మానేరు ఇసుకపై సర్కారు కన్ను!

ABN , First Publish Date - 2022-02-06T09:33:37+05:30 IST

మానేరు వాగులోని ఇసుకపై సర్కారు కన్నేసింది..

మానేరు ఇసుకపై సర్కారు కన్ను!

చెక్‌డ్యామ్‌లకు ఇసుక అవరోధమని అధికారుల నివేదిక..

2 మీటర్ల లోతు వరకు తొలగించాలని నిర్ణయం

25 రీచుల్లో ఇసుక తోడేందుకు టెండర్ల ఆహ్వానం

రూ.862 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా

భూగర్భ జలాలు అడుగంటుతాయని స్థానికుల ఆందోళన

కోర్టును ఆశ్రయిస్తామన్న జడ్పీటీసీ సభ్యుడు


పెద్దపల్లి, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): మానేరు వాగులోని ఇసుకపై సర్కారు కన్నేసింది. అంతే.. అధికారులు ఇసుక తవ్వుకునేందుకు వీలుగా నివేదిక ఇచ్చేశారు! పెద్దపల్లి జిల్లాలోని మానేరు వాగుపై నిర్మిస్తున్న చెక్‌డ్యామ్‌ల్లో నీటి సామర్థ్యం పెరగడానికి ఇసుక అడ్డుగా ఉందని తేల్చారు. 2 మీటర్ల లోతు వరకు ఇసుకను తొలగించాలనీ సూచించారు! ఫలితంగా చెక్‌డ్యామ్‌ల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరగడమేగాక ప్రభుత్వానికి రూ.862 కోట్ల మేరకు ఆదాయం వస్తుందనీ తెలిపారు. రాబడి వస్తుందంటే సర్కారు ఆగుతుందా..? వెంటనే రంగంలోకి దిగిన అధికారులు కొత్తగా గుర్తించిన ఇసుక క్వారీలను టీఎ్‌సఎండీసీ ఆధ్వర్యంలో నిర్వహించాలని నిర్ణయించారు. ఆన్‌లైన్‌ టెండర్లు ఆహ్వానించారు. ఈ నెల 28 వరకు గడువు కూడా విధించారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. స్థానికులు మాత్రం ఇసుక తవ్వకాలు వద్దంటున్నారు. ఇక్కడి నుంచి ఇసుకను తరలిస్తే భూగర్భ జలాలు అడుగంటిపోతాయని, రోడ్లు ధ్వంసమవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


చెక్‌డ్యామ్‌ల నిర్మాణం..

పెద్దపల్లి జిల్లాలో విస్తరించిన మానేరు వాగుపై సుల్తానాబాద్‌, ఓదెల, కాల్వశ్రీరాంపూర్‌, ముత్తారం, మంథని మండలాల పరిధిలో సమారు రూ.280 కోట్ల అంచనా వ్యయంతో చెక్‌డ్యామ్‌లను చేపట్టారు. భారీ వర్షాలు, వరదలకు నీరుకుళ్ల వద్ద నిర్మిస్తున్న చెక్‌డ్యామ్‌, మడక వద్ద నిర్మించిన చెక్‌డ్యామ్‌లకు గండ్లు పడి చాలా వరకు కొట్టుకుపోయాయి. దీంతో పలు చోట్ల చెక్‌డ్యామ్‌ల పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం కొన్ని పనులు జరుగుతున్నాయి. భారీగా ఇసుక పేరుకుపోయి ఉండడంతో చెక్‌ డ్యామ్‌ల నిర్మాణాలకు ఇబ్బందిగా మారిందని, నీటి సామర్థ్యం కూడా తక్కువగా ఉంటుందని అధికారులు నివేదించారు. గత ఆగస్టు 30నకలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. చెక్‌డ్యామ్‌ల లోపల ఏ మేరకు ఇసుక ఉందనే విషయమై చర్చించారు. నీటి పారుదల శాఖ, రెవెన్యూ, గనులు, భూగర్భ, టీఎ్‌సఎండీసీ అధికారులు సంయుక్తంగా మానేరు వాగుపై నిర్మిస్తున్న చెక్‌డ్యామ్‌ల వద్ద సర్వే నిర్వహించాలని నిర్ణయించారు. ఆ మేరకు సర్వే చేసిన అధికారులు చెక్‌డ్యామ్‌ల లోపల 6.5 మీటర్ల లోతు వరకు ఇసుక ఉందని, 2 మీటర్ల వరకు ఇసుకను తరలిస్తే నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుందని నివేదించారు. జిల్లాలో 24 చెక్‌డ్యామ్‌లకు గాను 18 చెక్‌డ్యామ్‌ల లోపల ఇసుక తీసుకునేందుకు అవకాశాలు ఉన్నాయని, భూగర్భ జలాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని పేర్కొన్నారు. 


25 ఇసుక రీచ్‌ల గుర్తింపు..

సుల్తానాబాద్‌, ఓదెల, కాల్వశ్రీరాంపూర్‌, ముత్తారం, మంథని మండలాల్లో 25 ఇసుక రీచ్‌లను గుర్తించారు. ఈ రీచుల నుంచి 2 మీటర్ల లోతున.. 350-1700 మీటర్ల పొడవు, 120-645 మీటర్ల వెడల్పు విస్తీర్ణంలో 1.32 కోట్ల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను తరలించాలని నిర్ణయించారు. ఈ మేరకు టీఎ్‌సఎండీసీ ఆన్‌లైన్‌ ద్వారా టెండర్లను ఆహ్వానించింది. అయితే మానేరు నుంచి ఇసుకను తరలించడం వల్ల భూగర్భ జలాలు అడుగంటుతాయని, తమకు ఇసుక దొరకదని స్థానికులు అంటున్నారు. రెండేళ్ల పాటు నిర్వహించే ఈ రీచ్‌ల నుంచి ఇసుకను తరలించడం వల్ల రోడ్లన్నీ దెబ్బతింటాయని, దుమ్ము, ధూళితో ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటాయని చెబుతున్నారు. ఈ వాగుపై జిల్లా అధికార యంత్రాంగం నిర్వహిస్తున్న శాండ్‌ ట్యాక్సీ విధానం వల్ల అనేక మంది ట్రాక్టర్ల యజమానులకు, కూలీలకు ఉపాధి లభిస్తోందని, ఇసుక రీచులతో ఉపాధి లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా భూగర్భ జలాలు అడుగంటిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు ఇచ్చారని, దీనిపై కోర్టును ఆశ్రయిస్తానని ఓదెల జడ్పీటీసీ సభ్యుడు గంట రాములు చెప్పారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇసుక రీచ్‌ల టెండర్లను నిలిపివేయాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - 2022-02-06T09:33:37+05:30 IST