‘లాక్‌డౌన్‌’ అంతంతే!

ABN , First Publish Date - 2020-03-25T09:10:53+05:30 IST

కరోనా వైరస్‌ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ మూడోరోజు మంగళవారం కొనసాగింది. పట్టణాలు, నగరాల్లో వాహనదారులు భారీగా రోడ్లపైకి...

‘లాక్‌డౌన్‌’ అంతంతే!

  • రోడ్లపైకి యథేచ్ఛగా వాహనదారులు 
  • కౌన్సెలింగ్‌ చేసి పంపిన పోలీసులు 
  • పలుచోట్ల కేసులు నమోదు 
  • రైతుబజార్లకు పోటెత్తిన జనం 


(ఆంధ్రజ్యోతి న్యూన్‌నెట్‌వర్క్‌) : కరోనా వైరస్‌ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ మూడోరోజు మంగళవారం కొనసాగింది. పట్టణాలు, నగరాల్లో వాహనదారులు భారీగా రోడ్లపైకి వచ్చారు. పోలీసులు వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించి వెనక్కు పంపించారు. నిబంధనలు ఉల్లంఘించినవారిపై కేసులు నమోదు చేయడంతో పాటు జరిమానాలు విధించారు. విజయవాడలోని రైతుబజార్లు వినియోగదారులతో కిటకిటలాడాయి. కూరగాయలు కొనుగోలు చేసేందుకు జనం అధిక సంఖ్యలో తరలివచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలో 144సెక్షన్‌ విధించారు. మంగళవారం 188సెక్షన్‌ కింద జిల్లావ్యాప్తంగా 1,500 కేసులు నమోదు చేయడంతో పాటు వాహనదారుల నుంచి రూ.7లక్షల జరిమానా వసూలు చేశారు. ప్రకాశం జిల్లాలో కూరగాయలు, ఇతర వస్తువుల ధరలు పెంచి అమ్ముతున్న ఫిర్యాదులతో అధికారులు తనిఖీలు చేశారు. కందుకూరులో విద్యార్థులకు స్టడీ అవర్‌ నిర్వహిస్తున్న నారాయణ హైస్కూలుపై కేసు నమోదు చేశారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో 144 సెక్షన్‌ అమల్లో ఉన్నా దుకాణాలు తెరిచిన ఆరుగురు వ్యాపారులపై పోలీసులు కేసు పెట్టి అరెస్టు చేశారు. చిత్తూరులో నిబంధనలకు వ్యతిరేకంగా తరగతులు నిర్వహిస్తున్న ఓ ప్రైవేటు స్కూలును సీజ్‌ చేయాలని కలెక్టర్‌ నారాయణ భరత్‌గుప్తా ఆదేశించారు. కాగా, రాష్ట్రంలో ఎక్కడా నిత్యావసర వస్తువులకు కొరత రానీయకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను సీఎస్‌ నీలం సాహ్ని ఆదేశించారు. విదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరినీ తప్పని సరిగా హోం ఐసోలేషన్‌ లో ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉగాది వేడుకలను ఇళ్లలోనే చేసుకోవాలని, దీనికి మత పెద్దలు సహకరించాలని కోరారు. 

Updated Date - 2020-03-25T09:10:53+05:30 IST