నీవే సఖుడౌ...

ABN , First Publish Date - 2020-08-07T05:30:00+05:30 IST

భక్తి ద్వారా భగవంతుణ్ణి చేరే దారులు తొమ్మిది. వాటిని ‘నవవిధ భక్తి మార్గాలు’ అంటారు. వీటిలో ‘సఖ్యత’ ఒకటి. ‘సఖ్యత’ అంటే స్నేహం. స్నేహితులలో కూడా భిన్న స్థాయిల వారు ఉంటారు...

నీవే సఖుడౌ...

ధర్మసంస్థాపన కోసం ఆర్తరక్షణపరాయణుడైన శ్రీమహావిష్ణువు అనేక అవతారాలు ధరించాడు. వాటిలో దశావతారాలు ప్రసిద్ధమైనవి. వాటిలో పరిపూర్ణమైన అవతారం శ్రీకృష్ణావతారం. ఆ నల్లవాడి కథలో ప్రతి ఘట్టం ఒక అద్భుతమే! బాలకృష్ణుడి లీలలు అపురూపమైతే, స్నేహితుడిగా, జగద్గురువుగా శ్రీకృష్ణుడు చూపిన మార్గదర్శకత్వం అపూర్వం!



  • (ఈ నెల 11న శ్రీకృష్ణాష్టమి)


భక్తి ద్వారా భగవంతుణ్ణి చేరే దారులు తొమ్మిది. వాటిని ‘నవవిధ భక్తి మార్గాలు’ అంటారు. వీటిలో ‘సఖ్యత’ ఒకటి. ‘సఖ్యత’ అంటే స్నేహం. స్నేహితులలో కూడా భిన్న స్థాయిల వారు ఉంటారు. బాల్య స్నేహితులు, ప్రియ సఖులు, ఆంతరంగిక మిత్రులు... ఇలా!  

పరశురాముడికో, శ్రీరాముడికో ఎక్కువమంది స్నేహితులున్నట్టు పెద్దగా ఉదాహరణలు లేవు. రామాయణాన్ని పరిశీలిస్తే రాముడికి హనుమంతుడు, సుగ్రీవుడు, విభీషణుడు ప్రియ మిత్రులే! అయితే అవి కార్యార్థమై ఆయన అయోధ్య నుంచి కదలిన తరువాత ఏర్పడిన స్నేహాలు. కానీ శ్రీకృష్ణావతారం మొత్తం స్నేహమయం! బాల్యంలో గోప బాలకులతో చిన్నారి కృష్ణుడు చేసిన అల్లరి అందరూ విన్నదే. వెన్నదొంగతనం, కాళీయమర్దనం లాంటి శ్రీకృష్ణ లీలలకు ప్రత్యక్ష సాక్షులు ఆయనతో చెట్టాపట్టాలు వేసుకొని తిరిగిన గోప బాలకులే!

కాగా సఖ్య భక్తికి ఉదాహరణగా కుచేలుణ్ణీ, అర్జునుణ్ణీ ఉదాహరణగా పెద్దలు చెబుతూ ఉంటారు. సాందీప మహాముని దగ్గర బలరామ కృష్ణులు విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు సహాధ్యాయి కుచేలుడు. అతను కృష్ణుడికి ఆప్తమిత్రుడు. చదువు పూర్తయ్యాక వారు విడిపోయినా కుచేలుడు సదా శ్రీకృష్ణ ధ్యానం చేస్తూ ఉండేవాడు. పేదరికంలో మగ్గిపోతూ భార్య సలహా మేరకు తన చిన్ననాటి మిత్రుణ్ణి కలిసిన కుచేలుడికి శ్రీకృష్ణుణ్ణి చూడగానే సంపద కోరాలనిపించలేదు. అయితే సర్వాంతర్యామి అయిన కృష్ణుడికి అతని పరిస్థితి తెలుసు. కుచేలుడి నుంచి అటుకులు కానుకగా తీసుకొని అష్టైశ్వర్యాలనూ ప్రసాదించాడు. మోక్షాన్ని అనుగ్రహించాడు. 

అవసరాలను గ్రహించి, స్థాయిలను ఎరిగి, ఏ సమయానికి ఏ సాయం కావాలో అది అందించే స్నేహగుణం కృష్ణుడిది. పాత్రతను బట్టి ఆయన సహాయం చేశాడు. వ్రేపల్లె వాసులకి కావలసింది కృష్ణుడు మా చెలికాడనే సంతృప్తి. వారికి దాన్ని కటాక్షించాడు. కుచేలుడు భక్తుడు. జీవిక గడిచే మార్గం దొరికితే దానిలో పయనిస్తూ, భక్తి తత్పరతను కొనసాగించగలడు. కాబట్టి అతనికి ఐశ్వర్యాన్ని ప్రసాదించాడు కృష్ణుడు. 

కానీ పాండవుల అవసరాలు వేరు. శత్రువుల నుంచి వారిని వారు కాపాడుకోవాలి. పోగొట్టుకున్న రాజ్యాధికారాన్ని తిరిగి సంపాదించుకోవాలి. అందుకే స్నేహధర్మంగా పాండవులను ఆపదల నుంచి అడుగడుగునా కృష్ణుడు కాపాడాల్సి వచ్చింది. ఇక కృష్ణార్జునుల మధ్య బంధం బంధుత్వం కన్నా స్నేహమే ప్రధానంగా కొనసాగింది. తమ చెలిమిని మన్నించి పార్థసారథి అయ్యాడు కృష్ణుడు. రణక్షేత్రంలో అర్జునుడు విరాగిగా మారినప్పుడు కర్తవ్య బోధ చేశాడు. యుద్ధోన్ముఖుణ్ణి చేసి విజయంవైపు నడిపించాడు. సాక్షాత్తూ నారాయణుడైన కృష్ణుడు భగవద్గీతను ఎప్పుడైనా, ఎవరికైనా చెప్పగలడు. కానీ వైరాగ్యంలో పడిన సఖుడు అర్జునుడికే చెప్పాడు. ఎప్పుడు అవసరమో అప్పుడు చెప్పాడు. 




  • నీవే తల్లివిఁ దండ్రివి
  • నీవే నా తోడు నీడ! నీవే సఖుడౌ
  • నీవే గురుడవు దైవము
  • నీవే నా పతియు గతియు! నిజముగ కృష్ణా!


- అన్నాడు శ్రీకృష్ణ శతకకర్త నృసింహకవి. సర్వం దైవమే అనుకుంటే అన్నీ ఆయనే చూసుకుంటాడని చెబుతున్నాయి శాస్త్ర పురాణాలు. 

మనిషి జీవితంలో ప్రతి బంధానికీ ఏదో ఒక కాలపరిమితి ఉంటుంది. స్నేహానికి కూడా అలాంటి పరిమితులు ఉన్నాయి. కానీ దైవాన్ని స్నేహితుడిగా భావిస్తే ఆయన అన్ని వేళలా తోడుంటాడంటారు పెద్దలు. దైవం మనలో చూసేది కులమతాలనో, సంపదనో, అధికారిక హోదాలనో కాదు. చిత్తశుద్ధినీ, విశ్వాసాన్నీ! ఏ స్నేహానికైనా అవే పునాదులు! ఇహాన్నీ, పరాన్నీ పరిపూర్ణం చేసుకోవాలంటే స్నేహితుడిగా ఎంచుకోవలసింది దైవాన్నే! శ్రీకృష్ణావతారంలో తన స్నేహశీలత ద్వారా భగవంతుడు చాటి చెప్పింది అదే!


Updated Date - 2020-08-07T05:30:00+05:30 IST