ఆమె యుద్ధం సత్యం కోసం!

ABN , First Publish Date - 2021-10-09T06:12:10+05:30 IST

‘‘వచ్చే తరం చేసే పోరాటం సత్యం కోసమే అవుతుంది’’ అంటారు మరియా రెసా. ప్రజాస్వామ్యంలో పాలకులు..

ఆమె యుద్ధం  సత్యం కోసం!

స్వదేశంలో ప్రభుత్వ వేధింపులు, సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్‌లూ...అంతర్జాతీయంగా ప్రశంసలు, అత్యున్నత పురస్కారాలూ...దేనికీ కుంగిపోనిదీ, పొంగిపోనిదీ ఈ ఏడాది నోబెల్‌ శాంతి పురస్కార గ్రహీతల్లో ఒకరైన మరియా రెసా వ్యక్తిత్వం.


‘‘వచ్చే తరం చేసే పోరాటం సత్యం కోసమే అవుతుంది’’ అంటారు మరియా రెసా. ప్రజాస్వామ్యంలో పాలకులు అసత్యాలకు వేసే అందమైన ముసుగుల్ని తొలగించి, నిష్టురమైన నిజాలను లోకానికి వెల్లడి చెయ్యడమే కర్తవ్యంగా ఆమె ఎంచుకున్నారు. ‘‘వాస్తవాలు చర్చనీయాంశాలైన ప్రపంచంలో మనం బతుకుతున్నాం. వార్తల పంపిణీలో ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థ... కోపాన్నీ, ద్వేషాన్నీ రేకెత్తించే అసత్యాలకు ప్రాధాన్యం ఇస్తోంది. అవి నిజాలకన్నా అవి వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. కాబట్టి మేం చేస్తున్నది వాస్తవాల కోసం యుద్ధం. ‘వాస్తవాలు లేని ప్రపంచం అంటే సత్యం, విశ్వాసం లేని ప్రపంచం’ అనే విషయాన్ని నోబెల్‌ శాంతి బహుమతి కమిటీ గ్రహించిందని అనుకుంటున్నాను’’ అని తనకు నోబెల్‌ శాంతి పురస్కారాన్ని ప్రకటించిన సందర్భంగా ఆమె పేర్కొన్నారు.


వ్యాపారి కావాలనుకొని...

ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో 1963లో మరియా జన్మించారు. ఆమెకు ఏడాది వయసుండగానే తండ్రి మరణించారు. మరియా తల్లి ఒక ఇటాలియన్‌- అమెరికన్‌ను వివాహం చేసుకున్న తరువాత... మరియాను, ఆమె సోదరిని సవతితండ్రి దత్తత తీసుకున్నారు. మరియా చదువంతా అమెరికాలోనే సాగింది. పరమాణు జీవశాస్త్రం, థియేటర్‌ ఆర్ట్స్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన మరియా వ్యాపార రంగంలోకి వెళ్ళాలనుకున్నారు. అయితే, ఈలోగా ఉపకారవేతనం మీద ఏడాదిపాటు ఫిలిప్పీన్స్‌ వెళ్ళే అవకాశం వచ్చింది. అక్కడ ఆమె ఒక నాటకం రాశారు. డాక్యుమెంటరీలో నటించారు. అప్పుడే జర్నలిజం మీద ఆసక్తి పెంచుకున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ‘పిటివి-4’లో ఆమెకు అవకాశం వచ్చింది. రెండు దశాబ్దాలపాటు ఇన్వెస్టిగేటివ్‌ రిపోర్టర్‌గా, ఫారిన్‌ కరస్పాండెంట్‌గా వివిధ సంస్థల్లో పనిచేశారు. మనీలా, జకర్తాల్లో సిఎన్‌ఎన్‌ బ్యూరోచీఫ్‌గా వ్యవహరించారు. ఆ తరువాత ఫిలిప్పీన్స్‌లో అతి పెద్ద టీవీ న్యూస్‌ ఛానెల్‌ ఎబిఎస్‌-సిబిఎన్‌ వార్తా విభాగానికి అధిపతిగా ఉన్నారు.


ఆ కాలంలో సంచలన పరిశోధనాత్మక కథనాలు ఎన్నో వెలువరించారు. 2012లో తోటి మహిళా జర్నలిస్టులు ముగ్గురు కలిసి ‘రాప్లర్‌’ అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. పన్నెండు మంది యువ రిపోర్టర్లు, కంటెంట్‌ డెవలపర్లతో ప్రారంభమైన ‘రాప్లర్‌’ త్వరలోనే వందకు పైగా జర్నలిస్టులతో... ఫిలిప్పీన్స్‌లో నాలుగో అతి పెద్ద న్యూస్‌ వెబ్‌సైట్‌గా నిలిచింది. తప్పుడు వార్తల వ్యతిరేక పోరాటంలో, ఫేస్‌బుక్‌ తరఫున వాస్తవాలను నిర్ధారించే బాధ్యతలు కూడా ఫిలిప్పీన్స్‌లో ‘రాప్లర్‌’ చేపట్టింది. జర్నలిజం మీద, ప్రజాస్వామ్యం మీద సోషల్‌ మీడియా ప్రభావాన్ని ఆమె నిశితంగా అధ్యయనం చేశారు. తప్పుడు వార్తలను వ్యాప్తి చెయ్యడానికీ, ప్రత్యర్థులను వేధించడానికీ, ప్రజాభిప్రాయాన్ని వక్రీకరించడానికీ సోషల్‌ మీడియా ఎలా ఉపయోగపడుతోందో అక్షరబద్ధం చేశారు.


ఇంకా బెదిరింపులు వస్తూనే ఉన్నాయి...

దేశాధ్యక్షుడు రోడ్రిగో డెటెర్టే పాలనలో పెరుగుతున్న నియంతృత్వ, హింసాత్మక ధోరణులను, మాదకద్రవ్యాల నివారణ పేరిట జరుగుతున్న అఘాయిత్యాలనూ, హత్యలనూ మరియా ధైర్యంగా బయటపెట్టారు. దీంతో ప్రభుత్వానికి ఆమె కంటగింపుగా మారారు. ‘‘ఫిలిప్పీన్స్‌లో పత్రికా స్వేచ్ఛ రాజ్యాంగంలో మాత్రమే ఉంది. ఇక్కడ జర్నలిజం ప్రమాదకరమైన వృత్తి. విమర్శించే పాత్రికేయులను పోలీసులు లక్ష్యంగా చేసుకుంటారు. ట్రోలింగ్‌ చెయ్యడానికి సోషల్‌ మీడియాలో అధికారవర్గాల అండ ఉన్న సైన్యాలు సిద్ధంగా ఉంటాయి. నా విషయంలోనూ జరుగుతున్నది అదే. నన్ను చంపుతామనీ, అత్యాచారం చేస్తామనీ ఇప్పటికీ బెదిరింపులు వస్తూనే ఉన్నాయి’’ అంటారామె. మరియా నైతిక స్థైర్యాన్ని దెబ్బతియ్యడానికి... పెట్టుబడుల విషయంలో చట్టాల్ని ఉల్లంఘించారన్న ఆరోపణతో ‘రాప్లర్‌’ ఆపరేటింగ్‌ లైసెన్సుని రద్దు చేయించడంతో సహా ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసింది. 2016నుంచి ఆమె మీద పదికి పైగా కేసులు పెట్టారు. వాటిలో ఏడు ఇప్పటికీ నడుస్తున్నాయి. ఒకసారి అరెస్ట్‌ కూడా అయ్యారు. కానీ ఆమె చెక్కుచెదరలేదు.


మరోవైపు ఆమెకు ప్రపంచవ్యాప్తంగా ఎందరో ప్రముఖ వ్యక్తులు, సంస్థలు, పాత్రికేయ సంఘాలు మద్దతు తెలిపాయి. యునెస్కో, బిబిసి, ‘టైమ్స్‌’తో సహా పలు ప్రసిద్ధ సంస్థల నుంచి ఆమె పురస్కారాలు అందుకున్నారు. తాజాగా... మరియాకు, రష్యాకు చెందిన దిమిత్రి మురాటోవ్‌కు సంయుక్తంగా నోబెల్‌ శాంతి బహుమతిని నోబెల్‌ కమిటీ ప్రకటించింది. ‘‘అంతర్జాతీయంగా ప్రజాస్వామ్య వ్యవస్థ, మీడియా స్వేచ్ఛ దారుణమైన ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న ఈ తరుణంలో భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం ఎంతో ధైర్యంగా వారు పోరు సాగిస్తున్నారు’’ అంటూ ప్రశంసించిది. ‘‘ఈ పురస్కారం వస్తుందని ఊహించలేదు. ఇది నాకు దిగ్ర్భాంతి కలిగించింది’’ అంటూ స్పందించారు మరియా. సత్యం కోసం తమ యుద్ధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. 


వారం రోజుల కిందట... రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్టు ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు రోడ్రిగో డెటెర్టే ప్రకటించారు. ఆయన కుమార్తె సారా డుటెర్టేకి ఆ పదవి కట్టబెట్టి, పరోక్షంగా అధికారాన్ని చెలాయించడానికే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే... డెటెర్టేల మరో తరంతో తలపడడానికి మరియా సిద్ధంగానే ఉంటారనడంలో సందేహం లేదు.

Updated Date - 2021-10-09T06:12:10+05:30 IST