బీసీల హృదయాలను మళ్లీ గెలుచుకుంటాం

ABN , First Publish Date - 2020-05-29T08:23:40+05:30 IST

కొన్ని కారణాల వల్ల బీసీల్లోని కొన్ని వర్గాల్లో తెలుగుదేశం పార్టీపై కొన్ని అపోహలు వచ్చాయని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు.

బీసీల హృదయాలను  మళ్లీ గెలుచుకుంటాం

  • కొన్ని కారణాలతో వారిలో అపోహలు
  • దూరమైన ప్రతి వర్గానికీ చేరువ
  • ఇక ముందు యువతకు కీలక బాధ్యతలు
  • పార్టీకి సమయం ఇవ్వలేకపోయాను
  • ఈసారి ఆ పొరపాటు జరగనివ్వను
  • టీడీపీకి పూర్వవైభవం తీసుకొస్తా
  • అరాచక పాలనపై మడమ తిప్పని పోరు
  • ఏడాదిలో ఆర్థిక వ్యవస్థ నాశనం
  • మనపై అప్పట్లో దుష్ప్రచారం చేశారు
  • ఇప్పుడూ కొనసాగిస్తున్నారు
  • దీనిని బలంగా ఎదుర్కొందాం
  • పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు
  • మహానాడులో ముగింపు ప్రసంగం

అమరావతి, మే 28(ఆంధ్రజ్యోతి): కొన్ని కారణాల వల్ల బీసీల్లోని కొన్ని వర్గాల్లో తెలుగుదేశం పార్టీపై కొన్ని అపోహలు వచ్చాయని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. వాటిని పోగొట్టి మళ్లీ వారి హృదయాలను గెలుచుకుంటామని ప్రకటించారు. రెండు రోజులపాటు జరిగిన మహానాడులో గురువారం సాయంత్రం ఆయన ముగింపు ప్రసంగం చేశారు. ఆయా తీర్మానాలపై జరిగిన చర్చల్లోనూ మాట్లాడారు. దూరమైన ప్రతి వర్గాన్ని దరి చేర్చుకోవడానికి తమ పార్టీ హృదయపూర్వకంగా కృషి చేస్తుందన్నారు. మాదిగలతోపాటు ఇతర బడుగు బలహీన వర్గాల వారిని కలుపుకొని పనిచేసి పార్టీకి పూర్వ వైభవం తెస్తామని చెప్పారు. రాబోయే రోజుల్లో యువతకు పార్టీలో అధిక ప్రాధాన్యం ఇస్తామని, కీలక బాధ్యతలిచ్చి ప్రోత్సహిస్తామన్నారు. మహిళలు లేకుండా టీడీపీ లేదని, వారికి కూడా సముచిత ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ‘కొత్త రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలని, ఆర్థికంగా బాగు చేయాలని మనం తపించాం.


కానీ ఈ ప్రభుత్వం ఏడాదిలోనే ఆర్థిక వ్యవస్థను నాశనం చేసింది. జగన్‌ది విధ్వంసక పాలన. ఒక్క ఏడాదిలోనే అనేక వర్గాల వారికి నరకం చూపించారు. తనది దుర్మార్గ పాలన అని ముద్ర వేయించుకున్నారు. ఇక్కడ ఆటవిక రాజ్యం నడుస్తోందన్న అభిప్రాయాన్ని దేశమంతా కలిగించుకుంటున్నారు. మనం అధికారంలో ఉన్నప్పుడు మనపై దుష్ప్రచారం చేశారు. ఇప్పుడూ అదే పని చేస్తున్నారు. పౌరుల ప్రాథమిక హక్కులు హరిస్తున్నారు. ప్రజాస్వామ్యానికి నాలుగు స్తంభాల వంటి రంగాలను కూడా వదిలిపెట్టడం లేదు. అడుగడుగునా నియంత పోకడలు పోతున్నారు. వీటిని మనం బలంగా ఎదుర్కొని తీరాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి’ అని కార్యకర్తలకు పిలుపిచ్చారు. పార్టీలో అందరం ఒక కుటుంబం వంటివారమని, గతంలో ప్రజలకు ఎక్కువ సమయం ఇచ్చి పార్టీలో ఉన్నవారికి ఇవ్వలేకపోయానని... ఈసారి అటువంటి పొరపాటు జరగనివ్వనని హామీ ఇచ్చారు.


జిల్లా కమిటీల స్ధానంలో పార్లమెంటు కమిటీలు

పార్టీలో సంస్ధాగత నిర్మాణానికి సంబంధించి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఇప్పటివరకూ ఉన్న జిల్లా కమిటీల స్ధానంలో ఇకపై పార్లమెంటు నియోజకవర్గ కమిటీలు వేయబోతున్నట్లు వెల్లడించారు. జిల్లా స్ధాయిలో ఇకపై సమన్వయ కమిటీలు ఉంటాయన్నారు. ఇప్పటికే తెలంగాణలో పార్లమెంటు నియోజకవర్గ కమిటీలు వేశామని, ఆంధ్రలో కూడా ఇదే విధానాన్ని విస్తరిస్తామని చెప్పారు. 20 అనుబంధ సంఘాలను పటిష్ఠం చేస్తామని, అవి క్రియాశీలంగా పనిచేసేలా చూస్తామన్నారు. ‘పార్టీని వీడి వెళ్లిపోయినవారిని మళ్లీ తీసుకునేది లేదు. దూరమైన వర్గాలను దరి చేర్చుకోవడం వేరు.


పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఇక్కడ పదవులు అనుభవించి అధికారం పోగానే కొంత మంది వెళ్లిపోయారు. అటువంటి వారి విషయంలో కఠినంగా ఉంటాం. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచి పనిచే సిన వారిని గుర్తించి ప్రాధాన్యమిస్తాం. టీడీపీ ఒక ఫ్యాక్టరీ వంటిది. ఇక్కడ నాయకత్వానికి కొదవ లేదు. ఇక్కడి నుంచి వెళ్లిపోయిన వారు మరి కొందరిని తీసుకెళ్లడానికి కుట్రలు పన్నుతున్నారు. ఎవరెన్నిచేసినా టీడీపీని ఏమీ చేయలేరు. ఎంత మంది పోయినా అంతకు మించిన సంఖ్యలో కార్యకర్తలను, నాయకులను తయారు చేసుకునే శక్తి పార్టీకి ఉంది’ అని పేర్కొన్నారు. 60 లక్షల మంది పార్టీలో సభ్యులుగా ఉన్నారని, వీరిలో సమర్థులను గుర్తించి పైకి తీసుకొస్తామని తెలిపారు. పార్టీ ఒక పిలుపు ఇస్తే 15 వేల మంది ఆన్‌లైన్‌ మహానాడులో క్రమశిక్షణతో పాల్గొన్నారని, మరి కొన్ని వేల మంది ఇతర మాధ్యమాల ద్వారా చూశారని చెప్పారు. ‘ఓటమితో నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. టీడీపీ పుట్టిన తర్వాత ఐదుసార్లు గెలిచాం. నాలుగుసార్లు ప్రతిపక్షంలో ఉన్నాం. 1989లో 8.5 శాతం ఓట్లతో ఓడిపోయి.. తర్వాతి ఎన్నికల్లో 17.5 శాతం తేడాతో గెలిచాం.


మొన్న మనకు నలభై శాతం ఓట్లు వచ్చాయి. పది శాతం తేడా కనిపిస్తున్నా రాయలసీమలోనే తేడా ఎక్కువ ఉంది. దీనికి కారణాలేమిటో అన్వేషించుకుని పార్టీని మళ్లీ బలోపేతం చేద్దాం’ అని చెప్పారు. ఎన్టీఆర్‌ ఉన్నప్పుడు ఆయనపై కూడా దాడి చేశారని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇటువంటి వాటికి ఓర్చుకోవాలని సూచించారు. దేశ చరిత్రలో మొదటిసారి ఆన్‌లైన్‌లో పార్టీ మహానాడు నిర్వహించామని, దీనికి అవసరమైన సాంకేతిక ఏర్పాట్లను లోకేశ్‌ బృందం బాగా చూసుకుని విజయవంతం చేసిందని  ప్రశంసించారు. దీనికి రెండు తెలుగు రాష్ట్రాలే కాక అమెరికా, యూరప్‌, ఆస్ట్రేలియా, గల్ఫ్‌ దేశాలకు చెందిన అనేక మంది ఆన్‌లైన్‌లో హాజరై విజయవంతం చేశారని, ఇదొక చరిత్రగా మిగిలిపోతుందని అన్నారు. దీని విజయవంతానికి కృషి చేసిన పార్టీ నేతలు, రాష్ట్ర కార్యాలయ నాయకులకు అభినందనలు తెలిపారు.


అమరావతిపై తప్పుడు ప్రచారం

‘’రైతుల భాగస్వామ్యంలో రాజధాని నిర్మాణానికి మేం శ్రీకారం చుట్టి, ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాం.  28,500 మంది రైతులు 33 వేల ఎకరాలు ఉదారంగా ఇచ్చారు. రాజధాని నిర్మాణాన్ని సక్సెస్‌ చేసి, అన్ని ప్రాజెక్టుల్లో రైతుల్ని భాగస్వామ్యం చేయాలని భావించాం. కానీ వైసీసీ అమరావతికి లక్ష కోట్లు అవుతుందని విష ప్రచారం చేసింది. ఒకటికి పదిసార్లు ఇలాగే చెప్పి నాశనం చేసింది. కులం,మతం అంటూ ప్రజలను నమ్మించింది. అధికారంలోకి వచ్చాక అభివృద్ధి చేతకాక విచ్ఛిన్నం చేస్తున్నారు. రాష్ట్రానికి కావాల్సిన ఆదాయం ఇచ్చే అమరావతిని రాష్ట్రానికి భారం అంటున్నారు. సైబరాబాద్‌ నిర్మాణ సమయంలోనూ ఇలాగే తప్పుడు ప్రచారం చేశారు.


కానీ ఇప్పుడు సైబరాబాద్‌ వల్ల ఉన్న ఉపాధి, ఉద్యోగాలు, ఆదాయం చూస్తే తెలుస్తుంది. నాడు నిర్మించిన నాలెడ్జ్‌ సెంటర్‌ నేడు తెలంగాణాకు గుండెలా మారింది. 162 రోజులుగా ఆందోళన చేస్తున్న అమరావతి రైతులకు అండగా ఉంటాం. వందేళ్లకు వీలుగా డిజైన్‌ చేసిన అమరావతి పూర్తయితే ఆదాయం, స్ధానికంగా ఉపాధి, ఉద్యోగాలు వచ్చేవి. అమరావతిలో అవినీతి అంటున్న జగన్‌ ఏడాదిగా ఏం చేశారు? పనికిమాలిన కమిటీలతో తప్పుడు రిపోర్టులు ఇప్పించి, రాజధాని తరలించాలని చూసే హక్కు వైసీపీకి ఎవరిచ్చారు? ప్రభుత్వం మారినప్పుడుల్లా రాజధాని మారుస్తారా?’


అప్పులు తప్ప చేసిందేమీ లేదు

‘ఏడాది కాలంలో సీఎం జగన్‌ అప్పులు చేయడం తప్ప చేసిందేమీ లేదు. రాష్ట్ర సొంత రాబడులు 2018-19లో రూ.62 వేల కోట్లు ఉంటే.. ఇప్పుడు రూ.58 వేల కోట్లకు పడిపోయింది. కేంద్ర రాబడులు రూ.52 వేల కోట్లుంటే రూ.46వేల కోట్లకు తగ్గిపోయాయి. అప్పులు మాత్రం రూ.43 వేల కోట్ల నుంచి రూ.86 వేల కోట్లకు పెరిగాయి. ఇదీ జగన్‌ చేసిన అభివృద్ధి.’


తప్పుడు కేసులతో అడ్డుకోలేరు

‘ప్రభుత్వ తప్పులను ఎండగట్టడం ప్రతిపక్షాల కర్తవ్యం. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా కాపాడడం వాటి బాధ్యత. కానీ తప్పుడు కేసులతో వాటిని అడ్డుకోలేరు. నల్లచట్టం తెచ్చి మీడియాను వేధిస్తున్నారు. సోషల్‌ మీడియా కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికలను పరిహాసం చేశారు. నామినేషన్ల దాఖలు ప్రక్రియను నవ్వుల పాల్జేశారు. నామినేషన్‌ పత్రాలు లాక్కుపోయిన వాళ్లపై కేసుల్లేవు.


పోలీసుల కళ్ల ముందే అభ్యర్థులను బెదిరిస్తే చర్యల్లేవు. ప్రతిపక్షాల అభ్యర్థులపై ఎదురు కేసులు బనాయిస్తారా? వైసీపీ దయాదాక్షిణ్యాలపై నేను రాష్ట్రంలో పని చేయాలా? నా ప్రాథమిక హక్కులను కూడా హరిస్తారా? చట్టాన్ని గౌరవించకపోవడం వల్లే పోలీసులు చులకనయ్యారు. లా అండ్‌ అర్డర్‌ ఏకపక్షంగా నిర్వహించలేరు. ఒక పార్టీని కట్టడి చేసి మరో పార్టీని నేరాలకు పురిగొల్పడం మంచిది కాదు. ఎవరిపై  కేసులు పెట్టాలి, ఎవరిని బెదిరించాలి, ఎందరి ఆస్తులు దోచుకోవాలి,  ఇందుకోసమేనా సీఎం సలహాదారుల నియామకం?’

Updated Date - 2020-05-29T08:23:40+05:30 IST