- మంటల్లో చిక్కుకుని ఒకరి మృతి
చెన్నై(Chennai): కడలూరు జిల్లా సిరుపాక్కం వద్ద బొగ్గుల లారీని ఢీకొని మినీలారీ దగ్ధమైన దుర్ఘటనలో లారీ యజమాని మృతి చెందాడు. డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. సిరుపాక్కం సమీపం అరసంగుడి చెక్‌పోస్టు వద్ద శనివారం ఉదయం నైవేలి నుంచి బొగ్గుల లోడుతో సేలంకు బయల్దేరిన లారీ రోడ్డు పక్కగా ఆగింది. ఆ సమయంలో విరుదాచలం నుంచి సేలం వైపు వేగంగా వస్తున్న మినీ లారీ ఆగి వున్న బొగ్గుల లారీని వెనుకవైపు ఢీకొంది. దీంతో మినీలారీ ముందువైపు ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. మినీలారీలో ప్రయాణించిన దాని యజమాని రాజా మహమ్మద్ మంటల్లో చిక్కుకుని మృతిచెందారు. డ్రైవర్ తీవ్రంగా గాయపడటంతో అతడిని చికిత్స నిమిత్తం విరుదాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. మినీలారీలో ఉన్న మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం విరుదాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.