ఇద్దరు తెలుగు రాష్ట్రాల సైనికులవీరమరణం

ABN , First Publish Date - 2020-11-09T08:10:40+05:30 IST

జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లా మాచిల్‌ సెక్టార్‌లో ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భగ్నం చేసే క్రమంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు సైనికులు వీరమరణం పొందారు.

ఇద్దరు తెలుగు రాష్ట్రాల సైనికులవీరమరణం

ఒకరిది నిజామాబాద్‌, మరొకరిది చిత్తూరు

అమరులైన మరో ఇద్దరు జవాన్లు 

ముగ్గురు ముష్కరులూ హతం

కశ్మీర్‌లో చొరబాటు యత్నం భగ్నం


వేల్పూర్‌/ఐరాల/శ్రీనగర్‌ నవంబరు 8: జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లా మాచిల్‌ సెక్టార్‌లో ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భగ్నం చేసే క్రమంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు సైనికులు వీరమరణం పొందారు. మరో ఇద్దరు సైనికులు కూడా అమరులయ్యారు. ముగ్గురు ముష్కరులను జవాన్లు మట్టుబెట్టారు. వీర మరణం పొందిన సైనికుల్లో ఒకరిని తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండలం కోమన్‌పల్లికి చెందిన ర్యాడా మహేశ్‌ (26) గా, మరో సైనికుడిని ఏపీలోని చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారిపల్లెకు చెందిన చీకల ప్రవీణ్‌కుమార్‌ రెడ్డి (37) గా గుర్తించారు. శనివారం అర్ధరాత్రి ఉగ్రవాదులు మాచిల్‌ సెక్టార్‌ మీదుగా దేశంలోకి చొరబడేందుకు యత్నించారు. ఉగ్రవాదుల కదలికలను జవాన్లు గుర్తించి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరు పక్షాల మధ్య కాల్పులు జరిగాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో అమరుడైన మహేశ్‌.. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని శాంకరి జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ పూర్తి చేశారు.


అనంతరం సైన్యంలో చేరారు. రెండేళ్ల క్రితమే ఆయనకు వివాహం జరిగిందని కోమన్‌పల్లి గ్రామస్థులు తెలిపారు. అలాగే చీకల ప్రతా్‌పరెడ్డి, సుగుణమ్మ దంపతుల కుమారుడు ప్రవీణ్‌కుమార్‌ రెడ్డి 18 సంవత్సరాల క్రితం మద్రాసు రెజిమెంట్‌, 18 మద్రాస్‌ ఆర్మీలో చేరారు. ఆయనకు భార్య రజిత, కుమార్తె, కుమారుడు ఉన్నారు. హవల్దారుగా పనిచేస్తూ కమాండో ట్రైనింగ్‌ తీసుకున్నారు. జవాన్ల వీర మరణంతో ఇరు గ్రామాల్లోనూ విషాద ఛాయలు అలుముకొన్నాయి. మరోవైపు కశ్మీర్‌లో భారీగా ఉగ్రవాదులను పంపి శాంతిభద్రతలకు భంగం కలిగించేందుకు పాకిస్థాన్‌ ప్రయత్నిస్తోందని, దాదాపు 50 మంది ఉగ్రవాదులు మాచిల్‌ సెక్టార్‌కు ఎదురుగా తిష్ఠవేసి ఉన్నారని నిఘా వర్గాలు వెల్లడించాయి. ముష్కరుల చొరబాటు యత్నాలను బలగాలు ఎప్పటికపుడు గుర్తించి తిప్పికొడుతున్నాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

Updated Date - 2020-11-09T08:10:40+05:30 IST