక నిధి

క్రాస్‌ సబ్సిడీల కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తుంది. ఓపెన్‌యాక్సె్‌సలో కరెంట్‌ కొనుగోలు చేసే పరిశ్రమలు, వాణిజ్య వినియోగదారుల నుంచి క్రాస్‌ సబ్సిడీ సర్‌ఛార్జీ(సీఎ్‌సఎస్‌) వసూలు చేస్తారు. 200 యూనిట్లలోపు వినియోగం కలిగిన గృహ వినియోగదారులు, వ్యవసాయ వినియోగదారులకు తక్కువ ధరకు కరెంట్‌ ఇవ్వడానికి క్రాస్‌ సబ్సిడీ నిధిని వాడుకుంటారు. విద్యుత్‌ సరఫరా వ్యవస్థ(గ్రిడ్‌)పై పూర్తి అధికారం జాతీయ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌(ఎన్‌ఎల్‌డీసీ)కి ఇచ్చారు. ఇంతకుముందు రాష్ట్రాలకు ఆ అధికారం ఉండేది. కేంద్రం నిర్దేశించిన శాతం కంటే తక్కువ పునరుత్పాదక విద్యుత్‌ను కొనుగోలు చేస్తే డిస్కమ్‌లు జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. డిస్కంలు జెన్‌కోలకు ఒప్పందం ప్రకారం చెల్లింపులు జరపడంలో విఫలమైతే వాటికి విద్యుత్‌ సరఫరాను నిలిపేస్తారు. తెలంగాణ డిస్కమ్‌లు రూ.17 వేల కోట్ల మేర జెన్‌కోలకు చెల్లించాల్సి ఉంది. బిల్లు ఆమోదం పొందితే బకాయిలున్న డిస్కమ్‌లకు కరెంటు దక్కకుండా కట్టడి చేస్తారు. 


90 రోజుల్లోనే చార్జీల ఫైనల్‌

డిస్కంలు టారిఫ్‌ ప్రతిపాదనలు సమర్పించాక ఇప్పటిదాకా 120 రోజుల్లో ఈఆర్‌సీ చార్జీలు ఖరారు చేసి ఉత్తర్వులు ఇచ్చేది. దాన్ని 90 రోజులకు కుదించారు. ఏఆర్‌ఆర్‌(వార్షిక ఆదాయ అవసరాలు)/టారిఫ్‌ ప్రతిపాదనలు డిస్కమ్‌లు సమర్పించకపోతే వివరాలన్నీ తీసుకొని స్వయంగా టారిఫ్‌ ఉత్తర్వులు ఇచ్చే అధికారం కూడా ఈఆర్‌సీకి కొత్త చట్టంతో దఖలు పడనుంది. కొత్త చట్టంతో ఈఆర్‌సీని నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి పోనుంది. కమిషన్‌ ఛైర్మన్‌గా హైకోర్టు మాజీ జడ్జి లేదా ప్రభుత్వంలో ముఖ్య కార్యదర్శి హోదాలో పని చేసిన అధికారిని నియమిస్తారు. విద్యుత్‌ బిల్లు పెడితే సమ్మెకు దిగుతామని పవర్‌ జేఏసీ ఛైర్మన్‌ సాయిబాబు, కన్వీనర్‌ రత్నాకర్‌రావు, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ జేఏసీ ఛైర్మన్‌ కె.ప్రకాష్‌, కన్వీనర్‌ ఎన్‌.శివాజీలు ప్రకటించారు. 10న బిల్లు పెడతారని భావిస్తున్నారు. అదేరోజు సమ్మెలోకి వెళ్తామని సంఘాలు ప్రకటించాయి.

Updated Date - 2022-08-06T08:38:54+05:30 IST