ఏరోస్పేస్‌ రంగంలోకి మంగళ్‌ ఇండస్ట్రీస్‌

ABN , First Publish Date - 2022-07-27T06:54:05+05:30 IST

అమరరాజా గ్రూప్‌ కంపెనీ మంగళ్‌ ఇండస్ట్రీస్‌.. ఏరోస్పేస్‌, రక్షణ, మెడికల్‌ ఎక్వి్‌పమెంట్‌ రంగాల్లోకి ప్రవేశించనుంది.

ఏరోస్పేస్‌ రంగంలోకి మంగళ్‌ ఇండస్ట్రీస్‌

ఐదేళ్లలో రూ.400 కోట్ల పెట్టుబడులు


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): అమరరాజా గ్రూప్‌ కంపెనీ మంగళ్‌ ఇండస్ట్రీస్‌.. ఏరోస్పేస్‌, రక్షణ, మెడికల్‌ ఎక్వి్‌పమెంట్‌ రంగాల్లోకి ప్రవేశించనుంది. 2025 నాటికి టర్నోవర్‌ను రెట్టింపు చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అమరరాజా బ్యాటరీస్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, మంగళ్‌ ఇండస్ట్రీస్‌ డైరెక్టర్‌ హర్షవర్ధన్‌ గౌరినేని తెలిపారు. మంగళ్‌ ఇండస్ట్రీస్‌ ప్రస్తుతం ఆటో కాంపోనెంట్లు, బ్యాటరీ కాంపోనెంట్లు, స్టోరేజీ సొల్యూషన్లు, మెటల్‌ ఫ్యాబ్రికేషన్‌ తదితర విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. గత ఆర్థిక సంవత్సరానికి కంపెనీ టర్నోవర్‌ రూ.1,400 కోట్లు ఉండగా.. 2025 నాటికి రూ.3,000 కోట్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు హర్షవర్ధన్‌ తెలిపారు. దేశ,విదేశాల్లో కార్యకలాపాలను విస్తరించాలని కంపెనీ భావిస్తోంది. కొత్త ప్లాంట్లను ఏర్పాటు చేసే యోచనలో ఉంది. ఏరోస్పేస్‌, రక్షణ రంగాల్లో ఉత్పత్తుల తయారీకి అవసరమైన ద్రువీకరణలు పొందనున్నాం. నైపుణ్యాలను, సామర్థ్యాలను పెంచుకోనున్నామని చెప్పారు. కంపెనీ ఆదాయం సగటున ఏడాదికి 20 శాతం వృద్ధి చెందుతోంది. గత రెండు, మూడేళ్లలో సామర్థ్య విస్తరణకు మంగళ్‌ ఇండస్ట్రీస్‌ రూ.250 కోట్ల పెట్టుబడులు పెట్టింది. వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో రూ.300-400 కోట్ల పెట్టుబడులు పెట్టనుందని తెలిపారు. 


20 శాతం ఎగుమతుల లక్ష్యం: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌, టీవీఎస్‌ తదితర కంపెనీలకు ఆటో కాంపోనెంట్లను సరఫరా చేస్తున్నాం. ఇతర విభాగాల్లో ఏబీబీ, ఆల్‌స్తోమ్‌, కోన్‌ వంటి కంపెనీలు కూడా మంగళ్‌ ఇండస్ట్రీ్‌సకు ఖాతాదారులుగా ఉన్నాయి. ప్రస్తుతం మొత్తం ఆదాయంలో ఎగుమతుల వాటా 10-15 శాతం ఉంటుందని.. 2025 నాటికి ఈ వాటాను 20 శాతానికి పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. అమరరాజా గ్రూప్‌లో మంగళ్‌ ఇండస్ట్రీస్‌ రెండో అతిపెద్ద కంపెనీ అని హర్షవర్ధన్‌ తెలిపారు. 

Updated Date - 2022-07-27T06:54:05+05:30 IST