గీత రచయిత కందికొండ ఇకలేరు

ABN , First Publish Date - 2022-03-13T08:43:39+05:30 IST

గీత రచయిత కందికొండ ఇకలేరు

గీత రచయిత కందికొండ ఇకలేరు

  • గొంతు క్యాన్సర్‌తో యాదగిరి మృతి
  • నేడు మహాప్రస్థానంలో అంత్యక్రియలు


యూసు్‌ఫగూడ, నర్సంపేట టౌన్‌, హైదరాబాద్‌, మార్చి 12: (ఆంధ్రజ్యోతి): కనులకి కలలు.. సెలయేటికి అలలే కాదు ఆ కలం నుంచి కదిలిన ఏ పాటైనా మధురమే! రాసినవి గుప్పెడు పాటలే అయినా గుండెకు హత్తుకునేవే! సినిమా పేరు చెప్పగానే పెదువులపై కదలాడేవే! అలాంటి కలం ఇప్పుడు ఓ జ్ఞాపకంగానే మిగిలిపోయింది. కందికొండగా తెలుగు చిత్రసీమలో ఓ వెలుగువెలిగిన ప్రముఖ గీత రచయిత  కందికొండ యాదగిరి (49) ఇకలేరు. కొంతకాలంగా గొంతు క్యాన్సర్‌, వెన్నెముక సమస్యలతో ఆయన పూర్తిగా మంచానికే పరిమితమయ్యారు. పరిస్థితి మరింత విషమించడంతో హైదరాబాద్‌ మోతీనగర్‌లోని స్వగృహంలో శనివారం కన్నుమూశారు. ఆయనకు భార్య రమాదేవి, కూతురు మాతృక, కుమారుడు ప్రభంజన్‌ ఉన్నారు. కందికొండ స్వస్థలం వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలంలోని నాగుర్లపల్లి గ్రామం. తల్లిదండ్రులు సాంబయ్య, కొమురమ్మ.


ఈ దంపతుల ముగ్గురు సంతానంలో కొందికొండే పెద్ద. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ రాజనీతిశాస్త్రం, ఎంఏ తెలుగు పూర్తి చేశారు. కందికొండకు క్రీడలపైనా ఆసక్తి ఇంటర్‌లో పరుగు పందెంలో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. తర్వాత బాడీ బిల్డింగ్‌పై దృష్టి పెట్టారు.  డిగ్రీ ఫస్టియర్‌లో మిస్టర్‌ కళాశాల, ఆ తర్వాత మిస్టర్‌ మహబూబాబాద్‌గా అవార్డులను అందుకున్నారు. 1998లో పృథ్వీ పేరుతో వార పత్రికను స్థాపించారు. విలేకరులను నియమించుకొని మహబూబాబాద్‌, నర్సంపేట ప్రాంతాల్లోని రాజకీయ, సామాజిక అంశాలపై కథనాలు ప్రచురించి మన్ననలు పొందారు. చదువుకునే రోజుల్లోనే ఆయన పాటలు రాయడం ప్రారంభించారు. 


ఇంటర్‌ చదివేటప్పుడు సంగీత దర్శకుడు చక్రితో ఆయనకు పరిచయం ఆయన కెరీర్‌ను మలుపుతిప్పింది. అప్పటిదాకా జానపద గీతాలు రాసిన కందికొండ, చక్రీతో పరిచయమయ్యాక సినిమా సాహిత్యం వైపు మొగ్గు చూపారు. చక్రి తొలిసారిగా సంగీతం అందజేసిన ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చిత్రమే సినీ గీతరచయితగా కందికొండకూ తొలి సినిమా కావడం విశేషం. 2001 నుంచి తుదిశ్వాస విడిచేదాకా 21 ఏళ్లపాటు సినీ గేయరచయితగా వందల పాటలు రాశారు. సినిమాలతో పాటు జానపద గీతాలు, బతుకమ్మ పాటలు, తెలంగాణ ఉద్యమ పాటలు కలిపి 13 వందలకుపైగా పాటలు రాశారు. బతుకమ్మ నేపథ్యంలో రాసిన ఆయన పాటలు ప్రతి గ్రామంలోనూ మార్మోగాయి. కుటుంబంతో సహా హైదరాబాద్‌లోనే ఉంటున్న కందికొండ పదేళ్ల క్రితం స్వగ్రామంలో నాలుగు గుంటల స్థలం కొనుగోలు చేసి సొంతంగా ఇంటిని నిర్మించుకున్నారు. పండుగలప్పుడు, విశ్రాంతి కోసం అప్పుడప్పుడు వస్తుండేవారు. 2021లో బతుకమ్మ పాటను రచించిన కందికొండ తన పుట్టిన ఊరైన నాగుర్లపల్లెలోని మాధన్నపేట సరస్సు కట్టపై బతుకమ్మ పాటు చిత్రీకరణను దగ్గరుండి చేయించారు. కాగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో చికిత్స చేయించుకోలేని స్థితిలో ఉన్న ఆయనకు తెలంగాణ ప్రభుత్వం సాయం చేసింది. మిత్రులూ ఆర్థిక సాయం అందించడంతో వెన్నెముకకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. కాగా కందికొండ మృతితో ఆయన స్వగ్రామం నాగుర్లపల్లెలో విషాదం నెలకొంది. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ కందికొండ తల్లిదండ్రులు సాంబయ్య-కొమురమ్మ ఇంటి వద్దే ఉంటున్నారు. కందికొండ మృతిపట్ల గవర్నర్‌ తమిళిసై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతితో రాష్ట్రం ఓ గొప్ప రచయితను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన పాటల ద్వారా తెలంగాణ సబ్బండ వర్గాల సంస్కృతిని కందికొండ అజరామరంగా నిలిపారని, ఆయన మరణం తెలంగాణ సాహిత్యానికి తీరని లోటని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. కందికొండను కాపాడుకునేందుకు పలు ప్రయత్నాలు చేసినా ఫలించకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కందికొండ మృతిపట్ల కేటీఆర్‌, హరీశ్‌, తలసాని సహా పలువురు మంత్రులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విచారం వ్యక్తం చేశారు. ఆదివారం జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు.

Updated Date - 2022-03-13T08:43:39+05:30 IST