ఐరిష్ లేక్‌పై అతిపెద్ద పక్షి.. వైరల్ అవుతున్న వీడియో!

ABN , First Publish Date - 2021-03-09T00:13:32+05:30 IST

కొన్ని ఫొటోలను చూడగానే నమ్మడానికి కొంత సంశయిస్తుంటాం. అలాంటి ఫొటోల్లో ఇదొకటి. ఐరిష్ సరస్సుపై

ఐరిష్ లేక్‌పై అతిపెద్ద పక్షి.. వైరల్ అవుతున్న వీడియో!

న్యూఢిల్లీ:  కొన్ని ఫొటోలను చూడగానే నమ్మడానికి కొంత సంశయిస్తుంటాం. అలాంటి ఫొటోల్లో ఇదొకటి. ఐరిష్ సరస్సుపై భారీ పరిమాణంలో ఉన్న ఓ పక్షి ఎగురుతున్నట్టున్న ఫొటోలు, వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జేమ్స్ క్రోంబీ అనే ఫొటోగ్రాఫర్ వీటిని చిత్రీకరించాడు. ఓ భారీ పక్షి సర్సుపై నుంచి దూసుకొస్తున్నట్టుగా ఉన్న ఈ వీడియోను క్షుణ్ణంగా పరిశీలిస్తే అసలు విషయం అర్థమవుతుంది. నిజానికి అది ఒక్క పక్షికాదు. వేలాది పిచ్చుకల గుంపు అది.


నిజానికి పక్షులెప్పుడూ ఓ క్రమ పద్ధతిలో ఎగురుతుంటాయి. ఈ క్రమంలో ఐర్లాండ్‌లోని సరస్సు పైనుంచి వెళ్తున్న సమయంలో వాటి ఆకారం పెద్ద పక్షిని తలపించింది. మార్చి 2న ఈ పక్షుల గుంపును జేమ్స్ తన కెమెరాలో బంధించాడు. ముల్లింగర్ పట్టణ సమీపంలోని వెస్ట్‌మీత్ వద్దనున్న లో ఎన్నెల్ కో (లోచ్ ఎయినిన్) సరస్సు వద్ద ఈ దృశ్యం అతడికి తారసపడింది. పక్షులన్నీ కలిసి ఒక పెద్ద పక్షిగా కనిపించడమే కాదు, దాని ఆకారం సరస్సు నీటిలో ప్రతిబింబించింది కూడా. ఫొటోలు తీసుకునేందుకు కచ్చితమైన లొకేషన్ కోసం లో ఎన్నెల్‌కు తాను 50 సార్లు వెళ్లినట్టు జేమ్స్ చెప్పుకొచ్చాడు.   


నిజానికి తాను స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్‌నని, అయితే గత కొంతకాలంగా ఇతర అంశాలపైనా దృష్టిసారించినట్టు జేమ్స్ క్రోంబీ తెలిపాడు. పక్షులు ఓ ఆకారాన్ని సంతరించుకోవడాన్ని తాను చూశానని, దీంతో వెంటనే దానిని తన కెమెరాలో బంధించానని పేర్కొన్నాడు. స్పష్టమైన, కచ్చితమైన ఆకారాన్ని ఫొటో తీసేందుకు 400 నుంచి 500 షాట్స్ తీశానని, చివరికి అనుకున్నది సాధించానని సంతోషం నిండిన కళ్లతో చెప్పాడు. ఐర్లాండ్‌లో క్రోంబీకి మంచి పేరుంది. ఐర్లాండ్ ప్రెస్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ నుంచి ‘ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును కూడా అందుకున్నాడు.   



Updated Date - 2021-03-09T00:13:32+05:30 IST