మంజీరా రిజర్వాయర్‌ను నీటితో నింపాలి

ABN , First Publish Date - 2020-05-29T09:04:09+05:30 IST

మూడున్నరేళ్లుగా ఎండిపోయి ఉన్న మంజీరా రిజర్వాయర్‌ను తక్షణమే నీటితో నింపాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో ప్రజల సహకారంతో ఉద్యమం చేపడతానని హెచ్చరించారు. గాంధీభవన్‌లో గురువారం మీడియా సమావేశంలో సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు

మంజీరా రిజర్వాయర్‌ను నీటితో నింపాలి

హైదరాబాద్‌, మే 28(ఆంధ్రజ్యోతి): మూడున్నరేళ్లుగా ఎండిపోయి ఉన్న మంజీరా రిజర్వాయర్‌ను తక్షణమే నీటితో నింపాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో ప్రజల సహకారంతో ఉద్యమం చేపడతానని హెచ్చరించారు. గాంధీభవన్‌లో గురువారం మీడియా సమావేశంలో సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు, తన సతీమణి నిర్మల, కుమార్తె జయారెడ్డితో కలిసి జగ్గారెడ్డి మాట్లాడారు. నియోజకవర్గ సమస్యలు చెప్పుకుందామంటే ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ ఇచ్చే పరిస్థితి లేదన్నారు. అందుకే, సంగారెడ్డి తాగు నీటి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లేందుకు మూడేళ్ల నుంచి మీడియా ముఖంగా, అసెంబ్లీ వేదికగా మాట్లాడుతున్నానని తెలిపారు. ‘‘అసెంబ్లీ వేదికగా ఏది అడిగినా సీఎం కేసీఆర్‌ కాదనరు. మేఘాలను కిందకు దింపి వర్షం కురిపించాలని కోరినా అదెంత సేపు దింపుదామనీ అంటారు’’ అని ఎద్దేవా చేశారు.


కాళేశ్వరం నుంచి తెస్తారో.. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి తీసుకొస్తారో.. తక్షణమే మంజీరా రిజర్వాయర్‌ను నీటితో నింపాలని డిమాండ్‌ చేశారు. మరో 6 నెలల్లో మంజీరకు కాళేశ్వరం నీళ్లు వస్తాయంటూ మూడున్నరేళ్లుగా మంత్రి హరీశ్‌రావు చెబుతూనే ఉన్నారని, అది ఆయనకు ఊత పదమని విమర్శించారు. ఎవరైనా విమర్శిస్తే పోలీసులతో ఒత్తిడి చేయిస్తారని, తన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంటారని ఆరోపించారు. హరీశ్‌.. నైతికంగా విలువలు లేని మంత్రి అని, ఆయనవి దొంగ చూపులు, దొంగ మాటలు, దొంగ యవ్వారమని ధ్వజమెత్తారు. ఉమ్మడి మెదక్‌లో సిద్దిపేట, గజ్వేల్‌ మినహా అన్ని నియోజకవర్గాలూ నిర్లక్ష్యానికి గురవుతున్నాయని అన్నారు. సీఎం కేసీఆర్‌ ఇంట్లో పెంపు డు కుక్కకు ఉన్న మర్యాద కూడా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు ఉండదని, వాళ్లు ఇంకేం మాట్లాడతారని వ్యాఖ్యానించారు.  మంజీరాలో నీళ్లు లేక పోవడంతో సంగారెడ్డిలో బోర్లూ పని చేస్తలేవన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌తోపాటు నేతల బృందం వచ్చే నెల 4న మంజీరా రిజర్వాయర్‌ను పరిశీలించనున్నట్లు చెప్పారు. మంజీరా రిజర్వాయర్‌ ప్రస్తుతం మైదానంలాగా తయారైందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. ఇందుకు సంబంధించి ఫొటోను ప్రదర్శించారు. 

Updated Date - 2020-05-29T09:04:09+05:30 IST