సర్వోమాక్స్‌ యాజమాన్యంతో లిక్విడేటర్‌ కుమ్మక్కు!

ABN , First Publish Date - 2021-07-23T05:46:19+05:30 IST

రుణాలు తీసుకుని తిరిగి చెల్లించకుండా దివాలా తీసిన సర్వోమాక్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ యాజమాన్యంతో

సర్వోమాక్స్‌ యాజమాన్యంతో లిక్విడేటర్‌ కుమ్మక్కు!

ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించిన షేర్‌ హోల్డర్స్‌ కమిటీ 


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): రుణాలు తీసుకుని తిరిగి చెల్లించకుండా దివాలా తీసిన సర్వోమాక్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ యాజమాన్యంతో లిక్విడేటర్‌ కుమ్మక్కయ్యారంటూ షేర్‌హోల్డర్స్‌ కమిటీ సభ్యుడు ఎం.ఏకాంబరేశ్వరరావు.. జాతీయ కంపెనీ ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) హైదరాబాద్‌ బెంచ్‌ను ఆశ్రయించారు. కంపెనీ ఆస్తుల వేలం ప్రక్రియను ఐపీ కోడ్‌కు భిన్నంగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. లిక్విడేషన్‌ ప్రక్రియ ప్రారంభించిన నాటి నుంచి 90 రోజుల్లో నడుస్తున్న సంస్థగా చూపి విక్రయించే అవకాశం ఉందన్నారు. ఆ తర్వాత కంపెనీ ఆస్తులను వేర్వేరుగా వేలం ద్వారా విక్రయించడం వల్ల ఎక్కువ నిధులు సేకరించే అవకాశం ఉందన్నారు.


తొలుత కంపెనీ ఆస్తుల విలువ రూ.72 కోట్లుగా నిర్థారించారని, తర్వాత ఆస్తుల విలువను బాగా తగ్గించి రూ.25.88 కోట్లుగా చూపారన్నారు. కంపెనీ వ్యవస్థాపకడు ఎ.వెంకటేశ్వరరావుకు లబ్ధి చేకూర్చేలా లిక్విడేటర్‌ వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. వెంకటేశ్వరరావు బ్యాంకులకు సుమారు రూ.700 కోట్ల మేర రుణాలు ఎగవేశారనే అభియోగాలపై సీబీఐ కేసు నమోదు చేసిందని, దర్యాప్తు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. వెంకటేశ్వరరావుకు చెందిన బినామీలకు ఆస్తుల విలువ తగ్గించి కట్టబెడుతున్నారని పేర్కొన్నారు. 


లిక్విడేషన్‌ ప్రక్రియకు సంబంధించిన అన్ని రికార్డులను ట్రిబ్యునల్‌ ముందుంచేలా లిక్విడేటర్‌ జి. మధుసూధన రావును ఆదేశించాలని కోరారు. ఆస్తుల వేలం ప్రకటనలో ఇచ్చిన గడువు ముగిసిన తర్వాత వచ్చిన బిడ్లను సైతం స్వీకరించినట్లు తెలిపారు. వేలానికి ముందు ఆస్తుల విలువ ఎందుకు తగ్గించాల్సి వచ్చిందో వివరణ కోరాలని, అందుకు సంబంధించిన రికార్డులను ట్రిబ్యునల్‌ పరిశీలనలోకి తీసుకోవాలని కోరారు. ఈ నెల 15న నిర్వహించిన ఈ-వేలానికి సంబంధించి బిడ్లను ఖరారు చేయకుండా ఆదేశాలు జారీచేయాలన్నారు. 


Updated Date - 2021-07-23T05:46:19+05:30 IST