Abn logo
May 12 2021 @ 00:24AM

ఒకప్పుడు బాలకార్మికుడు... ఇప్పుడు ఆకలి తీరుస్తున్నాడు

ఎంత సంపాదించామన్నది కాదు... ఆ సంపాదించిన దాంట్లోనే ఎంతోకొంత పరోపకారానికి ఉపయోగించడం ముఖ్యమంటాడు మల్లేశ్వరరావు. హైదరాబాద్‌కు చెందిన ఈ యువకుడు ఒకప్పుడు బాల కార్మికుడు. వీధుల్లో పడుకున్నాడు. పస్తులున్నాడు. ఆకలి బాధ తెలుసు కనుకనే ఇప్పుడు వేల మందికి అన్నం పెడుతున్నాడు. కరోనా కోరలు చాచిన వేళ... రేషన్‌ కిట్లు, ఆక్సిజన్‌ సిలిండర్లవంటి అత్యవసర సేవలు అందిస్తున్నాడు... 


మల్లేశ్వరరావుది వ్యవసాయ కుటుంబం. రాజమండ్రి సొంత ఊరు. కొంతకాలం అతడి కుటుంబం మహారాష్ట్ర నాగ్‌పూర్‌ వెళ్లింది. అక్కడి తాతగారి పొలంలో పనిచేశారు. అంతా బానే జరుగుతుందనుకున్న సమయంలో భారీ వర్షాలతో చేతికొచ్చిన పంట నేలపాలైంది. దీంతో జీవనాధారం పోయింది. బతుకుదెరువు కోసం పొట్ట చేతపట్టుకుని నిజామాబాద్‌ వచ్చింది అతడి కుటుంబం. ‘‘పంట కోసం చేసిన అప్పులు తీర్చడానికి ఉన్న భూమినంతా నాన్న అమ్మేశారు. ఆ దెబ్బకు మళ్లీ కోలుకోలేదు. రోడ్డున పడ్డాం. నిజామాబాద్‌ వచ్చాక ఇల్లు గడవడానికి అమ్మానాన్న వ్యవసాయ కూలీలుగా మారారు. పండగలప్పుడు సెలవులతో అంతా సంతోషంగా ఉంటే... మేమేమో ఆ సెలవుల్లో సంపాదన లేక అవస్థలు పడేవాళ్లం. ఉన్నదేదో నాకు, తమ్ముడికి పెట్టి, అమ్మానాన్న మంచినీళ్లు తాగి కడుపు నింపుకునేవారు’’ అంటూ తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నాడు మల్లేశ్వరరావు. 


మలుపు తిప్పిన రోజు... 

అమ్మానాన్నలు సంపాదించేది ఏ మూలకూ సరిపోకపోవడంతో మల్లేశ్వరరావు, అతడి తమ్ముడు కూడా పనికి వెళ్లేవారు. రోజంతా కష్టపడితే వాళ్లకి దక్కేది పది రూపాయలే! ఎనిమిదేళ్ల చిరు ప్రాయం. తోటి పిల్లలు ఆడుకొంటుంటే చూస్తూ ఉండలేక పని వదిలేసి వెళ్లిపోయాడు మల్లేశ్వరరావు. దీంతో ఆ పని పోయింది. కానీ అదే అతడి జీవితాన్ని మలుపు తిప్పింది. 

‘‘మేం ఆడుకొంటుంటే దారిన పోతున్న ఒకాయన మమ్మల్ని చూశారు. మా పరిస్థితి తెలుసుకుని, ఇంటికి వచ్చి మా అమ్మానాన్నలతో మాట్లాడారు. వాళ్లని ఒప్పించి ‘సంస్కార్‌ ఆశ్రమ్‌ విద్యాలయం’లో చేర్పించారు. ఆయన అందులో టీచర్‌గా చేసేవారు. అయితే మరీ చిన్న వయసు కావడంతో తమ్ముడిని చేర్చుకోలేదు. పేద, అనాథ పిల్లలు, బాల నేరస్థులకు అందులో చదువు చెబుతారు. ఆ రోజు నా జీవితం కొత్త మలుపు తిరిగింది’’ అంటూ చెప్పుకొచ్చాడీ 27 ఏళ్ల యువకుడు. 


చదువుకొంటూనే కూలీ పని... 

అయితే అతడు పదో తరగతిలో ఉండగా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆశ్రమ్‌ మూతపడింది. దీంతో రోజు గడవడానికి కూలీగా చేరాడు. అదే సమయంలో ఓ స్నేహితుడి సాయంతో నేచురోపతి ఆశ్రమంలో ఉద్యోగం సంపాదించాడు. అక్కడ పని చేస్తూనే పన్నెండో తరగతి చదువుకున్నాడు. పేషెంట్లు ఇచ్చిన పుస్తకాలతో చదువుకుని పాసయ్యాడు. ‘‘తరువాత ఇంజనీరింగ్‌లో సీటు వచ్చింది. నాకేమీ అర్థంకాక, అవసరమైన స్టడీ మెటీరియల్‌ కొనుక్కోలేక ల్యాబ్స్‌ నుంచి బయటకు వచ్చేవాడిని. చదువుకోవడానికి అవసరమైన డబ్బు సంపాదించడం కోసం ఎవరికీ తెలియకుండా ఓరెస్టారెంట్‌లో వెయిటర్‌గా చేరాను. తెలిస్తే హాస్టల్‌లో ఉండనివ్వరు. ఆ డబ్బుతో కావల్సిన పుస్తకాలు, స్టేషనరీవంటివన్నీ కొనుక్కున్నాను’’ అంటున్న మల్లేశ్వర్‌ను ఓ ఘటన సేవ వైపు అడుగులు వేయించింది. ఆ ‘వడ్డన’తో కొత్త ఆలోచనలు... 

ఒక వేడుక. భారీ స్థాయిలో విందు భోజనం ఏర్పాటు చేశారు. అందులో అతిథులకు వడ్డిస్తున్నాడు మల్లేశ్వర్‌. వచ్చినవారు, రెస్టారెంట్‌ స్టాఫ్‌... అంతా తినగా చాలా ఫుడ్‌ మిగిలిపోయింది. ‘‘ఆకలి బాధ ఏంటో నాకు తెలుసు. ఎంతోమంది ఒక్క పూట తిండి లేక అల్లాడుతున్నారు. ఇక్కడ చూస్తే ఇంత ఆహారం చెత్తబుట్టలోకి వెళ్లిపోతోంది. కానీ అలా జరగడానికి వీల్లేదనుకున్నాను. ‘పారేయకుండా సమీపంలోని అన్నార్తులకు పంచుదామ’ని అక్కడున్నవారిని అభ్యర్థించాను. వారూ సరేనన్నారు. దాదాపు ఎనిమిది వందల ప్యాకెట్లు కట్టి ఆ రోజు వీధుల్లోని వారికి ఇచ్చాము’’ అని మల్లేశ్వర్‌ చెప్పాడు. 


రోజుకు రెండు వేల మందికి... 

ఆ ఘటన తరువాత మల్లేశ్వర్‌ మదిలో కొత్త ఆలోచన పుట్టింది. తరువాత ఆ ఆలోచనే ‘డోన్ట్‌ వేస్ట్‌ ఫుడ్‌’ స్వచ్ఛంద సంస్థగా రూపుదిద్దుకుంది. దీని ద్వారా హైదరాబాద్‌, రాజమండ్రి ప్రాంతాల్లోని అభాగ్యుల కడుపు నింపే మహత్తర కార్యక్రమాన్ని భుజానికెత్తుకున్నాడతడు. 2012లో స్నేహితుడు చక్రధర్‌గౌడ్‌తో కలిసి దీన్ని స్థాపించాడు. రెస్టారెంట్లు, పెళ్లిళ్లు, ఇతర వేడుకలు, పార్టీల్లో మిగిలిపోయిన ఆహారాన్ని సేకరిస్తుందీ సంస్థ. దాన్ని వీధులు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, పార్కులు, ఇతర పబ్లిక్‌ ప్రాంతాలు, మురికివాడల్లో జీవించే ఐదు వందల నుంచి రెండు వేల మందికి ప్యాకెట్లుగా చేసి పంచిపెడుతున్నారు. మొదట్లో మల్లేశ్వర్‌, అతడి స్నేహితుడు మాత్రమే పంపిణీ చేసేవారు. రాను రాను ఐటీ కంపెనీలు కూడా జత కలిసి ఇందులో భాగస్వాములయ్యాయి. అంతేకాదు... తాను చదువుకోవడానికి చిన్నప్పుడు పడిన ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని, తనలా మరే పిల్లవాడూ చదువుకోవడానికి కష్టపడకూడదనుకున్నాడు. దాని కోసం సాధ్యమైనంతమంది పిల్లలకు ప్రాథమిక విద్యనిందించే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. 


ప్రముఖుల ప్రశంసలు... 

మల్లేశ్వరరావు సేవలను నటుడు మాధవన్‌, మహీంద్రా అధిపతి ఆనంద్‌ మహీంద్రా ప్రశంసించారు. ప్రధాని నరేంద్ర మోదీ తన ‘మన్‌కీ బాత్‌’లో అతడిని కొనియాడారు. ‘ఇండియన్‌ యూత్‌ ఐకాన్‌, ద సన్‌ ఆఫ్‌ సాయిల్‌ అవార్డ్‌, కొవిడ్‌ వారియర్‌ అవార్డు వంటివెన్నో గెలుచుకున్నాడు. 


కరోనా సమయంలోనూ... 

కొవిడ్‌తో ఎంతో మంది కూలీల పని పోయింది. ఉపాధి లేక... చేతిలో డబ్బులు ఆడక కాలే కడుపులతో కాలం వెళ్లదీస్తున్న వారిని మల్లేశ్వరరావు తన సంస్థ ద్వారా ఆదుకొంటున్నాడు. క్వారంటైన్‌లో ఉన్నవారికి నిత్యావసర సరుకుల కిట్లు, ఆక్సిజన్‌ సిలిండర్లు అందిస్తున్నాడు. సొంతవారే భయపడుతున్న వేళ కరోనా పేషెంట్లకు వేడి వేడి భోజనం పెడుతున్నాడు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు, ‘మిలాప్‌’ క్రౌడ్‌ ఫండింగ్‌ యాప్‌ ద్వారా నిధులు సేకరిస్తున్నాడు. వాటిని కొవిడ్‌తో అత్యవసర సేవలు, సరైన ఆహారం దొరక్క ఇబ్బంది పడేవారి కోసం ఖర్చు చేస్తున్నాడు. లాక్‌డౌన్‌ సమయంలో రోజుకు వెయ్యి మంది వలస కార్మికుల కడుపు నింపాడు. రోజుకు 20 వేల మందికి భోజనం పెట్టేందుకు ఏర్పాట్లు చేశాడు. వీధి కుక్కలకు కూడా ఫుడ్‌ ప్యాకెట్లు అందించాడు. ‘‘ఆకలిగా ఉన్నవారి కడుపు నింపడంలో ఉన్న సంతృప్తి నాకు మరెందులోనూ రాదు’’ అంటున్న ఈ కుర్రాడి సేవలు నిరుపమానం. 


Advertisement
Advertisement
Advertisement