ప్రవచన భీష్ముడు, అభినవ వ్యాసుడు మల్లాది చంద్రశేఖర శాస్త్రి శివైక్యం

ABN , First Publish Date - 2022-01-15T09:33:36+05:30 IST

అదిగో రామయ్య! ఇదిగో సీతమ్మ! సీతమ్మ ఓరకంట చూసింది..

ప్రవచన భీష్ముడు, అభినవ వ్యాసుడు మల్లాది చంద్రశేఖర శాస్త్రి శివైక్యం

ఉత్తరాయన పుణ్యకాల ప్రారంభ ఘడియల్లో పరమపదం

హైదరాబాద్‌ సిటీ/భద్రాచలం/అమరావతి, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): అదిగో రామయ్య! ఇదిగో సీతమ్మ! సీతమ్మ ఓరకంట చూసింది.. అంటూ భద్రాద్రిలో కల్యాణ సమయంలో రేడియోలో అయినా దూరదర్శన్‌లో అయినా ఆయన వ్యాఖ్యానం చెబుతుంటే.. శ్రీసీతారామ కల్యాణ ఘట్టం కళ్లకు కట్టినట్లే ఉండేది! తిరుమలలో బ్రహ్మోత్సవ వేళ దేవదేవుని వైభవం, తిరుమల ప్రాశస్థ్యం ఆయన చెబుతుంటే చెవులు రిక్కించి వినాల్సిందే! రామాయణ, భారత, భాగవత ప్రవచనాలకు తెలుగునాట ఆయన పెట్టింది పేరు! ‘తింటే గారెలు తినాలి. వింటే మల్లాది వారి ప్రవచనం వినాలి’ అనే నానుడిని సార్థకం చేసిన ప్రవచన భీష్ముడు! ఎన్నో దశాబ్దాలుగా పురాణాలను శాస్త్రబద్ధంగా చెబుతూ, తెలుగు వారిని ధర్మపథం వైపు నడిపించేందుకు కృషి చేసిన ప్రవచన భీష్ముడు, పౌరాణిక సార్వభౌమ, అభినవ వ్యాసుడు, మహామహోపాధ్యాయ మల్లాది చంద్రశేఖర శాస్త్రి (96) శివ సాయుజ్యం పొందారు. కొంత కాలంగా వయో భారంతో బాధ పడుతున్న ఆయన శుక్రవారం సాయంత్రం 5.15 గంటలకు హైదరాబాద్‌ అశోక్‌ నగర్‌లోని తన స్వగృహంలో పరమపదించారు. ఈ ఏడాది శుక్రవారం మధ్యాహ్నం 2.40 గంటలకు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించాడని, ఉత్తరాయన పుణ్యకాల ప్రారంభ ఘడియల్లో చంద్రశేఖర శాస్త్రి శివైక్యం చెందారని పౌరాణికులు చెబుతున్నారు. ఆయనకు భార్య సీతారామ ప్రసన్న లక్ష్మి, ఆరుగురు కుమారులు రామకృష్ణ, వీరరాఘవశర్మ, రామనాథ్‌, రామారావు, దత్తాత్రేయ, దక్షిణామూర్తి, ఇద్దరు కుమార్తెలు ఆదిలక్ష్మి, సరస్వతి ఉన్నారు. కుమారులంతా వివిధ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. వీరి కుమారుల్లో ఒకరు (రాఘవ) టీవీ నటునిగా కూడా సుపరిచితులు. ఆయన పార్థివ దేహానికి శనివారం ఉదయం అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.


భద్రాద్రి రేడియో వ్యాఖ్యానానికి శ్రీకారం

భద్రాద్రిసీతారామ కల్యాణం రోజు రేడియోలో వ్యాఖ్యానం చెప్పే సంప్రదాయాన్ని మొదలు పెట్టింది మల్లాది వారే. ఎన్టీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వపక్షాన ఉగాది పండుగ రోజున పంచాంగ పఠనం మొదలుపెట్టింది ఆయనే. ఎన్టీఆర్‌ సీఎంగా ఉన్నన్ని రోజులు రవీంద్ర భారతిలో ఆయనే పంచాంగ పఠనం చేసేవారు. శ్రావ్యమైన స్వరం, రామాయణ, భారత, భాగవతాలపై పట్టు కారణంగా ఆయన పురాణ ప్రవచనాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. తన 15వ ఏటనే ప్రారంభించిన ఈ ప్రవచన యజ్ఞాన్ని చివరి వరకూ ఆయన అసిధారావ్రతంగా కొనసాగించారు. చంద్రశేఖర శాస్త్రి 1925 ఆగస్టు 28న గుంటూరు జిల్లా క్రోసూరు మండలం హసనాబాద్‌లో జన్మించారు. నైష్టికుడు, శ్రౌత, స్మార్త, తర్క, మీమాంస, వేదాంతంలో మహా పండితులైన రామకృష్ణ చయనులు ఈయనకు తాతగారు. ఆయన వద్దనే తర్క ప్రకరణాలు, శ్రౌత  స్మార్తాలు అభ్యసించారు.


చంద్రశేఖర శాస్త్రి తండ్రి దక్షిణామూర్తి పుష్పగిరి ఆస్థాన పండితులుగా ఖ్యాతి గడించారు. చంద్రశేఖర శాస్త్రి  తొలి ప్రవచనం స్వగ్రామం అమరావతిలో భాస్కర రామాయణం చెప్పడంతో ప్రారంభమైంది. 19 ఏళ్ల వయసులోనే  శ్రీమద్రామాయణంపై ఆయన ప్రవచనం చేశారు. 1950లోనే 10 వేల మందికి వినపడేలా తన కంచు కంఠంతో గుంటూరులో ఆయన ప్రవచనం చెప్పారు. ఉపన్యాసం, హరికథ, నాటకం, పురాణం కలిపి శ్రోతలను ఆకట్టుకునే విధంగా పురాణ ప్రవచనం చేయడంలో మల్లాది సుప్రసిద్ధులు. తెలుగు, సంస్కృత భాషల్లో ప్రవచనాలతోపాటు ధర్మ సందేహాలను తీర్చడంతో శ్రోతల అభిమానం చూరగొన్నారు. వెంకటేశ్వర భక్తి చానల్‌, దూరదర్శన్‌లలో ఆయన ప్రవచనాలు ప్రసారమయ్యాయి. ఆయన ఉగాది పంచాంగ పఠనం ప్రపంచవ్యాప్తంగా తెలుగువారిలో ప్రఖ్యాతిగాంచింది. పురాణాలపై చేసిన రచనలు, వ్యాఖ్యానాలతో అభినవ వ్యాసుడిగా కీర్తిగడించారు. అప్పటి ప్రభుత్వం పురాణ ప్రవచనాలపై శిక్షణ ఇచ్చేందుకు కాలేజీని ఏర్పాటు చేసి, దానికి మల్లాది వారిని ఆచార్యునిగా నియమించింది. తన ప్రవచనాల్లో అమరావతి క్షేత్రం గురించి గొప్పగా చెప్పడం ఆయనకు తన స్వగ్రామంపై అభిమానం, ప్రేమ వ్యక్తమవుతుంది. 2005లో ఆయన రాజాలక్ష్మి అవార్డు అందుకున్నారు. శృంగేరి శంకర మఠం ఆయనకు సవ్యసాచిగా; సనాతన ధర్మ ట్రస్టు విశిష్ఠ పౌరుడి పురస్కారం అందజేసింది.


 పురాణాలతోపాటు జంధ్యాల పాపయ్య శాస్త్రి, గొట్టిముక్కల, ధూళిపాళ వంటి వారి పద్య కావ్యాలు, గుర్రం జాషువా గబ్బిలం, ఫిరదౌసి వంటి ఖండ కావ్యాలు చదివానని, నాటకాలంటే తనకు చాలా ఇష్టమని ఆయన చెబుతుండేవారు. టీటీడీ శాశ్వత ఆస్థాన పండితునిగా కూడా ఆయన పని చేశారు. దాదాపు 250 వరకూ రామాయణ ప్రవచనాలు, 300కుపైగా మహాభారత ప్రవచనాలు, 200కు పైగా భాగవత ప్రవచనాలు ఆయన చెప్పారు. 2011 నుంచి బయట పురాణ ప్రవచనాలు ఆపేసినా.. పలు భక్తి చానళ్లతోపాటు దూరదర్శన్‌లో మాత్రం అప్పుడప్పుడూ చెబుతూ ఉండేవారు. పలు సినిమాల్లో నటించాల్సిందిగా ఆహ్వానాలు అందాయని, వాటిని సున్నితంగా తిరస్కరించానని చెప్పేవారు. మల్లాది చంద్రశేఖర శాస్త్రి మరణ వార్త తెలిసి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ సీఎం జగన్‌, ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ తదితరులు సంతాపం తెలిపారు. ఆధ్యాత్మిక జ్ఞానం, సామాజిక దృక్పథాల సమ్మేళనంగా సాగిన మల్లాది ప్రవచనాలు జనులకు మార్గనిర్దేశం చేసేవని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని వెంకయ్య నాయుడు ట్విటర్లో పేర్కొన్నారు.


నవమి కల్యాణ వ్యాఖ్యానంలో దిట్ట

శ్రీరామనవమి కల్యాణ వ్యాఖ్యానంలో మల్లాది చంద్రశేఖర శాస్త్రి దిట్ట అని, ఆయనకు భద్రాద్రితో అజరామరమైన అనుబంధం ఉందని భద్రాచలం వైదిక, పరిపాలన సిబ్బంది, పలువురు ప్రముఖులు గుర్తు చేసుకున్నారు. చంద్రశేఖర శాస్త్రి శివైక్యం పొందడంపై దేవస్థానం విశ్రాంత ఈవో రామకృష్ణరాజు, ప్రధాన అర్చకుడు పొడిచేటి రామచంద్రాచార్యులు, సంస్కృత పండితులు ఎస్‌టీజీ శ్రీమన్నారాయణాచార్యులు సంతాపం తెలిపారు.

Updated Date - 2022-01-15T09:33:36+05:30 IST