శైవక్షేత్రాలకు శివరాత్రి శోభ

ABN , First Publish Date - 2020-02-21T08:16:36+05:30 IST

రాష్ట్రంలో శైవక్షేత్రాలు మహాశివరాత్రికి ముస్తాబయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో మహాశివరాత్రి జాతర మహోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి.

శైవక్షేత్రాలకు శివరాత్రి శోభ

ప్రారంభమైన ఉత్సవాలు


ఆంధ్రజ్యోతి నెట్‌వర్క్‌: రాష్ట్రంలో శైవక్షేత్రాలు మహాశివరాత్రికి ముస్తాబయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో మహాశివరాత్రి జాతర మహోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. శనివారం వరకు మూడు రోజులపాటు కొనసాగే మహాశివరాత్రి జాతర మహోత్సవాలకు దాదాపు ఐదు లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉంది. జాతర తొలిరోజు భారీ సంఖ్యలో భక్తులు మూటాముల్లెలతో ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలలో వేములవాడ చేరుకున్నారు. ఆలయ పరిసరాలు, బహిరంగ ప్రదేశాలలో ఏర్పాటు చేసిన చలువ పందిళ్ల కింద బస చేశారు. జాతర సందర్భంగా కోడెమొక్కులు మినహా అన్ని రకాల ఆర్జిత సేవలను రద్దు చేసి నిరంతర దర్శనం ప్రారంభించారు. భక్తులకు దర్శనం సులభంగా సాగడానికి వీలుగా క్యూలైన్లను క్రమబద్దీకరించారు. ఆలయ పరిసరాలు, అనుబంధ దేవాలయాలను రంగులు, విద్యుద్దీపాలతో అలంకరించారు. యాత్రికుల సౌకర్యార్థం పట్టణంలో ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు.  రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ  ఏర్పాటు చేసిన శివార్చన  సాం స్కృతిక కార్యక్రమాన్ని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి  ప్రారంభించారు.  దక్షిణ కాశీగా పేరుగాంచిన కాళేశ్వరాలయానికి ఒకే పానపట్టంపై రెండు లింగాలుండటం ఇక్కడి విశిష్ఠత. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని మహాదేవపూర్‌ మండలం కాళేశ్వరంలో గల పవిత్ర పుణ్యక్షేత్రమైన కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా షురూ అయ్యా యి.  దాదాపు రెండు లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఐనవోలు మల్లికార్జునస్వామి దేవస్థానంలో పాంచాంగిక దీక్షతో త్రికుండాత్మక హోమాలు శైవాగమోత్సవంగా జరుగుతున్నాయి. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలోని కీసరగుట్టలో గురువారం శ్రీభవానీ శివదుర్గ సమేత రామలింగేశ్వరస్వామి కల్యాణ మహాత్సవం జరిగింది.


నేడు రాజన్నకు పట్టువస్త్రాలు 

 శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఈటెల రాజేందర్‌, గంగుల కమలాకర్‌ శ్రీ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. తర్వాత టీటీడీ అధికారులు కూడా స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పిస్తారు. 




చల్లూరులో 45అడుగుల శివలింగం 

రాజాపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం చల్లూరులో 45అడుగుల ఎత్తైన శివలింగం నిర్మించారు. మహాశివరాత్రి పర్వదినం రోజున ఈ లింగానికి పూజలు నిర్వహించనున్నారు. యాదగిరిగుట్టకు 12కిలోమీటర్ల దూరంలో ఉన్న చల్లూరులో దాతలు, గ్రామస్థుల సహకారంతో రూ.50లక్షల వ్యయంతో ఈ శివలింగాన్ని నిర్మించారు. భక్తులు శివలింగాన్ని దర్శించుకునేందుకు ప్రత్యేకంగా మెట్ల మార్గాన్ని కూడా ఏర్పాటు చేశారు. 

Updated Date - 2020-02-21T08:16:36+05:30 IST