మగువలే.. దీర్ఘాయుష్మంతులు

ABN , First Publish Date - 2022-07-20T09:25:54+05:30 IST

రాష్ట్రంలో పురుషుల కంటే.. మగువలే దీర్ఘాయుష్మంతులని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక విభాగం వెల్లడించింది.

మగువలే.. దీర్ఘాయుష్మంతులు

  • రాష్ట్రంలో సగటు ఆయుర్దాయం 73.2..
  • పురుషుల సగటు 69.4 సంవత్సరాలు
  • జాతీయ సగటు కంటే రాష్ట్రంలో ఎక్కువే
  • రాష్ట్ర అర్థ గణాంక, ప్రణాళిక విభాగాల వెల్లడి


హైదరాబాద్‌, జూలై 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పురుషుల కంటే.. మగువలే దీర్ఘాయుష్మంతులని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక విభాగం వెల్లడించింది. మన దగ్గర మహిళల సగటు ఆయుర్దాయం 73.2 సంవత్సరాలుగా ఉంది. అదే పురుషుల విషయంలో సుమారు నాలుగేళ్లు తక్కువగా.. అంటే 69.4 సంవత్సరాలని పేర్కొంది.  దేశ సగటుతో పోలిస్తే.. తెలంగాణ ఆయుర్దాయం భేషుగ్గా ఉందని స్పష్టం చేసింది. దేశంలో మగవారి సగటు ఆయుర్దాయం 66.9 సంవత్సరాలు, మగువల వయసు 70.3 ఏళ్లుగా ఉన్నట్లు వివరించింది. మంగళవారం ఈ మేరకు రాష్ట్ర ప్రణాళిక విభాగం ఓ నివేదికను వవిడుదల చేసింది. 2014-15 నాటికి తెలంగాణ వ్యాప్తంగా పీహెచ్‌సీలు మొదలు ఆస్పత్రుల దాకా హెల్త్‌ ఫెసిలిటీల సంఖ్య 5,741గా ఉండగా.. 2021-22 నాటికి అవి 6,093కు పెరిగినట్లు వెల్లడించింది. బస్తీ దవాఖానాలే కొత్తగా 259 ఏర్పాటయ్యాయని, 65 కొత్త కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. బోధనాస్పత్రుల సంఖ్యను 5 నుంచి పదికి.. జిల్లా ఆస్పత్రులను 8 నుంచి 21కి పెంచినట్లు తెలిపింది. రాష్ట్రంలో మొత్తం 6588 మంది వైద్యులు సర్కారీ ఆస్పత్రుల్లో పనిజేస్తున్నట్లు వెల్లడించింది. ప్రసుత్తం సర్కారు దవాఖానాల్లో 29,343 పడకలున్నట్లు తెలిపింది. వీటిల్లో ఆక్సిజన్‌ సదుపాయమున్నవి 25,390 అని వివరించింది. రాష్ట్రంలో 87,56,842 మంది ఆరోగ్యశ్రీ లబ్ధిదారులున్నారని పేర్కొంది.


జూలైలోనే వర్షాలు అధికం

రాష్ట్రంలో జూలై నెలలోనే ఎక్కువ వర్షపాతం నమోదు అవుతున్నట్లు రాష్ట్ర ప్రణాళిక విభాగం వెల్లడించింది. జూలైలో 229 మిల్లీమీటర్ల వర్షం కురుస్తున్నట్లు తెలిపింది. తెలంగాణకు సంబంధించి 1989-2022 మే వరకు గల 33 ఏళ్ల వర్షపాత గణాంకాలను రాష్ట్ర ప్రణాళిక విభాగం మంగళవారం విడుదల చేసింది. 1951 నుంచి 2022 మధ్య కాలంలో.. 1983-84లో తెలంగాణలో అధిక వర్షపాతం(1351 మిల్లీమీటర్లు) నమోదైందని స్పష్టం చేసింది. 1972-73లో కేవలం 559 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లుగా తెలిపింది. గడిచిన 72 ఏళ్లలో 24 గంటల్లో అధిక వర్షపాతం కురిసిన ప్రాంతంగా అలంపూర్‌(317 మి.మీ) పేరిట 2007 జూన్‌ 23న రికార్డు ఉందని పేర్కొంది. ఆ తర్వాత 2013 జూలై 19న ఉమ్మడి వరంగల్‌ జిల్లా ములుగు, ఉమ్మడి ఖమ్మం జిల్లా వాజేడులో 517 మి.మీ. వర్షపాతం రికార్డు అని తెలిపింది. 62 రోజుల వర్షాలతో రాష్ట్ర సగటు వర్షపాతం 919.4 మి.మీగా ఉందని.. 260 రోజులు డ్రైగా ఉంటోందని పేర్కొంది.


ధాన్యం ఉత్పత్తి రెండు కోట్ల టన్నులు!

గత ఏడాది రాష్ట్రంలో 2 కోట్ల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అయినట్లు రాష్ట్ర అర్థగణాంక డైరెక్టరేట్‌ వెల్లడించింది. నిరుడు వానాకాలంలో 1.25 కోట్ల మెట్రిక్‌ టన్నులు, యాసంగిలో 76 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అయినట్లు తెలిపింది. మొక్కజొన్న 28 లక్షల టన్నులు, కందులు 2.38 లక్షల టన్నులు, శనగలు 2 లక్షల టన్నుల చొప్పున ఉత్పత్తి అయ్యాయి. చిరుధాన్యాల సాగు, ఉత్పత్తి రాష్ట్రంలో గణనీయంగా తగ్గిపోయింది. నూనె గింజలు 6.98 లక్షల టన్నులు ఉత్పత్తి అయ్యాయి. 2021-22లో 110.46 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించినట్లు అర్థగణాంక విభాగం వెల్లడించింది. అంతకు ముందు సంవత్సరం(141 లక్షల మెట్రిక్‌ టన్నులు)తో పోలిస్తే ఇది తక్కువని పేర్కొంది.


చిన్న కమతాలే ఎక్కువ

రాష్ట్రంలో చిన్న కమతాలే ఎక్కువగా ఉన్నాయని.. అందుకే.. చిన్న, సన్నకారు రైతులే 90 శాతానికి పైగా వ్యవసాయం చేస్తున్నట్లు డైరెక్టర్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌ విభాగం వెల్లడించింది. 64.54ు మందికి ఒక హెక్టార్‌ లోపు సాగు భూమి ఉందని, 1-2 హెక్టార్ల వరకు ఉన్న రైతులు 23.69ు ఉన్నారని వివరించింది. 2-4 హెక్టార్లున్న రైతులు 9.47ు.. 4-10 హెక్టార్ల రైతులు 2.11ు ఉన్నారు. మొత్తంమీద పది హెక్టార్లలోపు రైతులే 99.84ు మంది ఉండటం గమనార్హం.


గొర్రెల్లో టాప్‌

దేశవ్యాప్తంగా గొర్రెల జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా 742.61 లక్షల గొర్రెలుండగా.. తెలంగాణలో వాటి సంఖ్య 190.63 లక్షలు. దేశ గొర్రెల జనాభాలో తెలంగాణ వాటా 25.67ు. గేదెలు, మేకలు, పందులు, ఆవులు కలిపి తెలంగాణలో 326.41 లక్షలు ఉండగా.. దేశంలోని పశువుల జనాభాలో ఇది 8ు. మాంసం, చేపలు, గుడ్ల ఉత్పత్తి కూడా రాష్ట్రంలో పెరిగినట్లు అర్థ గణాంక విభాగం నివేదికలో తేలింది.

Updated Date - 2022-07-20T09:25:54+05:30 IST