జనం మధ్యనే ఉందాం

ABN , First Publish Date - 2020-09-27T08:38:12+05:30 IST

రాష్ట్రంలో క్షేత్రస్థాయి పోరాటాలు, ఉద్యమాలతో నిరంతరం జనం మధ్యనే ఉండాలంటూ టీపీసీసీ నాయకత్వానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మణిక్కమ్‌ ఠాగూర్‌ దిశానిర్దేశం చేశారు.

జనం మధ్యనే ఉందాం

సోనియా త్యాగాన్ని ప్రజల్లోకి తీసుకెళ్దాం

రైతు బిల్లులపై ఉద్యమం: మణిక్కమ్‌ ఠాగూర్‌ 


హైదరాబాద్‌, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో క్షేత్రస్థాయి పోరాటాలు, ఉద్యమాలతో నిరంతరం జనం మధ్యనే ఉండాలంటూ టీపీసీసీ నాయకత్వానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మణిక్కమ్‌ ఠాగూర్‌ దిశానిర్దేశం చేశారు. సోనియాగాంధీ త్యాగం వల్లనే తెలంగాణ ఏర్పాటైందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రె్‌సను అధికారంలోకి తీసుకొచ్చి సోనియాకు బహుమతిగా ఇవ్వాలన్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా నియామకమైన తర్వాత ఠాగూర్‌.. తొలిసారిగా శనివారం హైదరాబాద్‌కు వచ్చారు. రాత్రి 7 గంటలకు గాంధీభవన్‌లో టీపీసీసీ కోర్‌ కమిటీతో సమావేశం అయిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘అందరం క్రమశిక్షణతో ఐకమత్యంగా పనిచేస్తేనే రానున్న ఎన్నికల్లో విజయం సాధిస్తాం. నెలలో రెండు సార్లు తప్పకుండా కొర్‌ కమిటీ భేటీలు నిర్వహిస్తా. ఇందులో అన్ని విషయాలు చర్చించుకుందాం. నాతో పార్టీ అంశాలు ఎప్పుడైనా మాట్లాడొచ్చు. అన్ని వేళలా అందరికి అందుబాటులో ఉంటా’నని పేర్కొన్నారు. 


కేసీఆర్‌ తెలివిగా ఆటలాడుతున్నారు..

‘పార్లమెంటులో వ్యవసాయ బిల్లుల విషయంలో సీఎం కేసీఆర్‌ తెలివిగా ఆటలాడుతున్నారు. అన్ని బిల్లుల్లో అందరికంటే ముందుగానే బీజేపీకి మద్దతు ఇచ్చిన ఆయన వ్యవసాయ బిల్లులను మాత్రం వ్యతిరేకిస్తున్నారు’ అని మణిక్కమ్‌  అన్నారు. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతులను తీవ్రంగా నష్టపర్చేలా, కార్పొరేట్‌ కంపెనీలకు లాభం చేకూర్చే విధంగా కేంద్రం వ్యవసాయ బిల్లులను పెట్టిందన్నారు. ఏఐసీసీ తలపెట్టిన కార్యక్రమాల నిర్వహణ, పార్టీ సభ్యత్వ నమోదు, దుబ్బాక ఉప ఎన్నిక, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, జీహెచ్‌ఎంసీ, ఖమ్మం, వరంగల్‌ కార్పొరేషన్ల ఎన్నికలపైనా ఈ సమావేశంలో చర్చించారు. సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, కార్యనిర్వాహక అధ్యక్షులు రేవంత్‌రెడ్డి, కుసుమ్‌కుమార్‌, పొన్నం ప్రభార్‌, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, సీతక్క, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, వీహెచ్‌, దామోదర రాజనర్సింహ, జానారెడ్డి, షబ్బీర్‌అలీ, చిన్నారెడ్డి, సంపత్‌కుమార్‌, వంశీచంద్‌రెడ్డి పాల్గొన్నారు.   


కాగా, ఆది, సోమవారాల్లోనూ మణిక్కమ్‌ ఠాగూర్‌ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, డీసీసీ అధ్యక్షులతో సమావేశం కానున్నారు.  గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి.. ఓడిపోయిన అభ్యర్థులతో భేటీ కానున్నారు. సోమవారం వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ గవర్నర్‌కు టీపీసీసీ వినతిపత్రం ఇచ్చే కార్యక్రమంలోనూ పాల్గొంటారు. 

Updated Date - 2020-09-27T08:38:12+05:30 IST