మస్టర్లతో మస్కా
ABN , First Publish Date - 2022-09-15T08:15:44+05:30 IST
మస్టర్లతో మస్కా
‘ఉపాధి’ టార్గెట్ల కోసం వైసీపీ సర్కారు నానాపాట్లు
కేంద్రం నిధుల కోసం అడ్డగోలు వ్యవహారాలు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఉపాధి హామీ పథకం లక్ష్యాలు అందుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. క్షేత్రస్థాయిలో ఉపాధి పనులు పూర్తి స్థాయిలో జరగకపోయినా పెద్ద ఎత్తున చేపడుతున్నట్టు కలరింగ్ ఇస్తోంది. తప్పుడు మస్టర్లతో కేంద్రాన్ని మస్కా కొట్టించే ప్రయత్నం చేస్తోంది. ఉపాధి పనుల కల్పనలో ఉన్న మెరుగైన రికార్డును కొనసాగించలేక దొడ్డిదారిన నానాపాట్లు పడుతోందనే విమర్శలున్నాయి. గతంలో సక్రమంగా పనులు నిర్వహించలేక పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు కేంద్రం దృష్టిలో అభాసుపాలయ్యారు. ఏడాదికి ఉన్న 24 కోట్ల పనిదినాలను 14 కోట్లకు కుదించారు. అయినా తీరు మారలేదు. రాష్ట్ర స్థాయి అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందిపై టార్గెట్ల కత్తి పెడుతున్నారు. పై అధికారుల ఒత్తిడితో కింది స్థాయి సిబ్బంది వారు చెప్పినట్లల్లా చేయాల్సి వస్తోంది. గ్రామాల్లో పనులు లేకపోయినా, కూలీలు వలస పోయినా, అసలు పనులే జరగకపోయినా మస్టర్లు వేసేస్తున్నారు. దీంతో గ్రామాల్లో ఉపాధి పనులు మొక్కుబడి తంతుగా మారాయి. చివరకు కింది స్థాయి సిబ్బందిని బలి చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పనులు జరగకపోయినా మస్టర్లు వేయాలని ఒత్తిడి చేసి, తర్వాత విచారణకు ఆదేశించడమేంటని క్షేత్రస్థాయి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
టార్గెట్లే.. టార్గెట్లు
సాధారణంగా రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు మస్టర్లు ఎక్కువగా నమోదవుతాయి. గతేడాది ఉపాధి అధికారుల ఒత్తిడితో ఈ ఐదు నెలల్లోనే రెండింతలు ఎక్కువగా పూర్తి చేశారు. ఇందుకోసం ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఏపీఓలు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్లపై ఒత్తిడి తెచ్చినట్టు చెబుతున్నారు. రాష్ట్ర అధికారులు ఏపీడీలపై ఒత్తిడి తీసుకురావడంతో వారు కింది స్థాయి సిబ్బందిపై పడ్డారు. ‘‘ఇప్పుడు పనులు చూడం. సోషల్ ఆడిట్ కూడా మీ జోలికి రాదు. మీకెలాంటి ఇబ్బంది లేదు. మాకు కావాల్సింది పనిదినాలు. ఈ వారంలో, ఈ నెలలో ఎన్ని కల్పిస్తారో చెప్పండి? ఆ మేరకు పనులు కల్పించలేకపోతే మీపై వేటు తప్పదు’’ అంటూ కిందిస్థాయి సిబ్బందిపై ఒత్తిడి తెచ్చినట్టు చెబుతున్నారు. దీంతో నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా మస్టర్లు నమోదు సాగినట్టు ఆరోపణలున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కూలీలు పట్టణాలకు వలస వెళ్లారని ఫీల్డ్ అసిస్టెంట్లు చెప్పినా డ్వామా అధికారులు వినలేదు. వారి ఇళ్లకు వెళ్లి జాబ్‌కార్డులు తీసుకుని మస్టర్లు వేయాలని ఆదేశించారు. ఒక్కో కూలీకి వేతనం రూ.245 తగ్గకుండా రికార్డు చేయాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో పనులు చేసినా, చేయకపోయినా కూలీలు వచ్చినట్లు అటెండెన్సు నమోదు చేయాల్సి వచ్చిందంటున్నారు. కొన్ని గ్రామాల్లో వైసీపీ కార్యకర్తలు తీసుకొచ్చిన మస్టర్లు నమోదు చేయాల్సి వచ్చిందని, లేకపోతే పై అధికారుల నుంచి వేధింపులు తప్పవని వాపోతున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒత్తిడి చేశారని క్షేత్రస్థాయి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో ఈ పథకానికి ప్రాజెక్టు అధికారిగా ఉన్న ఎంపీడీఓల పరిస్థితి కూడా అంతే. పనులున్నా, లేకపోయినా చెల్లింపుల కోసం సిఫారసు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందంటున్నారు. మీకెందుకు మస్టర్లు వేయండి. మీకు ఇబ్బంది లేకుండా చూసుకుంటాం’ అన్న జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులు.. సోషల్ ఆడిట్ తనిఖీలకు వచ్చేటప్పటికీ మొహం చాటేస్తున్నారని కింది స్థాయి సిబ్బంది వాపోతున్నారు. ఒత్తిడి తెచ్చి అడ్డగోలుగా మస్టర్లు నమోదు చేయించిన అధికారులు ఇప్పుడు ప్లేట్ ఫిరాయిస్తున్నారని చెబుతున్నారు. అడ్డగోలు మస్టర్ల నమోదుపై కేంద్ర తనిఖీ అధికారులు రాష్ట్రానికి వస్తుండటంతో.. ఇప్పుడు రాష్ట్ర అధికారులు తనిఖీలకు వచ్చి చర్యలు తీసుకుంటున్నారని వాపోతున్నారు.
సిబ్బందిని తొలగించేందుకు కుట్ర?
వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉపాధి పథకంలో పనిచేస్తున్న సిబ్బంది మొత్తాన్ని తొలగించే ప్రయత్నం చేసింది. తీవ్ర వ్యతిరేకత రావడం, క్షేత్రస్థాయి సిబ్బంది నిరసనగా కమిషనరేట్‌ను ముట్టడించడంతో అప్పట్లో వెనక్కి తగ్గింది. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో దశల వారీగా అడ్డగోలు తొలగింపుల ప్రక్రియ కొంత మేర చేపట్టింది. ఆ తర్వాత సిబ్బంది చేతనే తప్పులు చేయించి, తనిఖీలు, విచారణల పేరుతో వారిని తొలగించేలా కుట్ర చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత సిబ్బంది గత ప్రభుత్వ హయాంలో నియమితులైన వారు కావడంతో వారిపై వేటు వేసుందుకు ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నట్టు చెబుతున్నారు.
తప్పుడు మస్టర్లు ఎందుకంటే..?
టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉపాధి పనుల్లో ఏపీ అగ్రగామిగా ఉండేది.
వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఏడాది పాటు బిల్లులు చెల్లించకుండా పనులు ఆపేశారు.
ఉపాధి పనుల్లో వెనుకబడటంతో టార్గెట్ల కోసం హడావుడి చేశారు. తప్పుడు మస్టర్లు, బోగస్ రికార్డులు నమోదు చేశారు.
కేంద్రం ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చే 40 శాతం మెటీరియల్ నిధుల కోసం అడ్డదారులు తొక్కారు.
తప్పుడు మస్టర్లు వేయడం వల్ల పనులకు వచ్చే కూలీలు తగ్గిపోయారు. దీంతో కేంద్రం టార్గెట్ అందుకునేందుకు అదే తంతు కొనసాగిస్తున్నారు.
గతంలో పార్టీలకు అతీతంగా కూలీలు పనులకు వచ్చేవారు. ఇప్పుడు కూలీలపైనా వైసీపీ ముద్ర వేశారనే విమర్శలున్నాయి.