లాక్‌డౌన్‌ అక్కర్లేదు

ABN , First Publish Date - 2021-05-06T07:15:11+05:30 IST

రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అన్నారు.

లాక్‌డౌన్‌ అక్కర్లేదు

  • రాష్ట్రంలో అదుపులోనే కరోనా!.. 
  • ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మనం మెరుగే
  • 10 రోజులుగా తీవ్రత తగ్గుతోంది.. 
  • ఆక్సిజన్‌ కొరత లేకుండా చూస్తున్నాం
  • ప్రజలు ఆందోళన చెందవద్దు.. 
  • 18-45 ఏళ్ల వారికి టీకా జూన్‌లోనే..!
  • ఇంటింటి సర్వే.. లక్షణాలుంటే కిట్లు.. సీఎస్‌ సోమేశ్‌కుమార్‌


హైదరాబాద్‌, మే 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అన్నారు. ప్రజలు అనవసరంగా భయపడవద్దని, సీఎం కేసీఆర్‌ మార్గనిర్దేశం ప్రకారం నియంత్రణ చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటును పరిగణనలోకి తీసుకుంటే రాష్ట్రంలో పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పారు. 10 రోజులుగా వైరస్‌ తీవ్రత తగ్గుముఖం పడుతోందని, ఇది శుభ పరిణామమని తెలిపారు.  లాక్‌డౌన్‌ విధింపుతో పెద్దగా ఉపయోగం ఉండదన్నారు.  ప్రజల జీవనోపాధి దెబ్బ తింటుందన్నారు. లాక్‌డౌన్‌పై సీఎం, కేబినేట్‌ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. బుధవారం ఆయన ఉన్నతాధికారులు, కలెక్టర్లు, డీఎంహెచ్‌వోలతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. కరోనా కట్టడికి వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది, జిల్లా కలెక్టర్లు కష్టపడి పని చేశారని, దీంతో పరిస్థితి అదుపులో ఉందని తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మనదగ్గర పరిస్థితి బాగానే ఉందన్నారు. సీఎం రోజుకు మూడు, నాలుగు సార్లు తనతో మాట్లాడి తగిన ఆదేశాలిస్తున్నారని, వాటి ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కరోనా రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదన్న ఉద్దేశంతో మౌలిక సదుపాయాలను పెంచుతూనే ఉన్నామన్నారు. సెప్టెంబరులో 18 వేలుగా ఉన్న ఆక్సిజన్‌ పడకలను 52 వేలకు పెంచామన్నారు. అందుకే హైదరాబాద్‌ వైద్య చికిత్స కేంద్రంగా మారిందని, మహారాష్ట్ర, ఏపీ, కర్ణాటక, ఛత్తీ్‌సగఢ్‌ నుంచి కూడా ప్రజలు వచ్చి చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు. విధ ప్రాంతాల నుంచి 33 మెడికల్‌ ఎయిర్‌ అంబులెన్సులు హైదరాబాద్‌కు వచ్చాయన్నారు. 


ఆక్సిజన్‌ కొరత లేకుండా చూస్తున్నాం

రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని సీఎస్‌ సోమేశ్‌ తెలిపారు. ప్రస్తుతం 125 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ ఉత్పత్తి సామర్థ్యం ఉందన్నారు. కేంద్రం 430 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను రాష్ట్రానికి కేటాయించిందని, ఒడిసా, తమిళనాడు, కర్ణాటక నుంచి ఇది రావాల్సి ఉందని చెప్పారు. ఒడిసాకు ఖాళీ ట్యాంకర్లను పంపించి, ఆక్సిజన్‌ను  తీసుకురావడానికి ఆరు రోజులు పడుతుందని, ఇప్పటివరకు 14 ట్రిప్పుల్లో 48 ట్యాంకర్లను పంపించి, ఆక్సిజన్‌ను తెప్పించామని వివరించారు. ఆక్సిజన్‌ వృథా కాకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆడిటింగ్‌ చేస్తున్నామని, 63 సరఫరా కేంద్రాల వద్ద ప్రభుత్వ బృందాల పర్యవేక్షణ ఉందని వివరించారు. రాష్ట్రానికి 600 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ అవసరమంటూ కేంద్రానికి వివరించామని, సాధ్యమైనంత ఎక్కువ కోటాను తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇక రాష్ట్రంలో ఎన్‌-95 మాస్కులు 25 లక్షలకు పైగా, పీపీఈ కిట్లు ఆరు లక్షలు, త్రీప్లై మాస్కులు 86 లక్షలు, ఆర్‌టీపీసీఆర్‌ కిట్లు మూడు లక్షలు, ర్యాపిడ్‌ యాంటీజెన్‌ కిట్లు 11 లక్షలు, హోం ట్రీట్‌మెంట్స్‌ కిట్లు 6.38 లక్షలు, రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు 90 వేల వయల్స్‌, టొసిలిజుమాబ్‌ ఇంజెక్షన్లు 63 వేల వయల్స్‌ వరకు ఉన్నాయని వివరించారు. ఆర్‌టీపీసీఆర్‌ లేబొరేటరీలు 17 ఉన్నాయని, మరో 14 ఏర్పాటుకు టెండర్లు పూర్తయ్యాయని తెలిపారు. సోషల్‌ మీడియా, ఇతరత్రా వస్తున్న వార్తల వల్ల ప్రజలు భయాందోళనకు గురై రెమ్‌డెసివిర్‌ను ఎక్కువ రేట్లకు కొనుగోలు చేసి, నిల్వ చేసుకుంటున్నారని చెప్పారు. పరిస్థితి అదుపులోకి వస్తున్నదని, సాధారణ లక్షణాలున్నా.. వెంటనే కరోనా చికిత్సను ప్రారంభించాలంటూ ఐసీఎంఆర్‌ చెప్పిందని తెలిపారు. దీంతో ప్యారాసిట్మాల్‌, యాంటీబయాటిక్స్‌తోనే చాలామంది కరోనా నుంచి బయటపడే అవకాశాలున్నాయని చెప్పారు.


అన్ని ఆస్పత్రుల్లో కరోనా ఓపీ సేవలు

 అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద కొవిడ్‌-19 ఔట్‌ పేషెంట్‌ వైద్య సేవలను ప్రారంభించామని సీఎస్‌ తెలిపారు. ఏమాత్రం లక్షణాలున్నా అక్కడే మందుల కిట్లను అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇంటింటికీ వెళ్లి జ్వరం, ఇతర లక్షణాలున్న వారిని గుర్తించాలంటూ కలెక్టర్లను ఆదేశించినట్లు చెప్పారు. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ పరిధిలో ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లు, జీహెచ్‌ఎంసీ బృందాలు సర్వే చేస్తున్నాయని, జిల్లాల్లో కూడా ప్రారంభించామని తెలిపారు. లక్షణాలున్నవారికి ఇళ్ల వద్దే  కిట్లను ఇస్తున్నామన్నారు. 


18-45 ఏళ్లవారికి వచ్చే నెలలోనే టీకా

18-45 ఏళ్ల వయసు వారికి వ్యాక్సినేషన్‌ జూన్‌లోనే ప్రారంభమయ్యే అవకాశాలున్నాయన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 42.24 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు తెలిపారు.  కరోనా మరణాలను దాచడం లేదన్నారు. 5 లక్షల రెమ్‌డెసివిర్‌ను ఆర్డర్‌ చేశామని.. 5 వేల వయల్స్‌ వచ్చాయని, రోజుకు 25 వేల వయల్స్‌ అవసరమని వివరించారు. ఈ విషయమై ఫార్మా కంపెనీలతో మాట్లాడుతున్నామన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో 2,400 పోస్టులను భర్తీ చేశామన్నారు. ఆస్పత్రుల్లో ఇప్పటికీ కొన్ని పడకలు ఖాళీగా ఉన్నాయని, ముగ్గురు ఐఏఎ్‌సలు ఎప్పటికప్పుడు పడకలు, మందుల కొనుగోళ్లను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. అధిక చార్జీలు వసూలు చేసే ఆస్పత్రులపై చర్యలు తీసకుంటామన్నారు.

Updated Date - 2021-05-06T07:15:11+05:30 IST