భారం తగ్గించుకుందాం

ABN , First Publish Date - 2022-08-19T05:30:00+05:30 IST

నేటి ప్రపంచంలో ప్రతి మనిషీ తనపై పడుతున్న అధికభారం కారణంగా ఆవేదనతో సతమతం అవుతున్నాడు. దుఃఖానికీ, బాధకూ లోనవుతున్నాడు. అనవసరమైన

భారం తగ్గించుకుందాం

నేటి ప్రపంచంలో ప్రతి మనిషీ తనపై పడుతున్న అధికభారం కారణంగా ఆవేదనతో సతమతం అవుతున్నాడు. దుఃఖానికీ, బాధకూ లోనవుతున్నాడు. అనవసరమైన భారాలను తమ భుజాల మీద వేసుకొని తల్లడిల్లేవారిని కూడా మనం నిత్యం చూస్తున్నాం.


ఒక గ్రామంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి సొంత ఇల్లు ఉంది. ఆ ఇల్లు తనకు చాలడం లేదనిపించింది. ఒక గురువు దగ్గరకు వెళ్ళి, తన సమస్యను ఆయనకు చెప్పాడు. ‘‘స్వామీ! ఎంతో కష్టపడి ఒక మంచి ఇల్లు కట్టుకున్నాను. మా ఇల్లు చాలా బాగుంటుంది. కానీ నా సమస్యేమిటంటే... ఆ ఇల్లు నాకు చాలడం లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. నా సమస్య పరిష్కారానికి ఏదైనా ఉపాయం చెప్పండి’’ అని విన్నవించుకున్నాడు.


‘‘నీ ఇంటి ఆవరణలో ఇంకా ఏమైనా ఉన్నాయా?’’ అని అడిగాడు గురువు.

‘‘ఉన్నాయి స్వామీ! కొన్ని బాతుల్ని పెంచుకుంటున్నాను.’’

‘‘అయితే ఒక పని చెయ్యి. ఆ బాతుల్ని కూడా తీసుకొచ్చి, ఇంట్లోనే పెట్టుకో’’ అని సలహా ఇచ్చాడు గురువు.

గురువు మాట మేరకు... ఆ వ్యక్తి బాతుల్ని తెచ్చి తన ఇంట్లో వదిలాడు. వారం తరువాత తిరిగి గురువు దగ్గరకు వచ్చి ‘‘స్వామీ! ఇప్పుడు పరిస్థితి దారుణంగా ఉంది. ఇంతకుముందు కాస్తో కూస్తో నడవడానికి వీలుండేది. ఇప్పుడు అది లేకుండా పోయింది’’ అన్నాడు.


‘‘నీ ఆవరణలో మరేవైనా ఉన్నాయా?’’

‘‘మేకలున్నాయి స్వామీ!’’

‘‘వాటిని కూడా తీసుకొచ్చి ఇంట్లో కట్టెయ్‌. వారం తరువాత వచ్చి కనిపించు.’’

ఆ వ్యక్తి వారం తరువాత తిరిగి వచ్చి, ‘‘స్వామీ! ఏమిటి నాకీ శిక్ష? ఇప్పుడు పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. అడుగు తీసి, అడుగు వెయ్యడానికి కూడా స్థలం లేదు...’’ అని చెప్తూ ఉండగానే...


‘‘ఇంకేమైనా ఉన్నాయా?’’ అని అడిగాడు గురువు. 

‘‘రెండు మూడు గేదెలున్నాయ్‌’’ అన్నాడు ఆ వ్యక్తి. వాటిని కూడా ఇంట్లోనే కట్టేసి, వారం తరువాత ఎలా ఉందో చెప్పమన్నాడు గురువు.


అప్పుడు ఆ వ్యక్తి కోపంతో రగిలిపోతూ ‘‘స్వామీ! మీకేమైనా మతి పోయిందా? మీరు చెప్పినట్టు చెయ్యడం వల్ల ఇప్పుడు కాస్త స్థలం కూడా లేకుండా పోయింది. మీరేమైనా ఉపాయం చెబుతారనుకుంటే... చివరకు మా ఇల్లు బీభత్సంగా, దారుణంగా తయారైంది. మీ సలహా ఇక చాలు...’’ అన్నాడు ఆవేశంగా.


‘‘అలాగా... సరే... ఇప్పుడు నువ్వు ఒక పని చెయ్యి. ఇంట్లో ఉన్న బాతుల్నీ, మేకల్నీ యథాస్థానంలో కట్టెయ్‌. వారం తరువాత వచ్చి కనిపించు’’ అన్నాడు గురువు.

ఆ వ్యక్తి రెండు మూడు రోజుల్లోనే తిరిగి వచ్చి... ‘‘ఇప్పుడు మా ఇల్లు చాలా విశాలంగా ఉంది. ఎంతో హాయిగా ఉంది’’ అన్నాడు.


‘‘నిజానికి నీకు ఇంకా పెద్ద ఇల్లు అవసరం లేదు. వేటినైతే నువ్వు నీ ఇంట్లోకి తెచ్చుకొని ఇబ్బంది పడ్డావో, వాటన్నిటినీ తొలగించడం వల్ల... ఇప్పుడు నీ ఇల్లు విశాలంగా, ప్రశాంతంగా ఉన్నట్టు గ్రహించగలిగావు’’ అని కనువిప్పు కలిగించాడు గురువు.


మన జీవితాల్లో కూడా ఇలాగే జరుగుతుంది. ఇతరులు చెప్పినవి వినడంవల్ల, అనవసరమైనవన్నీ పోగు చేసుకోవడం వల్లా ప్రస్తుతం మనకు జీవితం భారమైపోయింది. ఆ అనవసర భారాన్ని తగ్గించుకుంటే తిరిగి ప్రశాంతత చేకూరుతుంది. మనలోని సహజమైన ఆనందాన్ని స్వయంగా అనుభూతి చెందగలుగుతాం. వివేకం అనే దారి మనల్ని బయటకు కాకుండా... మన లోపలికి తీసుకువెళుతుంది. అక్కడే మనకు శాంతి లభిస్తుంది.




ప్రేమ్‌ రావత్‌, 9246275220 

www.premrawat.com, www.rajvidyakender.org 

Updated Date - 2022-08-19T05:30:00+05:30 IST