వ్యాక్సిన్ల వెతలు తీరేనా?

ABN , First Publish Date - 2021-06-25T09:25:25+05:30 IST

ప్రతిఒక్కరికీ, ముఖ్యంగా పేదలకు భద్రత సమకూరనంతవరకు ఏ ఒక్కరికీ భద్రత ఉండదు. కరోనా వైరస్ మహా వేగంగా ఉత్పరివర్తనాలు చెందుతున్న విషమ కాలమిది...

వ్యాక్సిన్ల వెతలు తీరేనా?

ప్రతిఒక్కరికీ, ముఖ్యంగా పేదలకు భద్రత సమకూరనంతవరకు ఏ ఒక్కరికీ భద్రత ఉండదు. కరోనా వైరస్ మహా వేగంగా ఉత్పరివర్తనాలు చెందుతున్న విషమ కాలమిది. ఆ విషక్రిమి బహురూపాలలో మానవాళిని మృత్యుతిప్పలు పెడుతోంది. వైరస్ ఉధృతికీ, వ్యాక్సినేషన్ వేగానికీ మధ్య జీవన్మరణ పోటీ నెలకొంది. సంపూర్ణ విజయం లేదా వినాశనకర వైఫల్యం అంచున మానవాళి నిలబడి ఉంది.


ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ప్రపంచ ప్రజలకు 1100 కోట్ల డోసుల టీకాల ఆవశ్యకత ఉంది. సాధ్యమైనంత త్వరగా పేదప్రజలకు, మారుమూల ప్రాంతాలకు ఈ వ్యాక్సిన్లు అందవలసి ఉంది. లేనిపక్షంలో ఈ ధరిత్రిపై సర్వత్రా కరోనా వైరస్ వ్యాపిస్తుంది. ఉత్పరివర్తనాలతో మళ్లీ మళ్లీ విజృంభించి ఆరోగ్య భీములను సైతం దుర్బలపరచడం ఖాయం. 


ఇప్పుడు సమస్య వ్యాక్సిన్ల గురించి లేదా వాటిని ఉత్పత్తి చేయడంలో ప్రపంచ సామర్థ్యం గురించి కానేకాదు. ప్రపంచ శాస్త్రవేత్తలు రెండు వందలకు పైగా వ్యాక్సిన్లను అభివృద్ధిపరుస్తున్నారు. 102 వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ దశకు చేరాయి. ప్రస్తుత సంవత్సరం ముగిసేనాటికి 1400 కోట్ల డోసుల వ్యాక్సిన్లను ప్రపంచం ఉత్పత్తి చేయగలుగుతుందని ప్రపంచ ఆరోగ్యసంస్థ పేర్కొంది. 300 కోట్ల డోసులను ఉత్పత్తి చేసేందుకు చైనా సంస్థలు సైనో ఫార్మా, సైనో వ్యాక్ సంసిద్ధమవుతున్నాయి. అమెరికాకు చెందిన పైజర్–-బయో ఎన్‌టెక్ తన వ్యాక్సిన్ ఉత్పాదక సామర్థ్యాన్ని 300 కోట్లకు పెంచుకుంది. అలాగే ఆక్స్‌ఫర్డ్– ఆస్ట్రాజెనెకా కూడా. ఇలాగే ఇంకా ఎన్నో సంస్థలు టీకాల ఉత్పత్తిలో పురోగమిస్తున్నాయి. చెప్పవచ్చిందేమిటంటే వ్యాక్సిన్లకు కొరతేమీ లేదు. 


వ్యాక్సిన్ల ధరలతోనే సమస్య. అత్యధిక ప్రజలకు వ్యాక్సిన్లు అందుబాటులో ఉండాలి కదా. ప్రస్తుతం వ్యాక్సిన్ల ధరలు చాలా మందికి ఆందోళన కలిగిస్తున్నాయి. ఉత్పత్తిదారులేమో లాభాలను మరింతగా దండుకోవడానికే ప్రాధాన్యమిస్తున్నారు. మీడియా వార్తల ప్రకారం ఒక్కో డోసును రెండున్నర డాలర్ల (దాదాపు 200 రూపాయలు) నుంచి 20 దాకా విక్రయిస్తున్నారు. అన్నిటిలోకి ఆక్స్‌ఫర్డ్-–ఆస్ట్రాజెనెకా టీకా చాలా చౌకగా అందుబాటులో ఉంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ టీకా ఒక్కో డోసుకు యూరోపియన్ యూనియన్ రెండున్నర డాలర్లు చెల్లిస్తుండగా దక్షిణాఫ్రికాలో అదే టీకా డోసు ధర ఐదు డాలర్లకు పైగా ఉంది. సైనో ఫార్మా వ్యాక్సిన్ డోసు ధర శ్రీలంకలో 15 డాలర్లు కాగా బంగ్లాదేశ్‌లో 10 డాలర్లు. ఈ టీకాను ఆయాదేశాల ప్రభుత్వాలే కొనుగోలు చేస్తున్నాయి. ఇక అర్జెంటీనాలో ఒక్కో డోసును రూ.40 డాలర్లకు సైనో ఫార్మా విక్రయిస్తోంది. మోడెర్నా టీకా డోసు ధర 37 డాలర్లు. 


ఈ పరిస్థితిలో వ్యాక్సిన్ అసమానతలు స్వతసిద్ధమే కాక అనివార్యం కూడా. వ్యాక్సిన్ ధరలను భరించగల ఆర్థికస్తోమత పేద దేశాలకు లేదు. 100 కోట్ల మంది ప్రజలకు ఉచిత టీకా సదుపాయం కల్పించాలని ఇటీవలే నిర్ణయం తీసుకున్న భారతప్రభుత్వం 44 కోట్ల డోసులకు మాత్రమే ఆర్డర్ ఇచ్చింది (పూర్తి అవసరం 200 కోట్ల డోసులు). సీరం ఇన్‌స్టిట్యూట్ ఉత్పత్తి కొవిషీల్డ్, భారత్ బయోటెక్ ఉత్పత్తి కొవాగ్జిన్ టీకాలను ఒక్కో డోసు రూ.150 (2 డాలర్లు) చొప్పున కొనుగోలు చేస్తోంది. 


ఇప్పటికే మహమ్మారి మూలంగా వాటిల్లిన నష్టాలతో అతలాకుతలమైన దేశ ఆర్థికవ్యవస్థపై, ఈ టీకాల కొనుగోలు మరింత భారాన్ని మోపుతోంది. అయితే ప్రతి డోసును తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నందున ప్రభుత్వం చేపట్టిన సార్వత్రిక టీకాకరణ కార్యక్రమాన్ని భరించగల శక్తి మన ఆర్థికవ్యవస్థకు ఉంది. మరి బంగ్లాదేశ్, కెమరూన్ మొదలైన పేదదేశాల మాటేమిటి?


వ్యాక్సినేషన్ భవిష్యత్తుకు రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఒకటి–జర్మనీ, బ్రిటన్ అనుసరిస్తున్న మార్గం. ఈ దేశాల ప్రభుత్వాలు తమ కంపెనీల నుంచి వ్యాక్సిన్లను కొనుగోలు చేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేసిన కొవ్యాక్స్ సంస్థకు విరాళంగా ఇస్తున్నాయి. తమ అవసరాలకు మించి కొనుగోలు చేసిన 10 కోట్ల టీకాలను కొవ్యాక్స్‌కు విరాళంగా ఇవ్వనున్నట్టు ఇటీవల ముగిసిన జి7 దేశాల శిఖరాగ్ర సదస్సులో ఆతిథేయి బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆర్భాటంగా ప్రకటించారు. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి వాటిని అందజేస్తామని ఆయన తెలిపారు. అమెరికా మరో 50కోట్ల డోసులను ఇవ్వనున్నది. మొత్తం మీద 2022 మధ్యనాళ్ళకు జి7 దేశాలు 199 కోట్ల డోసులను ప్రపంచ దేశాలకు ఉచితంగా ఇచ్చేందుకు వాగ్దానం చేశాయి. అయితే ఈ సహాయం చాలా స్వల్పమైనది. అంతేకాదు, చాలా ఆలస్యంగా అందనున్న సాయమిది. ఆఫ్రికా ఖండంలో కొవిడ్ కేసులు ఇప్పటికే బాగా పెరిగిపోయాయి. మరో ముఖ్యమైన విషయమేమిటంటే సార్వత్రిక టీకాకరణకు అయ్యే వ్యయాన్ని భరించేందుకు ప్రపంచదేశాల వద్ద ఒక సమష్టి ప్రణాళిక ఏమీ లేదు. కనుకనే కొవ్యాక్స్ ఇప్పటికీ వ్యాక్సిన్ల కొరతను ఎదుర్కొంటోంది. సరఫరాల విషయంలో సంపన్నదేశాల వాగ్దానభంగాలను చవిచూస్తోంది.


ఇక రెండో ప్రత్యామ్నాయం టీకాలపై మేధా సంపత్తి హక్కులను తాత్కాలికంగా రద్దు చేయడం. దీనివల్ల ఇతర కంపెనీలు కూడా వ్యాక్సిన్లను భారీ ప్రమాణంలో ఉత్పత్తి చేయడం సాధ్యమవుతుంది. హెచ్‌ఐవి, ఎయిడ్స్ మందుల విషయంలో ఇలాగే జరిగింది. మేధా సంపత్తి హక్కులను రద్దుచేయడం వల్ల టీకాల ధర గణనీయంగా తగ్గిపోతుంది.. ధరల తగ్గుదలతో టీకాలు అందరికీ అందుబాటులోకి వస్తాయి. ఇది, మహమ్మారిపై మానవాళి సమష్టిపోరు అవుతుంది. ఈ సమైక్యసమరం నిజం కావాలంటే ప్రజాస్వామ్యం పట్ల తన నిబద్ధతను ‘స్వేచ్ఛా ప్రపంచం’ మరింత ఆచరణాత్మకంగా నిరూపించుకోవాలి. ‘నిరంకుశ ప్రభుత్వాల’కు వ్యతిరేకంగా పోరాడాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ వ్యవస్థలలో ప్రజలకు నిజమైన సాధికారతను తాను ఎలా పునరుద్ధరించనున్నదీ అమెరికా చూపి తీరాలి. మనం మార్కెట్‌కు ప్రాధాన్యమిచ్చి రాజ్యవ్యవస్థను ఎంతగా బలహీనపరచాలో అంతగా బలహీనపరిచాం. మార్కెట్ మరింత శక్తిమంతమయితేనే సమాజాలు సాధికారత పొందుతాయని మనం విశ్వసిస్తున్నాం. అయితే మన విశ్వాసం ఫలిస్తుందా? ఫలిస్తుందని నేను భావించడం లేదు. రాజ్యం-మార్కెట్‌–వినియోగదారీ సమాజం సంయుక్తంగా ఇటువంటి పరిస్థితులను తీసుకువచ్చాయి. ప్రజాసాధికారితను పునరావిష్కరించాల్సిన అవసరం ఉంది. కొవిడ్ కాలంలోనూ, ఆ విపత్తు అనంతర కాలానికీ ఇది చాలా ముఖ్యం.


సునీతా నారాయణ్

‘సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌’ 

డైరెక్టర్‌ జనరల్‌, ‘డౌన్‌ టు ఎర్త్‌’ సంపాదకురాలు

Updated Date - 2021-06-25T09:25:25+05:30 IST