వెలిగిన నీలం నిప్పుపువ్వు

ABN , First Publish Date - 2020-12-14T06:31:54+05:30 IST

‘‘అసలైన ప్రేమ ఏదో తెలుసుకున్నవారు లేరు, సిసలైన ప్రేమ తెలిసీ బతికున్నవారు లేరు’’ ఒక వాగ్గేయకారుడు ఈ పాట పాడి వినిపిస్తున్నప్పుడు...

వెలిగిన నీలం నిప్పుపువ్వు

ఆమె కవిత్వం రాయాలనుకోలేదు. రాయగలననీ అనుకోలేదు. దీన్ని కవిత్వం కాదన్నా ఆమెకేమీ పోయింది లేదు. ‘‘కవిత్వం దాకా దేనికి అసలేది గానీ నేను రాయగలనని మీదాకా దేనికి నామట్టుకు నాకే అనిపించదు’’ - అని ఆమె ఒప్పేసుకుంది.


‘‘అసలైన ప్రేమ ఏదో తెలుసుకున్నవారు లేరు, సిసలైన ప్రేమ తెలిసీ బతికున్నవారు లేరు’’ ఒక వాగ్గేయకారుడు ఈ పాట పాడి వినిపిస్తున్నప్పుడు అనార్కలీ, దేవదాసుల నుంచి రేవతీదేవి దాకా మనసులో మెదిలారు. మెదలడానికి నిజానికి మరచిపోయినదెప్పుడు? కొన్ని పుస్తకాలలాగ, కొన్ని సంగీతాల్లాగ కొందరు, చాలా కొద్దిమంది లెక్కపెట్టడానికి ఒక చేతివేళ్ళు కూడా ఎక్కువ య్యేంతమంది వెంట వస్తారు, మనం జీవిస్తున్నంత కాలం. అలా నా యవ్వన కాలపు విషాద జ్ఞాపకం రేవతీదేవి. ఆమెను తలవలేను. ఆ ఎనభయిల నాటి ఆమె కవిత్వ పుస్తకం ‘శిలాలోలిత’. పుస్తకాల అలమారులోంచి అన్ని పుస్తకాల మధ్య నుంచి ప్రత్యేకంగా కనిపిస్తూ ఉన్నా దానివైపు చూడలేను. కానీ ఆమెను మరువలేను.


గురజాడ చేసిన తిరుగుబాటు లాంటిదే రేవతీదేవి వ్యవస్థ మీద చేసిన తిరుగుబాటు లేదా నిరసన అని నాకు అనిపిస్తుంది. మనసా వాచా కర్మణా అంటే త్రికరణశుద్ధి. ఇది పాతమాట అయిపోయింది. దానికి సమాజం పట్టించిన తుప్పు వదలగొట్టాలని విశ్వప్రయత్నం చేసాడు చలం. చివరికి ఈ సమూహంలో భాగ మైన తనలోనూ ఆ తుప్పు ఉందని గ్రహించి, దాన్ని వదలగొట్టుకునే ప్రయత్నంలో జీవితంలో మూడో భాగమంతా సాధన చేశాడు. అర్థం కానివారికి అది మరేదో అనిపించింది. రేవతీదేవి చేసిన పని కూడా అదే. కాకపోతే మరోవిధంగా చేసింది. చలంలాగ బంధనాలు తెంచుకోగ లుగుతూ వాటిని మరింత విశాల తరం చేసుకోగలిగే స్వేచ్ఛ ఆమెకు లేదు. తన బంధాలు, అనుబంధాల పట్ల ఉన్న గౌరవం లేదా మమత ఆమె చేత ఆ పనిని చెయ్యనివ్వలేదు. కపట జీవనాన్ని చలంలాగే ఆమే ఇష్టపడలేదు. మొదట చలంలాగే సమాజం తాలూకు కపటాన్ని ప్రశ్నించింది.


రేవతీదేవి హృదయంలో తన బాధే కాక ప్రపంచం బాధ కూడా అమితంగా ఉందని ఇందులోని మరిన్ని కవితలు చెప్తూనే ఉన్నాయి. ఒక సావిత్రిగారు, ఒక రేవతీదేవి. వీళ్ళు చుట్టూ ఉన్న అసమాన అతలాకుతలాల మధ్య నలిగి నశి స్తున్న మనుషుల్ని హృయాలకు హత్తుకుంటూనే ఉన్నారు. వేదన పడుతూనే ఉన్నారు. లోకాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. సార్‌్త్ర భక్తులు, శ్రీశ్రీ భక్తులతో సహా అందరు భక్తుల మూర్ఖత్వాన్నీ రేవతీదేవి ప్రశ్నించింది. నెర్రెలు పడ్డ రాయల సీమ కరువును గానీ ఉన్మాదంతో కురిసి అంతలోనే ఉధృ తంగా ప్రవహించుకుంటూపోయిన తుఫాను బీభత్సాన్ని గానీ ఆమె అక్షరాల్లోకి తేకుండా ఉండలేదు. బడబాగ్ని రాత్రిలాంటి తన హృదయంలో ఈ అశాంతి కూడా భాగమే. రాజకీయాల డొల్లతనాన్ని, ప్రజల జడత్వాన్ని, పేదరికపు ఆకలిబాధని ఆమె గమనిస్తూనే నిరసిస్తూనే ఉంది.


ఇదంతా కవిత్వమేనా - కవిత్వమౌతుందా? 

ఆమె కవిత్వం రాయాలనుకోలేదు. రాయగలననీ అనుకోలేదు. దీన్ని కవిత్వం కాదన్నా ఆమెకేమీ పోయింది లేదు. ‘‘కవిత్వం దాకా దేనికి అసలేది గానీ నేను రాయగలనని మీదాకా దేనికి నామట్టుకు నాకే అనిపించదు’’ - అని ఆమె ఒప్పేసుకుంది కానీ, ‘‘గగనం గగనాకారం సాగరః సాగరోపమః రామరావణయోర్యుద్ధం రామరావణయోరివ’’ - అంటాడు వాల్మీకి. మహాయుద్ధం గురించి చెప్పాలి. అదీ తర్వాతి కాలంలో రామరావణ యుద్ధం జరిగిపోతోంది అక్కడ అనేలాంటి నానుడికి కారణమైన యుద్ధం గురించి. ఒక్కమాటతో మన ఊహకి అందించి ఊరుకున్నాడు. ఆకాశం ఆకాశం లానే ఉంటుంది. సముద్రమూ సముద్రం లానే. రామరావణ యుద్ధం రామరావణ యుద్ధంలాగానే. పెద్ద కిటికీ తెరిచిపెట్టాడు. నువు చూపు సారించగలగాలంతే. ఇది కవిత్వం ఐతే రేవతీదేవి కవిత్వమే రాసింది. ఊరికే రాయలేదు. సరదాకి అసలు కాదు. కవిత్వం కోసం కూడా కాదు. 

వాడ్రేవు వీరలక్ష్మీదేవి

కవిత్వం కోసమే ఈ ‘అర్మిలి’

భాషలు, ప్రాంతాలు, సంస్కృతులు, కాలాలు, వాదాలు... ఇంకా ఏవో, ఏవేవో. వీటన్నింటికీ అతీతంగా సృష్టి వైవిధ్యంలో దాగున్న అనంత వర్ణాలను సాధ్యమైన మేరకు పట్టిచూపటానికి ప్రయత్నించిన అపురూప కవిత్వాన్ని నేటితరానికి అందించాలన్న ప్రగాఢ ఆకాంక్ష నుంచి జనించిన నూతన ప్రచురణాలయం ‘అర్మిలి’. తొలి, మలి అడుగులుగా రేవతీదేవి ‘శిలాలోలిత’, ఇంద్రగంటి శ్రీకాంతశర్మ ‘అనుభూతి గీతాలు’ కవితా సంకలనాలను ఈ నెల 18న విడుదల చేస్తోంది. ఈ ప్రచురణలు ‘అర్మిలి’ వద్ద, అమెజాన్‌లో మాత్రమే లభిస్తాయి. 

అర్మిలి, హైదరాబాద్‌. 

ఫోన్‌: 70938 00303


Updated Date - 2020-12-14T06:31:54+05:30 IST