365 రోజుల ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌

ABN , First Publish Date - 2020-08-10T05:30:00+05:30 IST

ఫిట్‌గా ఉంటూ అందాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్న సెలబ్రిటీల్లో మందిరా బేడీ ముందు వరుసలో ఉంటారు. నలభై ఏడేళ్ల వయసులోనూ చెక్కుచెదరని ఫిట్‌నెస్‌ ఆమె సొంతం. ఎప్పటికప్పుడు తన వర్కవుట్‌ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌...

365 రోజుల ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌

ఫిట్‌గా ఉంటూ అందాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్న సెలబ్రిటీల్లో మందిరా బేడీ ముందు వరుసలో ఉంటారు. నలభై ఏడేళ్ల వయసులోనూ చెక్కుచెదరని ఫిట్‌నెస్‌ ఆమె సొంతం. ఎప్పటికప్పుడు తన వర్కవుట్‌ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ అభిమానుల్లో జోష్‌ నింపుతుంటారు. ఇటీవల ఆమె ఈ వారంలో తన ‘365 రోజుల ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌’ పూర్తవనుందని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ఈ ఫిట్‌నెస్‌ ఐకాన్‌ ఎందుకీ ఛాలెంజ్‌ స్వీకరించారంటే...


ఒకప్పుడు మోడల్‌గా, నటిగా, క్రికెట్‌ వ్యాఖ్యాతగా ఓ వెలుగు వెలిగిన మందిరా బేడీ ఇప్పుడు ఫిట్‌నెస్‌ గురూగా ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు. ఫిట్‌నెస్‌కు పేరొందిన ఆమె గత ఏడాది మొదట్లో నలభై రోజులు ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ మొదలెట్టారు. విజయవంతంగా ఆ ఛాలెంజ్‌ పూర్తి చేసిన మందిర 100 రోజుల ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌.... ఆ తరువాత 365 రోజుల ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌కు సిద్ధమయ్యారు. అప్పటి నుంచి ఒక్క రోజు కూడా వర్కవుట్‌ సెషన్‌కి డుమ్మా కొట్టింది లేదు. ఆదివారం కూడా మందిర తన ఛాలెంజ్‌ను కొనసాగించారు.


ఎక్సర్‌సైజ్‌ ఒక థెరపీ

ఆరోగ్యకరమైన జీవనశైలి మీద దృష్టి సారించడం, శారీరక వ్యాయామం మీదనే కాదు మనసుపెట్టి తినడం, సమతులాహారం తీసుకోవడం వంటివీ ఆమె ఛాలెంజ్‌లో భాగమే. తాను వర్కవుట్‌ చేస్తున్న ఫొటోలతో పాటు, ఇంటి వద్దనే ఎలాంటి పరికరాలు లేకుండానే చేయగలిగే తేలికైన వర్కవుట్స్‌. ఆరోగ్యాన్ని పెంచే ఆహారం వంటి విషయాలను తరచుగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తుంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘గెట్‌ఫిట్‌విత్‌మంది’ హ్యాష్‌ట్యాగ్‌తో తన వర్కవుట్‌ ఫొటోలు పోస్ట్‌ చేస్తూ ఫాలోయర్స్‌లో స్ఫూర్తి నింపుతున్నారు. అంతేకాదు ‘నాకు యోగ అంతగా తెలియదు. నాకు తెలిసిన ఆసనాలనే బాగా చేసేందుకు ప్రయత్నిస్తాను. మార్నింగ్‌ వాక్‌, మధ్నాహ్నం జిమ్‌లో వర్కవుట్‌, సాయంత్రం స్విమ్మింగ్‌... ఏదైనా కానీ ఇష్టంగా చేస్తునే ఉంటాను’ అంటారు మందిర. 

ఈ ఛాలెంజ్‌ సమయంలో తన స్కూలు రోజుల్లో చేసిన ఫీట్లను గుర్తుచేసుకోవడమే కాదు వాటిని మళ్లీ ప్రయత్నించారు కూడా. లాక్‌డౌన్‌ సమయంలో 12 నిమిషాల సర్క్యూట్‌ వీడియోతో అభిమానులకు ఫిట్‌నెస్‌ అవసరాన్ని మరోమారు గుర్తుచేశారు. ఈ వారంలో ఆమె ఛాలెంజ్‌ ముగియనుంది. అయితే ఇప్పటికీ ఆమెలో ఛాలెంజ్‌ మొదటి రోజు నాటి ఉత్సాహం, ఎనర్జీ ఉండడం విశేషం. ఎక్సర్‌సైజ్‌ను ఒక థెరపీగా భావించే మందిరకు స్విమ్మింగ్‌ అన్నా, రన్నింగ్‌ అన్నా చాలా ఇష్టం.


Updated Date - 2020-08-10T05:30:00+05:30 IST