వారి అనుచరులు.. నాపై దాడులు చేయొచ్చు

ABN , First Publish Date - 2020-08-08T08:33:36+05:30 IST

‘రాష్ట్రప్రభుత్వం, జస్టిస్‌ ఈశ్వరయ్య అనుచరులు, జస్టిస్‌ నాగార్జునరెడ్డి అనుచరులు నాపై ఒత్తిళ్లు, బెదిరింపులు, భౌతిక దాడులకు పాల్పడే అవకాశాలున్నాయి.

వారి అనుచరులు.. నాపై దాడులు చేయొచ్చు

  • వారి అక్రమాలు ప్రజలకు తెలిసిపోయాయి
  • ఆ నిస్పృహతో తెగబడవచ్చు
  • మనోధైర్యంతో ఎదుర్కొంటా
  • ఎప్పటికైనా ధర్మమే జయిస్తుంది
  • దళిత సమాజం నిశ్శబ్దంగా ఉండదు
  • దేశం నలుమూలల నుంచీ నాకు అభినందనలు
  • మేజిస్ట్రేట్‌ రామకృష్ణ 

మదనపల్లె టౌన్‌, ఆగస్టు 7: ‘రాష్ట్రప్రభుత్వం, జస్టిస్‌ ఈశ్వరయ్య అనుచరులు, జస్టిస్‌ నాగార్జునరెడ్డి అనుచరులు నాపై ఒత్తిళ్లు, బెదిరింపులు, భౌతిక దాడులకు పాల్పడే అవకాశాలున్నాయి. వారి అన్యాయాలు, అక్రమాలు ప్రజానీకానికి తెలిసిపోవడంతో నిస్పృహతో తెగబడవచ్చు. వారి చర్యలను మనోధైర్యంతో ఎదుర్కొంటాను’ అని సస్పెన్షన్‌లో ఉన్న మేజిస్ట్రేట్‌ ఎస్‌.రామకృష్ణ చెప్పారు. ఏపీ ఉన్నత విద్య నియంత్రణ-పర్యవేక్షణ కమిషన్‌ చైర్మన్‌, రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ వి.ఈశ్వరయ్య తీరుకు సంబంధించి ‘కోర్టులపై కుట్రలు’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో శుక్రవారం ప్రచురితమైన కథనం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.


ఈ నేపథ్యంలో చిత్తూరుజిల్లా బి.కొత్తకోటలోని స్వగృహంలో రామకృష్ణ ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. ‘ఎవరైతే న్యాయవ్యవస్థను భ్రష్టుపట్టించాలని చూస్తున్నారో వారికి గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉంటాను. బెదిరింపులకు, ఒత్తిడులకు లొంగను. కోర్టులను, జడ్జిలను లక్ష్యంగా చేసుకుని ఎవరు కుట్రలు పన్నినా.. ఎప్పటికైనా ధర్మమే జయిస్తుంది. ప్రభుత్వం దీనిని ప్రతీకార చర్యగా కాకుండా.. వ్యవస్థ ప్రక్షాళన కోసం ఒక అవకాశంగా భావిస్తే ప్రజలకు ఉపయుక్తంగా ఉంటుంది. అలాకాకుండా మేం ఇలాగే ఉంటామని.. ప్రశ్నించినవారిని భౌతికంగాలేకుండా చేసేస్తామనే తత్వంతో ముందుకెళ్తే దీనికి అంతూ.. అదుపూ ఉండదు’ అని తెలిపారు. ‘అన్యాయాలను, అక్రమాలను భరిస్తూ దళిత సమాజం నిశ్శబ్దంగా ఉండదు. దేశం నలుమూలల నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీలు, రాజకీయపక్షాల వాళ్లు నన్ను అభినందిస్తున్నారు. పలువురు న్యాయకోవిదులు మద్దతిస్తున్నారు. ఏ స్వార్థం లేకుండా నేను తీసుకున్న రిస్క్‌పై బడుగు, బలహీన వర్గాలు అభినందిస్తున్నాయి‘ అని చెప్పారు. సుప్రీంకోర్జు న్యాయవాదులను ఇందులోకి తీసుకొచ్చి, వారితో పోరాటం చేయాలన్నది తనఅభిమతం కాదన్నారు. ‘పెద్దవాళ్లందరినీ లక్ష్యంగా చేసుకుని ఇబ్బంది పెట్టాలని జస్టిస్‌ ఈశ్వరయ్య పన్నిన కుట్రలో నన్ను భాగస్వామిని చేయాలనుకున్నారు. నేను సమ్మతించక బయటపెట్టాను, లేదంటే ఈశ్వర్యయ్య అనుచరులు నన్ను ఇబ్బంది పెట్టేవారు. ఆయన చర్య అనైతికం, అందరూ ఖండించాల్సిన అంశం. న్యాయవ్యవస్థపై జరిగిన కుట్ర ఇది. న్యాయవ్యవస్థకే సవాల్‌. ఈ కుట్ర సక్సెస్‌ అయిఉంటే కచ్చితంగా దీని ప్రభావం రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంపై పడి ఉండేది. ఇలాంటివాటిని ఆదిలోనే అడ్డుకోవాలని నా దగ్గరున్న సమాచారంతో వెలుగులోకి తీసుకొచ్చాను. దీంతో భవిష్యత్‌లో ఎవరూ న్యాయవ్యవస్థపై బురదజల్లడానికి సాహసం చేయరు. ప్రభుత్వం, ప్రతిపక్షం ఎవరైనా తప్పు చేస్తే సామాన్యుడు కూడా ఎదిరించవచ్చని చెప్పడానికే సిద్ధమయ్యాను’ అని రామకృష్ణ తెలిపారు.


 ‘రాష్ట్రప్రభుత్వం, జస్టిస్‌ ఈశ్వరయ్య అనుచరులు, జస్టిస్‌ నాగార్జునరెడ్డి అనుచరులు నాపై ఒత్తిడులు, బెదిరింపులు, భౌతిక దాడులకు పాల్పడే అవకాశాలున్నాయి.’


 ‘దేశం నలుమూలల నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీలు, రాజకీయ పక్షాల వాళ్లు నన్ను అభినందిస్తున్నారు. పలువురు న్యాయకోవిదులు మద్దతిస్తున్నారు. ఎటువంటి స్వార్థం లేకుండా నేను తీసుకున్న రిస్క్‌పై బడుగు, బలహీన వర్గాలు అభినందిస్తున్నాయి.‘


జస్టిస్‌ ఈశ్వరయ్య చర్య అనైతికం.. అందరూ ఖండించాల్సిన అంశం. న్యాయవ్యవస్థపై జరిగిన కుట్ర ఇది. న్యాయమూర్తులు మౌనంగా భరిస్తున్నా సమయం వచ్చినప్పుడు సమాధానం చెబుతారు.’ 

Updated Date - 2020-08-08T08:33:36+05:30 IST