ప్రాణం తీసిన కులవివక్షత

ABN , First Publish Date - 2021-08-02T20:26:55+05:30 IST

తాను ఇష్టపడిన వ్యక్తితో సంతోషంగా జీవించాలని ఆమె కలలకన్నది.

ప్రాణం తీసిన కులవివక్షత

మంచిర్యాల జిల్లా: తాను ఇష్టపడిన వ్యక్తితో సంతోషంగా జీవించాలని ఆమె కలలుకన్నది. తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకుంది. పెళ్లయిన కొన్నాళ్లకే కులం వేధింపులు ఎదుర్కొంది. ఆ వేధింపులు భరించలేక తనువు చాలించింది. తన మానసిక క్షోభను మూడు పేజీల్లో రాసి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా, చెన్నూరులో జరిగింది.


కోటపల్లి మండలం, శిరిష, పుల్లగామ గ్రామాలకు చెందిన పెండ్యాల కిరణ్ కుమార్, వెన్నెలకు రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. కిరణ్ బీసీ, వెన్నెల ఎస్సీ. ఈ క్రమంలో వెన్నెలను ప్రేమిస్తున్నానంటూ కిరణ్ వెంటపడ్డాడు. కులపరమైన ఇబ్బందులు ఉంటాయని పెళ్లికి ఆమె తిరస్కరించింది. నిజమైన ప్రేమకు మతం, కులం అడ్డురాదంటూ కిరణ్ నమ్మించాడు. పెద్దలను ఎదిరించి ఏడాదిన్నర క్రితం వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత చెన్నూరులోనే కాపురం పెట్టారు. కొద్ది రోజులపాటు బాగానే ఉన్నారు. క్రమంగా వెన్నెలకు కులం వేధింపులు మొదలయ్యాయి.


ప్రేమకు కులం అడ్డురాదంటూ భీరాలు పలికిన భర్త కిరణ్ కులం పేరుతో అవమానిస్తుంటే వెన్నెల తట్టుకోలేకపోయింది. ఎవరికీ చెప్పుకోలేక లోలోపల కుమిలిపో్యింది. రెండు రోజుల క్రితం తాను అనుభవించిన మానసిక క్షోభను, కులం వివక్షను మూడు పేజిల్లో రాసింది. తర్వాత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మంచిర్యాలలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ‘నేను నీతో ఉండలేను.. నా తల్లిదండ్రులకు ముఖం చూపించలేను.. అలా అని బయటకు వెళితే మరో సంబంధం అంటగట్టి ప్రచారం చేస్తారు.. అందుకే చనిపోతున్నా’ అంటూ వెన్నెల రాసిన లేఖ అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది.

Updated Date - 2021-08-02T20:26:55+05:30 IST