ఇప్పటి పరిస్థితుల్ని చూస్తుంటే బాధేస్తోంది

ABN , First Publish Date - 2021-08-31T05:30:00+05:30 IST

ఆయన వయసు 103... ఆమెకు 93 ఏళ్లు... వాళ్ళ వైవాహిక బంధానికి 74 వసంతాలు.

ఇప్పటి పరిస్థితుల్ని  చూస్తుంటే బాధేస్తోంది

ఆయన వయసు 103... ఆమెకు 93 ఏళ్లు... వాళ్ళ వైవాహిక బంధానికి 74 వసంతాలు...‘ఆంధ్ర రాష్ట్రంలో పెద్దలు కుదిర్చిన రెండవ కులాంతర వివాహం వారిదే!’ అంటారు చరిత్రకారులు.స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని, జైలు శిక్ష అనుభవించిన మనోరమ, రావూరి అర్జునరావులది మహాత్మా గాంధీ హృదయంలో ప్రత్యేక స్థానం. ఆదర్శ జంటగా సామాజిక జాడ్యాలనే కాదు, ఈ మధ్య కరోనాను కూడా జయించారీ దంపతులు. దేశం సాతంత్య్ర అమృత మహోత్సవాలు జరుపుకొంటున్న సందర్భంలో... తమ జ్ఞాపకాలను మనోరమ ‘నవ్య’తో పంచుకున్నారు. 


‘‘పెద్దలు కుదిర్చిన కులాంతర వివాహం మాది. సమాజంలో అంతరాలు తొలగాలనే ఉన్నతాశయంతో మా నాన్న గోపరాజు రామచంద్రరావు (గోరా) తన తొమ్మిదిమంది పిల్లలకూ ఆదర్శ వివాహాలు చేశారు. ఆ మహోద్యమంలో మా అమ్మ సరస్వతి కూడా సమపాత్ర పోషించిందనే చెప్పాలి. గోరా-సరస్వతిల సంతానంలో నేనే అందరికన్నా పెద్దదాన్ని. నేను పుట్టినప్పటికి నాన్న పూర్తిగా నాస్తికోద్యమంలోకి అడుగుపెట్టలేదు. దాంతో సంప్రదాయ వాసనల మధ్య పెరిగిన నాకు బొట్టు పెట్టుకోవడం, గాజులు ధరించడం లాంటి అలంకరణలంటే మొదట్లో ఇష్టంగా ఉండేది. పెళ్ళయిన తరువాత నా భర్త కల్పించిన అవగాహనతో నా అంతట నేనే ఆ బంధనాల నుంచి విముక్తి పొందాను. ఆడవాళ్లంటే కాళ్లకు పసుపు రాసుకొని, ముఖాన పెద్దబొట్టు పెట్టుకొని సంప్రదాయబద్ధంగా ఉండాలి లాంటి ముతక ఆలోచనలు ఈ తరం మెదళ్లలోనూ తిష్ట వేసి ఉండడం చూస్తున్నాం. యువతీ యువకుల ముందరి కాళ్లకు బంధంగా మారిన పాత ఆచారాలు, సంప్రదాయాలకు వ్యతిరేకంగా ఇప్పుడు మరింత బలంగా పనిచేయాల్సిన అవసరం పెరిగిందనిపిస్తోంది.

 

ఆడపిల్లల అభిప్రాయాలకు విలువ...

కూతురు కులాంతర వివాహం చేసుకుందనే కారణంగా నెత్తురు కళ్లచూస్తున్న తండ్రులను ఇప్పుడు చూస్తున్నాం. కానీ డెభ్భై ఏళ్ల కిందటే మా నాన్న సమాజాన్ని ధిక్కరించి, ఆచారాలను పక్కకు నెట్టి మరీ తన అయిదుగురు ఆడపిల్లలకు కులాంతర వివాహాలు చేశారు. అదీ మా అందరి అభిప్రాయాలకు విలువ ఇస్తూ, పరస్పర అంగీకారంతోనే పెళ్లిళ్లు జరిపించారు. ఇవాళ్టికీ మా ఇళ్లలో అదే పద్ధతి కొనసాగుతోంది. నా పెళ్లప్పుడు మా అమ్మ తరపు బంధువులంతా మమ్మల్ని కొంతకాలం వెలివేశారు. మా నాన్నను అవమానించారు. నన్ను ఆ పెళ్లి చేసుకోవద్దన్నారు. ‘‘మీ అమ్మా, నాన్నల మాట విని కులాంతర వివాహానికి ఒప్పుకుంటే, ఆ తరువాత చాలా అవస్థలు పడతావు. వాళ్ల ఆహార అలవాట్లు వేరు’’ అని మా మేనమామలతో పాటు ఇతర బంధువర్గం నన్ను భయపెట్టారు. కానీ పెళ్ళయిన తరువాత నాకు అలాంటి సమస్యలేవీ ఎదురుకాలేదు. అర్జునరావు కుటుంబంలో నాకు అమితమైన ప్రేమాభిమానాలు దొరికాయి. ఇద్దరం గుడివాడలో కొన్నాళ్లు పేద విద్యార్థుల కోసం హాస్టల్‌ నడిపాం. మా నాన్న ఆదర్శాలకు అనుగుణంగా మా జీవనయానం కొనసాగిస్తున్నాం. 


నెహ్రూ సమక్షంలో పెళ్లి...

నిజానికి మా పెళ్లి మహాత్మా గాంధీ చేతుల మీదుగా జరగాల్సింది. కులాంతర వివాహాల ద్వారా సామాజిక అసమానతలు పోతాయనేది మా నాన్న గోరా విశ్వాసం. అర్జునరావుది కృష్ణా జిల్లా వానపాముల గ్రామం. అప్పటికే మా నాన్న ముదునూరులో నిర్వహించే నాస్తికోద్యమ కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొనేవారు. తన ప్రవర్తన కూడా నాన్నకు బాగా నచ్చడంతో మా ఇద్దరికీ పెళ్లి చేద్దామనుకున్నారు. అదే సంగతి ఆయన గాంధీజీకి చెబితే, ‘‘తొందరపడవద్దు. అబ్బాయి కొన్నాళ్లు నాతో పాటు సేవాగ్రామ్‌లో ఉంటాడు. అమ్మాయిని రాజమండ్రిలోని కస్తూర్బా శిక్షణా సంస్థలో చేర్పించండి. ఇకమీదట వాళ్లిద్దరి బాధ్యత నాది. ఇరువురి అభిప్రాయాలూ తెలుసుకొని, నేనే వాళ్ల పెళ్లి చేస్తాను’’అన్నారట. మహాత్ముడు తలచినట్టుగా అంతా సవ్యంగానే జరిగింది. కానీ, గాంధీజీ హత్యకు గురికావడంతో మా పెళ్లి 1948, మార్చి 13న సేవాగ్రామ్‌లో నాటి ప్రధాని నెహ్రూ సమక్షంలో జరిగింది. ఎలాంటి హంగు, ఆర్భాటాలు లేకుండా, సత్యం సాక్షిగా ఒకరికొకరం నూలు దండలు మార్చుకున్నాం. ఆచార్య వినోబాభావే, లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ, థక్కర్‌బాబా, ప్రభాకర్‌ జీ తదితరులు మా పెళ్లికి వచ్చి, మమ్మల్ని అభినందించారు.


అమ్మతో కలిసి ఆరు నెలలు జైల్లో...

మహాత్మాగాంధీ పిలుపుతో దేశమంతా ‘క్విట్‌ ఇండియా’ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్న రోజులవి. మా అమ్మ సరస్వతీ గోరాతో పాటు నేనూ, మా మేనత్త సామ్రాజ్యం, వెంకటసుబ్బమ్మ, రాజేశ్వరి, కొందరు ఇతర మహిళా నాయకురాళ్లు విజయవాడలోని ఒక గుడిలో సమావేశమయ్యాం. అందరం కలిసి నిరసన ర్యాలీ ప్రారంభించి, పది అడుగులు ముందుకేశామో లేదో పోలీసులు మమ్మల్ని చుట్టుముట్టి అరెస్టు చేశారు. అప్పుడు నా వయసు పదమూడేళ్లు. చిన్నపిల్లను కనుక నన్ను అరెస్టు చేయకూడదు. కానీ బ్రిటిష్‌ పోలీసులు అవేవీ ఆలోచించలేదు. మమ్మలల్ని మొదట విజయవాడ సబ్‌ జైల్లో ఉంచారు. తర్వాత బళ్లారిలోని అలీపురం క్యాంపు జైలుకి తరలించారు. అక్కడే అమ్మతో పాటు ఆరు నెలలు ఖైదు అనుభవించాను. అప్పుడే జాతీయ కాంగ్రెస్‌ జెండాతో నిరసన కార్యక్రమంలో పాల్గొన్న అర్జునరావునూ అరెస్టు చేసి, అదే జైల్లో పది నెలలు నిర్బంధించారు. అలా మేమిద్దరం స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని జైలుకెళ్లినందుకు గర్విస్తున్నాం. కానీ దేశంలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మాత్రం బాధగా ఉంది. 

కె. వెంకటేష్‌  ఫొటో: లవకుమార్‌


‘కరోనా’ అని మాకూ తెలీదు...

‘‘నాలుగు నెలల కిందట నాకూ, ఆయనకు జ్వరం, దగ్గు రావడంతో మా తమ్ముడు డాక్టర్‌ సమరం వచ్చి ఏదో పరీక్ష చేయించాడు. తర్వాత మా చిన్నబ్బాయి పవర్‌ మమ్మల్ని హైదరాబాద్‌లోని ఒక ఆస్పత్రిలో చేర్పించాడు. ‘ఏమైంద’ని అడిగితే, ‘మామూలు జ్వరమే’ అన్నారు. మా ఆరోగ్యం కుదుటపడి, తీరా ఇంటికొచ్చిన కొన్నాళ్లకు తెలిసింది... మాకు కరోనా వచ్చి తగ్గిందని. అదీ ఏదో సందర్భంలో మా పిల్లలు అనుకుంటుండగా వినడమే. మేము భయపడతామని ఆ విషయం మా వద్ద దాచారట. అదీ ఒకందుకు మంచిదే అయింది. ఒకవేళ తెలిసినా ఏం చేయగలం, ఆందోళన పడటం తప్ప! ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. కాకపోతే ఆయనే కాస్త నీరసించారు.’’


నన్ను ‘చోర్‌ లడకా’ అన్నారు!

‘‘మద్రాసు పర్యటనకు వచ్చిన మహాత్మాగాంధీతో పాటు నేను కూడా... గోరా ఆదేశాల మేరకు... ప్రత్యేక రైల్లో 1946, ఫిబ్రవరి 5న సేవాగ్రామ్‌ వెళ్లాను. ఏడాది పాటు అక్కడే ఉన్నాను. ఆశ్రమానికి వెళ్ళిన కొత్తలో ఒక రోజు గాంధీజీ నాతో మాట్లాడాలంటూ కాగితం మీద రాసి పంపారు. కానీ ‘నాకు హిందీ రాదు కదా! ఆయనతో ఏం మాట్లాడతాను?’ అనుకొని వెళ్లలేదు. మరుసటి రోజు... అక్కడే ఉంటున్న తెలుగువారైన ప్రభాకర్‌ జీ నన్ను గాంధీజీ వద్దకు తీసుకువెళ్లి, నా భాషా సమస్యను వివరించారు. అప్పుడు మహాత్ముడు నవ్వుతూ, సరదాగా నన్ను ‘చోర్‌ లడకా’ (దొంగ అబ్బాయి) అన్నారు. హిందీ నేర్చుకోమనీ సూచించారు. కొద్దిరోజులకే హిందీ నేర్చుకొని, ఆయనతో మూడు సందర్భాల్లో ప్రత్యేకంగా సంభాషించాను. అప్పుడు గాంధీజీ ఎంతో సంతోషించారు. ఆశ్రమంలో ఉన్నవారందరూ ప్రతిరోజూ ఉదయం ఐదు గంటలకు జరిగే ‘వైష్ణవ జనతో...’ ప్రార్థనకు తప్పనిసరిగా హాజరవ్వాలనేది నిబంధన. నేను నాస్తికుణ్ణి కాబట్టి ఆ ప్రార్థనల్లో పాల్గొనడం నాకు ఇష్టం లేదని గాంధీజీతోనే నేరుగా చెప్పాను. ఆయన నా అభిప్రాయాన్ని గౌరవించి ‘సరే!’ అన్నారు. దాంతో గాంధీజీ మీద నాకు మరింత గౌరవం పెరిగింది. నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవడానికి సేవాగ్రామ్‌ వాతావరణం నాకు ఎంతగానో తోడ్పడింది. ఆ తరువాత కూడా నాకూ, గాంధీజీకీ మధ్య ఉత్తరప్రత్యుత్తరాలు నడిచాయి.’’

- అర్జునరావు


భోజనంలో నెయ్యి ఉండాల్సిందే...

‘‘మా ఇద్దరికీ బీపీ, షుగర్‌ లాంటి ఆరోగ్య సమస్యలేవీ లేవు. అన్నం మంచిదికాదని చాలామంది అంటుంటారు. కానీ చిన్నప్పటి నుంచి మేము అన్నమే తింటున్నాం. అయినా, బాగానే ఉన్నాం కదా! మితంగా తినడం, సమాజహితంగా ఆలోచించడమే మా ఆరోగ్య రహస్యం. అయితే, ఇప్పటికీ మా భోజనంలో నెయ్యి తప్పనిసరిగా ఉండాల్సిందే! మాకు వివాహమై 74 ఏళ్లు గడిచింది. ఇప్పటివరకు ఒక్కసారి కూడా మేము పోట్లాడుకున్నది లేదు. అభిప్రాయభేదాలు తలెత్తిన ప్రతి సందర్భంలోనూ ఇద్దరం కలిసి మాట్లాడుకొని, సమస్యను పరిష్కరించుకొనేవాళ్లం. మా వైవాహిక జీవితంలోని ఆనందమే మా ఆరోగ్యానికి రక్ష. మా చేతులమీదగా కొందరికి కులాంతర వివాహాలు జరిపించాం. మా అబ్బాయిలు మిలావ్‌, చునావ్‌, సాదిక్‌, పవర్‌, అమ్మాయి సూయజ్‌. వీళ్ల పేర్లు మా నాన్నే పెట్టారు. మా పిల్లలను కుల, మత జాడ్యాలకు దూరంగా పెంచాం. వాళ్లందరివీ ఆదర్శ వివాహాలే.! ఇప్పుడు వారంతా కలిసి ‘మనోరమ అర్జున్‌రావు రావూరి పబ్లిక్‌ యుటిలిటీస్‌ (మార్పు) ఫౌండేషన్‌’ పేరుతో కొంతమంది పేద విద్యార్థుల చదువుకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు.’’

Updated Date - 2021-08-31T05:30:00+05:30 IST