హెల్త్‌ ఇన్సూరెన్స్‌ వైపు ఎల్‌ఐసీ చూపు

ABN , First Publish Date - 2022-08-15T10:09:34+05:30 IST

బీమా దిగ్గజం భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) మెడిక్లెయిమ్‌ విభాగంలో తిరిగి ప్రవేశించేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తోంది. బీమా అభివృద్ధి, నియంత్రణ సంస్థ (ఐఆర్‌డీఏఐ) నుంచి స్పష్టత రాగానే తాము ఆ రంగంలో ప్రవేశించాల

హెల్త్‌ ఇన్సూరెన్స్‌ వైపు ఎల్‌ఐసీ చూపు

ముంబై: బీమా దిగ్గజం  భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) మెడిక్లెయిమ్‌ విభాగంలో తిరిగి ప్రవేశించేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తోంది. బీమా అభివృద్ధి, నియంత్రణ సంస్థ (ఐఆర్‌డీఏఐ) నుంచి స్పష్టత రాగానే తాము ఆ రంగంలో ప్రవేశించాలనుకుంటున్నామని ఎల్‌ఐసీ చైర్మన్‌ ఎంఆర్‌ కుమార్‌ తెలిపారు. తాము ఇప్పటికే దీర్ఘకాలిక ఆరోగ్య రక్షణ, గ్యారంటీడ్‌ ఆరోగ్య ఉత్పత్తుల ను నిర్వహిస్తున్నామని, వీటి విషయంలో ఐఆర్‌డీఏఐ ఇటీవల చేసిన సూచనలు పరిశీలిస్తామని ఆయన చెప్పారు. దేశంలో ప్రస్తుతం ఆరోగ్య సంరక్షణ పాలసీలకు డిమాండ్‌ అధికంగా ఉంది. జీవితబీమా రంగంలోని కంపెనీలు నష్టపరిహారం ఆధారిత ఆరోగ్య రక్షణ ప్లాన్లను ఉపసంహరించుకోవాలని 2016 సంవత్సరంలో ఐఆర్‌డీఏఐ సూచించింది. నష్టపరిహారం ఆధారిత ప్లాన్లలో అయితే పాలసీదారులు వైద్య చికిత్సల కోసం చేసిన వ్యయాన్ని బీమా కంపెనీలు తిరిగి చెల్లిస్తాయి. ఫిక్స్‌డ్‌ ప్రయోజన బీమా ప్లాన్లలో అయితే హామీ మొత్తంలో నిర్దేశిత మొత్తాన్ని మాత్రమే చెల్లిస్తాయి. 2030నాటికి దేశ పౌరుల్లో ప్రతీ ఒక్కరూ ఆరోగ్యబీమా పాలసీ కలిగి ఉండాలనే ధ్యేయంతో జీవిత బీమా కంపెనీలు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ విభాగంలోకి తిరిగి ప్రవేశించేందుకు అనుమతించనున్నట్టు ఐఆర్‌డీఏఐ కొత్త చైర్మన్‌ దేబాశిష్‌ పాండా ఇటీవల ప్రతిపాదించారు. కాని ఆ అవకాశం తాము పరిశీలిస్తున్నట్టు తదుపరి స్పష్టీకరించారు. ఈ ప్రతిపాదనలో కొన్ని ఇబ్బందులున్నాయని పరిశీలకులంటున్నారు. 

Updated Date - 2022-08-15T10:09:34+05:30 IST