Abn logo
Aug 4 2021 @ 00:24AM

తెలుగుకు వెలుగు తెచ్చిన ‘మండలి’

ఆయన ఒక నిస్వార్థ రాజకీయ నాయకుడు. మూర్తీభవించిన గాంధేయతత్వం. మంత్రిగా ఉండి ఆర్‌టిసి బస్సులలో ప్రయాణించిన నిరాడంబరుడు. పూలదండలు నిరాకరించిన నిర్మోహి. బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం అహరహం పరితపించినవాడు. అన్నింటినీ మించి మనసు నిండా మాతృభాషాభిమానాన్ని నింపుకుని, జీవితాంతం తెలుగు భాషాసంస్కృతుల ప్రాభవానికి కృషి చేసినవాడు. ఆ మహనీయుడే మండలి వెంకట కృష్ణారావు. 


1974లో జలగం వెంగళరావు మంత్రివర్గంలో విద్యాసాంస్కృతిక శాఖా మంత్రిగా మండలివారు తెలుగు భాషాసంస్కృతులకు ఎనలేని సేవ చేశారు. 1975 ఏప్రిల్ 12 నుంచి హైదరాబాద్‌లో ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలు వారం రోజుల పాటు ఘనంగా నిర్వహించడంలో ఆయన పాత్ర అవిస్మరణీయమైనది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి ప్రతినిధులను ఒక వేదిక మీదకు తెచ్చి, వారు తమ సాధకబాధకాలను తెలియజెప్పే అవకాశం కల్పించారు. భాషా–సాంస్కృతిక పరమైన వారి సమస్యలను తీర్చడానికి అంతర్జాతీయ తెలుగు సంస్థను నెలకొల్పి విద్యామంత్రిగా ఆ సంస్థకు వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేశారు. అనాదిగా తెలుగు భాషాసంస్కృతులు పొందుతున్న పరిణామ వికాసాలను, కవులు, కళాకారులను, తెలుగువారి మహోజ్వల చరిత్రను భావితరాలకు పరిచయం చేసి, వారికి స్ఫూర్తినివ్వాలనే సత్సంకల్పంతో ‘తరతరాల తెలుగు జాతి’ ప్రదర్శనశాలను ఏర్పాటు చేయాలని సంకల్పించి అందుకుగాను హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లోని ‘సరూబాగ్’లో మూడెకరాల స్థలాన్ని సేకరించి, భవన నిర్మాణానికి అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్‌తో 1975 సెప్టెంబర్ 13న శంకుస్థాపన చేయించారు. ఆ ప్రదేశంలోనే ఇప్పుడు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, తెలుగు లలిత కళాతోరణం నెలకొని ఉన్నాయి. 


కళాశాల స్థాయిలో తెలుగు మాధ్యమం ప్రవేశపెట్టాలనే సంకల్పంతో పీవీ నరసింహారావు   విద్యాశాఖామంత్రిగా తెలుగు అకాడమీని 1968 జూన్‌లో స్థాపించారు. అది ఆ ఏడాది ఆగస్టు 6 నుంచి పనిచేయడం ప్రారంభించింది. విద్యామంత్రిగానూ, ఆ తరువాత ముఖ్యమంత్రిగానూ పీవీ గారే తెలుగు అకాడమీకి ఛైర్మన్‌గా వ్యవహరించారు. ఆ తరువాత 1974 జనవరిలో విద్యామంత్రిగా   బాధ్యతలు చేపట్టిన మండలి తెలుగు అకాడమీ చైర్మన్‌గా పనిచేసి, పీవీ ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడంతో పాటు, సంస్థ కార్యకలాపాలను ఇతోధికంగా అభివృద్ధి చేశారు. కళాశాల స్థాయిలో వివిధ సబ్జెక్టులను ఆంగ్లంలో బోధించే ఉపాధ్యాయులను తెలుగులో బోధించేలా సమాయత్తం చేయడానికి గాను తెలుగు అకాడమీ అంతకుముందు మూడు వర్క్‌షాప్‌లు నిర్వహించింది. 1975–76లో జరిగిన నాలుగో వర్క్‌షాప్‌ కార్యక్రమాలను మండలి వెంకట కృష్ణారావు ప్రారంభించడమే కాకుండా వాటిని గుంటూరు, తిరుపతులలో కూడా ఏర్పాటు చేశారు. వందలాది ఉపాధ్యాయులు వాటిలో పాల్గొనే వెసులుబాటు కల్పించారు. తెలుగు మాధ్యమంలో ఉన్న వైశిష్ట్యాన్ని గుర్తించి, తెలుగు భాషలో బోధించడానికి వారిని సమాయత్తం చేశారు. ఆ విధంగా తెలుగు మాధ్యమం అమలు సంపూర్ణంగా విజయవంతం కావడానికి ఆయన తోడ్పడ్డారు. 1974 మే నెలలో భారతీయ విశ్వవిద్యాలయాలలోని తెలుగు శాఖల అధిపతులను, ఆచార్యులను ఆహ్వానించి ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తెలుగు పఠన, పాఠనాదులలో చేయవలసిన మార్పుల గురించి చర్చలు జరిపి, సూచనలు స్వీకరించారు. 


ఇంటర్మీడియట్ చదివే విద్యార్థుల తెలుగు భాషా సామర్థ్యాన్ని పెంచడానికి, బోధనాభాష మార్పు వల్ల వచ్చే సంపూర్ణ ప్రయోజనాలను వారు పొందడానికి ఒక ‘బ్రిడ్జి కోర్స్’ను తెలుగు అకాడమీతో రూపొందింపజేశారు. తెలుగులో విద్యార్థుల సామర్థ్యాన్ని పెంచడానికి పనికివచ్చే విధంగా అనుభవజ్ఞులు రాసిన 48 పాఠాలు ఉన్న కోర్సు ఇది. 1975 జనవరి - ఫిబ్రవరిలో స్థానికంగా న్యూ సైన్సు కళాశాల, నానక్‌రామ్ భగవాన్ దాస్ సైన్సు కళాశాలల్లో ప్రయోగాత్మకంగా దీన్ని ప్రవేశపెట్టారు. 


తెలుగును అధికార భాషగా ఉపయోగించడానికి ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగులకు శిక్షణనివ్వడానికి ఒక పథకాన్ని తెలుగు అకాడమీతో మండలివారు రూపొందింపజేశారు. ఈ కార్యక్రమం తెలుగు అకాడమీలో ఇప్పటికీ కొనసాగుతున్నది. ద్వితీయ భాషగా తెలుగును నేర్చుకునే వారికి ఉపయోగపడే విధంగా ఒక లఘు నిఘంటువును, పదబంధ సంకలనాన్ని తెలుగు అకాడమీతో ప్రచురింపజేశారు. మండలి వారి కృషి వల్ల 1974–76 మధ్యకాలంలో తెలుగు అకాడమీ తెలుగు భాషా బోధనకు సంబంధించి సుమారు 180 పుస్తకాలను ప్రచురించింది. 


1976 జూన్‌లో రెండు రోజుల పాటు ‘ప్రయోజనాత్మకమైన తెలుగు భాష’ సదస్సును నిర్వహించి, పరిపాలనా వ్యవహారాలలో అధికార భాషగా తెలుగును ప్రవేశపెట్టడానికి తీసుకోవలసిన చర్యలపై చర్చించారు. 151 మంది అధికార, అనధికార ప్రముఖులు ఈ చర్చలలో పాల్గొని, తమ అనుభవాలను, విజ్ఞానాన్ని అందజేశారు. అకాడమీ తన లక్ష్యాలకు అనుగుణంగా కొన్నింటిని వెంటనే ఆచరణలో పెట్టింది. ఈ విధంగా తెలుగు అకాడమీని పీవీ ఏ ఉన్నతాశయాల కోసం స్థాపించారో, ఆ ఆశయాలను నెరవేర్చడానికి మండలి వెంకట కృష్ణారావు విశేష దోహదం చేశారు. 


ఆ మహనీయుడిని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రేతర ప్రాంతాలలో తెలుగు భాషాసంస్కృతుల పరిరక్షణ, పరివ్యాప్తికి విశేష కృషి సల్పిన వ్యక్తులకు, సంస్థలకు మండలి వెంకట కృష్ణారావు పేరిట ప్రతి సంవత్సరం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఒక అవార్డును ప్రదానం చేస్తున్నది. ఈ పురస్కారానికి వారి తనయులు మాజీమంత్రి, ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ ఉపసభాపతి డా. మండలి బుద్ధప్రసాద్ ఆర్థిక సౌజన్యమందిస్తున్నారు. 2020వ సంవత్సరానికి ఈ అవార్డును అహ్మదాబాద్ ఆంధ్ర మహాసభకు, 2021వ సంవత్సరానికి, అమెరికాలో నివసిస్తున్న డా.ప్రసాద్ తోటకూర (అమెరికా)కు ఆగస్టు 4వ తేదిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రదానం చేస్తున్నది. 

డా. గంధం సుబ్బారావు

(నేడు మండలి వెంకటకృష్ణారావు 95వ జయంతి)