Abn logo
Sep 17 2021 @ 00:00AM

అనంత ఫలప్రదం

అనంత పద్మనాభుడు కాలస్వరూపుడైన శ్రీమన్నారాయణుని దివ్యమైన అవతారం. పద్మనాభుని కృపాకటాక్షాలను ఆపేక్షించి, ఆచరించే వ్రతమే అనంత పద్మనాభ వ్రతం. అనంత పద్మనాభ చతుర్దశిగా వ్యవహరించే భాద్రపద శుద్ధ చతుర్దశినాడు ఘనమైన రీతిలో ఈ వ్రతాన్ని భారతావనిలో ఆచరించడం జరుగుతోంది. హైందవ సంప్రదాయంలో ఉన్న కామ్యక వ్రతాలలో అత్యంత ప్రధానమైనదిగా ఈ వ్రతం ప్రసిద్ధి పొందింది. జనులు చెప్పనలవికాని కష్టాల్లో మునిగి ఉన్నప్పుడూ లేదా అంతులేని దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నప్పుడూ... ఆ విపత్కర పరిస్థితుల నుంచి బయట పడడానికి ఉత్తమ సాధనంగా... ఈ వ్రతాన్ని చేయడం తరతరాలుగా వస్తోంది.  


ద్వాపర యుగంలో... వనవాస కాలంలో పాండవులు ఎనలేని కష్టాలు పడ్డారు. వాటి నుంచి గట్టెక్కేందుకు ఏదైనా విశిష్టమైన వ్రతం ఉంటే చెప్పమని కృష్ణ పరమాత్మను ధర్మరాజు అభ్యర్థించాడు. ఎంతో మహిమ కలిగిన అనంత పద్మనాభ వ్రతాన్ని భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు ఆచరించడం అత్యంత శ్రేయోదాయకమని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఎంతో నిష్టతో, అత్యంత భక్తితో ఆ వ్రతాన్ని పాండవులు చేయడం మహా భారతంలో మనకు కనిపిస్తుంది. 


కౌండిన్యుడికి జ్ఞానోదయం...

పురాణాల్లో కౌండిన్య మహర్షి వృత్తాంతం ఈ వ్రతంతో ముడిపడి ఉంది. దంపతులైన సుశీల- కౌండిన్యుడు ఈ వ్రత మహిమతో చిరకాలం సకల సంపదలతో వర్థిల్లి, అంతులేని సుఖ సంతోషాలతో జీవించినట్టు తెలిపే ఆ దివ్యమైన కథ కమనీయంగా ఉంటుంది. కృత యుగంలో సుమంతుడు, దీక్ష అనే దంపతులు ఉండేవారు. వారికి శీల అనే కుమార్తె కలిగింది. ఆమెను సుశీల అనే పేరుతోనూ పిలిచేవారు. సుశీల జన్మించిన కొంతకాలానికి ఆమె తల్లి మరణించడంతో, కర్కశ అనే మహిళను సుమంతుడు ద్వితీయ వివాహం చేసుకున్నాడు. ఆమె సుశీలను భరించలేని కష్టాలకు గురి చేసింది.


ఒకసారి సుమంతుని ఇంటికి కౌండిన్య మహర్షి వచ్చాడు. సుశీలను చూసి ఇష్టపడ్డాడు. సుమంతుడి అనుమతితో ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమెతో కలిసి తన ఆశ్రమానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో వారు ఒక నదీ తీరంలో విశ్రమించారు. ఆ సమయంలో కొందరు మహిళలు అక్కడ ఏదో వ్రతం చేస్తూ ఉండడం సుశీల గమనించింది. వారి వద్దకు వెళ్ళి, ఆ వ్రతం వివరాలు తెలుసుకంది. వారి సాయంతో తాను కూడా వ్రతం చేసి, తన చేతికి తోరాన్ని ధరించింది. భర్తతో కలిసి ఆ సాయంత్రానికి ఆశ్రమానికి చేరుకుంది. వ్రత ప్రభావంవల్ల ఆ దంపతులకు అష్టైశ్వర్యాలు సిద్ధించాయి. 


కొన్ని రోజులు గడిచాక, తన భార్య సుశీల చేతికి తోరాన్ని కట్టుకుంటూ ఉండడం కౌండిన్యుడు గమనించాడు. ‘‘ఏమిటిది? ఈ తోరాన్ని ఎందుకు ధరించావు? నన్ను వశపరచుకోవడానికి కట్టుకున్నావా?’’ అని కోపంగా ప్రశ్నించాడు. భర్త ఆగ్రహం చూసి భయపడిన సుశీల... తను చేసిన అనంత పద్మనాభ వ్రతం గురించి వివరించింది. కానీ, భార్య మాటలను కౌండిన్యుడు ఏమాత్రం లెక్క చేయకుండా, ఆమె చేతికి ఉన్న తోరాన్ని తెంచి మంటల్లో పడేశాడు. అప్పటి నుంచి కౌండిన్యుడి ఆశ్రమంలో అంతులేని దారిద్య్రం తాండవించసాగింది. 


అలా ఎందుకు జరుగుతోందోనని మధనపడిన కౌండిన్యుడు చివరకు తాను అనంత పద్మనాభ వ్రతాన్ని ఆక్షేపించడమే కారణమని తెలుసుకున్నాడు. పశ్చాత్తాపం చెందాడు. సర్వోన్నతుడైన అనంత పద్మనాభుని కృపను ఆపేక్షించి అడవులకు బయలుదేరాడు. దారిలో విశేషమైన దృశ్యాలెన్నో అతనికి ఎదురయ్యాయి. ఒక్క పక్షి కూడా వాలని... ఫల పుష్పాలతో కూడిన మామిడి చెట్టు, పచ్చగడ్డిలో మేయకుండా తిరుగుతున్న ఆవు, పచ్చిక బీడుపై అడ్డంగా పడుకున్న ఎద్దు, కమలాలతో నిండిన సరోవరాలు, ఓండ్ర పెడుతూ తిరుగుతున్న ఒక గాడిద, కొన్ని మదపు టేనుగులు అతనికి కనిపించాయి. వాటి ప్రత్యేకతలను తెలియజేయాలని అనంతుణ్ణి ప్రార్థించాడు కౌండిన్యుడు. ఆ విషయాల గురించి తనకేమీ తెలియదని అనంతుడు అశరీరవాణిగా పలికాడు. దీనితో ఆవేదన చెందిన కౌండిన్యుడు ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు. 

అప్పుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడు కౌండిన్య మహర్షి ముందు ప్రత్యక్షమయ్యాడు. సమీపంలోని గుహలోకి అతణ్ణి తీసుకు వెళ్ళాడు. కనురెప్పపాటులో... దివ్య ప్రభలతో ప్రకాశిస్తున్న అనంత పద్మనాభుడు దర్శనమిచ్చాడు. తనను క్షమించాలనీ, తను చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం ఏమిటో చెప్పాలనీ కౌండిన్యుడు ప్రాధేయపడ్డాడు. 

ప్రసన్నుడైన అనంత పద్మనాభుడు ‘‘కౌండిన్యా! ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్దశి రోజున అనంత పద్మనాభ వ్రతాన్ని క్రమం తప్పకుండా ఆచరించు. నీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి’’ అని చెప్పి ఊరట కలిగించాడు. 


మార్గమధ్యంలో తనకు కనిపించిన అరుదైన విషయాల గురించి స్వామిని కౌండిన్యుడు మరోసారి ప్రశ్నించగా, ‘‘కౌండిన్యా! నీవు దారిలో చూసిన మామిడి చెట్టు పూర్వ జన్మలో వేదవిద్యా విశారదుడైన విప్రుడు. అతను విద్యాదానం చేయకపోవడంతో ఈ జన్మలో చెట్టుగా పుట్టాడు. ఆ ఆవు విత్తులను హరించే భూమి. ఎద్దు ధర్మ స్వరూపం. ఆ పుష్కరణులను చూశావా... అవి ఇద్దరు అక్కాచెల్లెళ్ళు.. దానధర్మాలు చేయకపోవడంతో ఈ రకంగా జన్మ ఎత్తారు. ఆ గాడిద జీవిలో నిండి ఉన్న క్రోధం. ఏనుగు మితం లేకుండా పెరిగిన మదానికి ప్రతిరూపం. ఇక అక్కడున్న గుహ... మానవులు నిత్యమూ మునిగి తేలే సంసారం. నీకు కనిపించిన వృద్ధుణ్ణి నేనే!’’ అంటూ స్వామి అదృశ్యమయ్యాడు. 


కౌండిన్యుడికి జ్ఞానోదయమయింది. తన ఆశ్రమానికి చేరి, ప్రతి సంవత్సరం అనంత పద్మనాభ వ్రతాన్ని ఎంతో దీక్షగా ఆచరించాడు. అతని ఆశ్రమం తిరిగి అష్టైశ్వర్యాలతో తులతూగింది. ఈ విధంగా శాస్త్రోక్తంగా, భక్తి శ్రద్ధలతో అనంతుణ్ణి పూజిస్తే సకల సంపదలూ సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. సమస్త దుఃఖనాశకంగా, దారిద్ర్యాన్ని తొలగించేదిగా, సంపత్కరంగా తరతరాలుగా ప్రసిద్ధి చెందిన వ్రతం ఇది. 

- వెంకట్‌ గరికపాటి

(19న అనంత పద్మనాభ చతుర్దశి)