అప్పు తీసుకుంటే.. ఆయువు తీరినట్టే!

ABN , First Publish Date - 2022-08-01T09:23:46+05:30 IST

ఆన్‌లైన్‌ అప్పులు ఆయువు తీస్తున్నాయి. రుణ యాప్‌ల దారుణాలు పెచ్చరిల్లుతున్నాయి. డబ్బులిచ్చి, వేధించి చివరికి ప్రాణాలు బలిగొంటున్నాయి. ఆర్థిక ఇబ్బందులతో రుణం తీసుకున్నవారు తిరిగి చెల్లించినా అరాచక పర్వం మాత్రం

అప్పు తీసుకుంటే.. ఆయువు తీరినట్టే!

యమపాశాల్లా రుణ యాప్‌ లు

 పరువు, ఆయువు రెండూ అవుట్‌

బంధువులు, మిత్రులకూ ఫోన్లలో వేధింపులు

బాధితులు చనిపోతున్నా పట్టని పోలీసులు

మంత్రి, మాజీ మంత్రికీ ఫోన్లతో అరాచకాలు 


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఆన్‌లైన్‌ అప్పులు ఆయువు తీస్తున్నాయి. రుణ యాప్‌ల దారుణాలు పెచ్చరిల్లుతున్నాయి. డబ్బులిచ్చి, వేధించి చివరికి ప్రాణాలు బలిగొంటున్నాయి. ఆర్థిక ఇబ్బందులతో రుణం తీసుకున్నవారు తిరిగి చెల్లించినా అరాచక పర్వం మాత్రం ఆగడంలేదు. బంధువులు, మిత్రులకు ఫోన్లు చేసి ‘ఫలానా వ్యక్తి రుణం తీసుకున్నాడు. చెల్లించమని చెప్పండి. లేదా మీరు చెల్లించండి’ అంటూ వేధిస్తున్నారు. మంత్రికే ఏకంగా 79 సార్లు ఫోన్‌ చేసి వేధించారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మాజీ మంత్రి, ఎమ్మెల్యేకు ఫోన్‌ చేసి మీ బామ్మర్ది ఎనిమిది లక్షలు తీసుకున్నారు, మీరు చెల్లించండి అని అడగడం రాష్ట్రం లో సంచలనమైంది. రాష్ట్ర మంత్రి కాకాని గోవర్ధన్‌ రెడ్డి ఏ లోన్‌ యాప్‌ ద్వారానూ అప్పు తీసుకోలేదు. మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌కు అసలు బామ్మర్దే లేరు. అయినా వారికి ఇలాంటి ఫోన్లు రావడం కలకలం రేపుతోంది. మొత్తంగా ఆన్‌లైన్‌ రుణాల ఆగడాలు సామాన్యుల నుంచి ప్రముఖుల వరకూ చేరాయి. 


గేలానికి ఇలా చిక్కుతున్నారు..

ఇటీవలి కాలంలో రాష్ట్రంలో యువకులు, మహిళలు రుణ యాప్‌ల వలలో చిక్కుకుని ఆత్మహత్యకు పాల్పడినా బాధ్యులను అరెస్టు చేయని పోలీసులు మంత్రి, మాజీ మంత్రి విషయానికి వచ్చే సరికి వేగంగా స్పందించడం విశేషం. కరోనా తర్వాత 2020 మే, జూన్‌ నుంచి దేశవ్యాప్తంగా రుణ యాప్‌లు, ఆన్‌లైన్‌ అప్పులు మొదలయ్యాయి. అప్పు కావా లా? అయితే ఆధార్‌ నెంబర్‌, మొబైల్‌లో ఫోన్‌ బుక్‌ వివరాలు చాలు అంటూ ఎరవేయడంతో సమాన్య, మధ్య తరగతి ప్రజలు ఆ గేలానికి చిక్కుకుంటున్నారు. పత్రాలు, హామీ లు ఏమీ లేకుండా అప్పులిస్తామనడంతో ఆశపడిన వారికి రూ.5 వేలు అప్పుగా ఇచ్చి వారం తిరిగే లోపు 7 వేల నుంచి 12 వేల వరకూ వసూలు చేసిన యాప్‌ల అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. పరువు పోతుందని భయపడి కొందరు చెల్లించినా, ఇంకా వేధింపులు ఎక్కువ అవడంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. అసభ్య కరమైన సందేశాలు పంపుతూ మానసికంగా హింసిస్తున్నారు. 


వీరంతా బాధితులే..

సరిగ్గా పది రోజుల క్రితం ఉభయ గోదావరి జిల్లాల్లో ఇద్దరు యువకులు రుణ యాప్‌ల బారిన పడి ఆత్మహత్య చేసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పెద్దెవాని గ్రామానికి చెందిన కొడమంచిలి శివకుమార్‌(30) కుటుంబ అవసరాల కోసం రుణం తీసుకున్నాడు. అది పూర్తిగా తీర్చలేక, వేధింపులు భరించలేక గోదావరిలో దూకేశాడు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం గ్రామానికి చెందిన భోగిరెడ్డి గిరిప్రసాద్‌(26) ఆన్‌లైన్‌ యాప్‌లో రుణం తీసుకుని చెల్లించేశాడు. ఫోన్లో వేధింపులు ఆగలేదు. బంధుమిత్రులకు, ఆయన పనిచేసే కంపెనీ యజమానికి సైతం ఇవే ఫోన్లు వస్తుండటంతో చివరికి ఆ యువకుడు రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నాడు.


కృష్ణా జిల్లా నందిగామకు చెందిన హరిత వర్షిణి కూడా ఇలాంటి వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డారు. నగ్న ఫొటోలు పంపుతామని ఫోన్లో బెదిరించడంతో ప్రాణం తీసుకున్నారు. గుంటూరు జిల్లాలో సతీష్‌ అనే యువకుడు, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడలోనూ గతేడాది కొందరు ఇలాగే బలవన్మరణానికి పాల్పడ్డారు. విజయవాడలో ఉంటున్న మురళీ అనే వ్యక్తికి ఇటీవల రుణ యాప్‌ లింక్‌ వచ్చింది. ఏంటో అని టచ్‌ చేయగానే రూ.5 వేలు అకౌంట్లో పడ్డాయి. తాను డబ్బులు అడగలేదని చెప్పి వెంటనే వెనక్కి పంపినా నిర్వాహకులు వినలేదు. ప్రాసెసింగ్‌ ఫీజు రెండు వేలు చెల్లించాల్సిందే అని ఒత్తిడి చేశారు. లేదంటే పరువు తీసేలా ఫోన్‌ కాంటాక్ట్‌ లిస్టులోని అందరికీ సందేశాలు పంపుతామని బెదిరించడంతో రెండు వేలు చెల్లించుకున్నట్లు వాపోయారు. మంగళగిరికి చెందిన హరి అనే వ్యక్తికి ఉదయం నిద్ర లేపడం నుంచి అర్ధరాత్రి 12గంటలకు కూడా ఫోన్లు వచ్చేవి. ‘నీ స్నేహితుడు భాను ప్రకాశ్‌ అప్పు తీసుకున్నాడు. నువ్వు చెల్లించు, లేదంటే పరువు తీస్తాం’ అంటూ బెదిరించారు.


నాకు అటువంటి స్నేహితుడే లేడని చెప్పగా, ఫేస్‌బుక్‌లో మిత్రుల జాబితాలోని స్ర్కీన్‌ షాట్‌ తీసి పంపారు. తనకు సంబంధం లేదని చెప్పినా వినకుండా వేధించడంతో హరి వైసీపీ కీలక నేత వద్ద గోడు వెల్లబోసుకున్నారు. అయితే, నేనూ బాధితుడినే.. బయటికి చెప్పలేక పోతున్నా.. అని ఆ నేత చెప్పడం కొసమెరుపు. విద్యావంతులు, ఉద్యోగులు, గృహిణులు, యువత.. ఇలా అందరూ రుణయా్‌పల బాధితుల్లో ఉన్నట్టు పోలీసులకు అందుతున్న ఫిర్యాదులను బట్టి తెలుస్తోంది. 


వడ్డీ కాదు.. దోపిడీ..

ఆన్‌లైన్‌ రుణ యాప్‌ల్లో వడ్డీ మన ఊహకు అందనంత అధికంగా ఉంది. కనిష్ఠంగా 32శాతం నుంచి వడ్డీ వసూలు చేస్తున్నారు. యాభై శాతానికి పైగా చెల్లించినా వేధింపులు ఆగడం లేదని బాధితులు ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. గతేడాది విజయవాడలో ఒక వ్యక్తి రూ.7 వేలు రుణం తీసుకుంటే వారం రోజులకు రూ.1,200 వడ్డీ మినహాయించుకుని రూ.5, 800 మాత్రమే ఫోన్‌ పే ద్వారా ఇచ్చారు. వారం తర్వా త రూ.8,100 కట్టాల్సిందేనని డిమాండ్‌ చేశారు. ఇదేంటని అడిగితే ప్రాసెసింగ్‌ ఫీజులంటూ ఏవేవో చెప్పారు. ఇప్పుడు అంత డబ్బుల్లేవని చెప్పడంతో మరో యాప్‌ ద్వారా లోన్‌ ఇప్పించి తమ అప్పు జమ చేసుకున్నారు. ఇలా చక్రబంధంలో చిక్కుకొంటున్న బాధితుల సంఖ్య రాష్ట్రంలో బాగా పెరుగుతోంది. బాధితుల్లో యువతులు, గృహిణులు ఎక్కువగా ఉండటం గమనార్హం. 


ఆర్‌బీఐ చర్య తీసుకోవాలి: పోలీసులు

నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలపై చర్యలు తీసుకునే ఆర్‌బీఐ ఈ రుణయా్‌పలు, ఆన్‌లైన్‌ ఆర్థిక వేధింపులపై చర్యలు తీసుకోవాలని పోలీసులు చెబుతున్నారు. ఢిల్లీ సమీపంలోని గుర్గావ్‌, ఝార్ఖండ్‌లోని జాంతారా, రాజస్థాన్‌లలో ఉన్న నిందితులను పట్టుకు రావాలంటే ఎంత ఇబ్బందో అంటున్నారు. పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే కేంద్రానికి, ఆర్‌బీఐకి యాప్‌ల వివరాలు పంపినందున వాటిని బ్యాన్‌ చేయడమే మార్గమంటున్నారు. ప్రజలు కూడా ఇటువంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.


చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు: న్యాయవాదులు

రుణ యాప్‌ల నిర్వాహకుల వేధింపులపై చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చని న్యాయవాదులు చెబుతున్నారు. మహిళలకు ఫోన్లు చేసి అసభ్యంగా మాట్లాడినా, వారి ఫొటోలు మార్ఫింగ్‌ చేసినా ఐపీసీ 509, 354(సీ)తో పాటు ఐటీ యాక్ట్‌ 66(ఏ) కూడా నమోదు చేయవచ్చంటున్నారు. బెదిరిస్తే ఐపీసీ 509, ఆత్మహత్యకు పాల్పడేలా వేధిస్తే సెక్షన్‌ 306, అధిక వడ్డీ వసూలు చేస్తే ఐపీసీ 383, 384 కింద చర్య తీసుకోవచ్చంటున్నారు. పరువుకు భంగం కలిగించినా, ప్రాసెసింగ్‌ ఫీజుల గురించి దాచి మోసగించినా 463, 464, 420 సెక్షన్ల కింద కేసులు పెట్టి బాధ్యులను జైలుకు పంపవచ్చని వివరిస్తున్నారు.   

Updated Date - 2022-08-01T09:23:46+05:30 IST