మహాలయం.. మోక్షాలయం

ABN , First Publish Date - 2020-09-02T09:35:45+05:30 IST

..అని గీతా వచనం. ధూమము, రాత్రి, కృష్ణ పక్షము, ఆరు నెలల దక్షిణాయనం.. ఇవన్నీ పితృయాన మార్గ అవయవాలు. శరీరమును విడిచిపెట్టినవారు ఈ పితృ మార్గంలో చంద్ర లోకానికి వెళ్లి తిరిగి ఈ ప్రపంచంలోకి వస్తారు.

మహాలయం.. మోక్షాలయం

  • ధూమో రాత్రి స్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనమ్‌
  • తత్ర చాంద్రమసం జ్యోతిర్యోగీ ప్రాప్య నివర్తతే

..అని గీతా  వచనం. ధూమము, రాత్రి, కృష్ణ పక్షము, ఆరు నెలల దక్షిణాయనం.. ఇవన్నీ పితృయాన మార్గ అవయవాలు.  శరీరమును విడిచిపెట్టినవారు ఈ పితృ మార్గంలో చంద్ర లోకానికి వెళ్లి తిరిగి ఈ ప్రపంచంలోకి వస్తారు. అటువంటి దక్షిణాయనంలో.. ఆషాఢ పూర్ణిమ నుంచి అయిదవ పక్షమైన భాద్రపద బహుళ పక్షములోని పదిహేను రోజులకు మహాలయపక్షము అని పేరు. ఈ పక్షమునందు తమ వంశంలో గతించిన పితరులకు తిల తర్పణాలు ఇవ్వడం, పార్వణ విధానంలో శ్రాద్ధమును నిర్వహించడం చేస్తే పితరులు శాశ్వతంగా బ్రహ్మలోకాన్ని పొందుతారట. మహాలయం అంటే ఇదే. తిరిగి జన్మనెత్త వలసిన అవసరం లేకుండా పూర్తిగా తమ తమ ఇష్టదేవతా లోకాలలో శాశ్వత స్థానాన్ని పొందటమే.


ఆ పరమాత్మలో లీనం కావడమే. కన్యారాశి యందు సూర్యుడు ప్రవేశించి ఉండగా భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య పర్యంతం ఈ మహాలయం సంభవిస్తే దానికి గజచ్ఛాయ అని పేరు. ఈ మహాలయం నాడు తండ్రి పక్షాన మరణించిన ముత్తాత, తాతమ్మ,  తాత, నాయనమ్మ, తండ్రి, తల్లి, పెద తండ్రి, పిన తండ్రి, మేనత్తలు, తదితర బంధువర్గంలో వారందరికీ, అలాగే తల్లి పక్షాన మరణించిన ముత్తాత, తాతమ్మ, తాత, అమ్మమ్మ, పెద్దమ్మ, పెద తండ్రి, పిన్నమ్మ, పిన తండ్రి, మేనత్తలు తదితర బంధువర్గం వారందరికీ శ్రాద్ధ కర్మ నిర్వహించాలి. ఇలా చేయడం వల్ల మరణించిన వారికి మోక్షం రావడమే కాదు.. ఆ శ్రాద్ధకర్మ నిర్వహించిన వారికి కూడా శ్రేయస్సు కలుగుతుందట.


ఈ మహాలయపక్షంలో ఒక్కో తిథినాడు చేసే శ్రాద్ధ కర్మకు ఒక్కో రకమైన విశేషం, ప్రాశస్త్యం ఉన్నాయి. భాద్రపద బహుళ పాడ్యమి నాడు శ్రాద్ధ కర్మ నిర్వహిస్తే ధనలాభం, విదియ నాడు చేస్తే.. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, తదియ నాడు నిర్వహిస్తే ఏదో ఒక విశేషలాభం కలుగుతాయట. చవితి నాడు నిర్వహిస్తే శత్రువులు మిత్రులు అవుతారట. పంచమి నాడు నిర్వహిస్తే సంపద  లబిస్తుంది. షష్ఠి నాడు నిర్వహిస్తే అందరిలో గౌరవాన్ని పొందుతారు. సప్తమి నాడు నిర్వహిస్తే నాయకత్వం లభిస్తుంది. అష్టమి నాడు నిర్వహిస్తే బుద్ధి వికాసం కలుగుతుంది. నవమి నాడు నిర్వహిస్తే పుత్రికలు పుడతారు. దశమి నాడు నిర్వహిస్తే సర్వాభీష్టాలూ తీరుతాయి. ఏకాదశినాడు నిర్వహిస్తే వేద, శాస్త్ర విద్యలు వస్తాయి. ద్వాదశినాడు నిర్వహిస్తే సువర్ణ లాభం, సంతానం, పదవీ లాభం కలుగుతాయి. త్రయోదశినాడు నిర్వహించినవారికి ఆయుర్దాయ వృద్ధి కలుగుతుంది.


చతుర్దశినాడు నిర్వహిస్తే సర్వ జీవ హితుడు అవుతాడు. అమావాస్య నాడు నిర్వహిస్తే అన్ని కోర్కెలూ నెరవేరుతాయని.. ఇది మార్కండేయ మహాముని ఉపదేశమని ‘పరాశర స్మృతి’లో చెప్పబడింది. ఈ శ్రాద్ధ విధివిధానం గురించి ఎవరి ఇంటి పురోహితుల నుంచి వారు తెలుసుకుని ఆచరించాలి అని శాస్త్రం. మన భారతీయ సంప్రదాయంలో.. దేవతలతో సమానమైన స్థానాన్ని పితృ దేవతలకు ఇచ్చారని చెప్పడానికి ఈ మహాలయమే ఒక మహా తార్కాణం. పితృ రుణం తీర్చుకోవడానికి ఇది ఒక అపురూపమైన అవకాశం. ఇది సకల జనశ్రేయోదాయకం.

ఆచార్య రాణి సదాశివ మూర్తి

Updated Date - 2020-09-02T09:35:45+05:30 IST