‘గిరిజన రిజర్వేషన్‌’పై పార్లమెంటు సాక్షిగా అబద్ధాలు

ABN , First Publish Date - 2022-03-23T08:30:18+05:30 IST

గిరిజన రిజర్వేషన్ల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలే పంపలేదంటూ పార్లమెంటు సాక్షిగా బీజేపీ అబద్ధాలు చెప్పడం విడ్డూరంగా ఉందని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు అన్నారు.

‘గిరిజన రిజర్వేషన్‌’పై పార్లమెంటు సాక్షిగా అబద్ధాలు

  • కేంద్ర మంత్రిని బర్తరఫ్‌ చేయాలి
  • 2017లోనే ప్రతిపాదనలు పంపాం
  • మోదీకి స్వయంగా లేఖ ఇచ్చిన కేసీఆర్‌
  • కేంద్ర మంత్రులకు లేఖ రాసిన సత్యవతి
  • ప్రతిపాదనే రాలేదనడం విడ్డూరం: హరీశ్‌
  • కేంద్రం తీరుపై నేడు రాష్ట్రవ్యాప్త నిరసనలు


హైదరాబాద్‌, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): గిరిజన రిజర్వేషన్ల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలే పంపలేదంటూ పార్లమెంటు సాక్షిగా బీజేపీ అబద్ధాలు చెప్పడం విడ్డూరంగా ఉందని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు అన్నారు. కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్‌ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో మంత్రులు సత్యవతి రాథోడ్‌, కొప్పుల ఈశ్వర్‌, ఎంపీ మాలోతు కవిత, రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులతో కలిసి హరీశ్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు. గిరిజన రిజర్వేషన్ల పెంపుపై 2017లోనే అసెంబ్లీలో బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపామన్నారు. దీనిపై కేంద్రంతో ఎన్నో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయని.. ఇప్పుడు అసలు ప్రతిపాదనే లేదంటూ పార్లమెంటును తప్పుదోవ పట్టించిన కేంద్ర మంత్రిని తక్షణమే బర్తరఫ్‌ చేయాలని ప్రధాని మోదీని డిమాండ్‌ చేశారు. ఆయనతో తెలంగాణ గిరిజనులకు క్షమాపణ చెప్పించాలన్నారు. 9.08 శాతం గిరిజన రిజర్వేషన్‌ పెంచాలని స్పష్టంగా రాష్ట్రం నుంచి కేంద్ర హోంశాఖకు బిల్లు పంపామని, దీనిపై ఎక్నాలెడ్జ్‌మెంట్‌ కూడా పంపారని చెప్పారు.


2018, 2019లో ప్రధాని మోదీని సీఎం కేసీఆర్‌ స్వయంగా కలిసి లేఖ ఇచ్చారన్నారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ 2021, 2022లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు, గిరిజన శాఖ మంత్రి అర్జున్‌ ముండాకు లేఖ రాయగా వారి నుంచి సమాధానం కూడా వచ్చిందని తెలిపారు. ఇన్ని జరిగినప్పటికీ తెలంగాణ నుంచి ప్రతిపాదనే రాలేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్రంలోని బీజేపీ అబద్ధాల కర్మాగారం నడపుతోందని.. దేశాన్ని, గిరిజన ప్రజలను మోసం చేస్తోందని హరీశ్‌ ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీది ప్రజాస్వామ్య ప్రభుత్వమా? ప్రైవేటు కంపెనీయా? అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్లమెంటులో ప్రివిలేజ్‌ మోషన్‌ ప్రవేశపెడతారని చెప్పారు. కేంద్ర మంత్రి అబద్ధాలను దేశవ్యాప్తంగా తెలిసేలా చేస్తామని, రిజర్వేషన్ల పెంపుతో గిరిజనులకు న్యాయం చేసేవరకు పోరాడతామని అన్నారు. 


కేంద్రం తీరుపై నేడు నిరసనలు

రాష్ట్రం పంపిన గిరిజన రిజర్వేషన్‌ బిల్లును తొక్కిపెట్టి, హక్కులను కాలరాస్తున్న కేంద్రం తీరుపై బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు హరీశ్‌ చెప్పారు. యూనివర్సిటీల పరిధిలో విద్యార్థుల ఆధ్వర్యంలో ఆందోళనలు, గిరిజన తండాలు, గూడేల్లో నిరసనలు, రాస్తారోకోలు, శవయాత్రలు చేపట్టాలని పిలుపునిచ్చారు. 


ఉత్తమ్‌, కిషన్‌రెడ్డికి సోయిలేదా?

తెలంగాణ అసెంబ్లీలో గిరిజన రిజర్వేషన్‌ బిల్లుపై ఆమోదం తెలిపిన సందర్భంలో కాంగ్రెస్‌ తరఫున ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, బీజేపీ పక్షాన కిషన్‌రెడ్డి మద్దతు తెలిపారని మంత్రి హరీశ్‌ పేర్కొన్నారు. పార్లమెంటులో ప్రతిపాదనే రాలేదని అబద్ధం చెబుతుంటే దాన్ని ఖండించాలన్న సోయి వాళ్లిద్దరికీ లేదా అని ప్రశ్నించారు. ఇక ఉత్తమ్‌కుమార్‌రెడ్డే స్వయంగా గిరిజన రిజర్వేషన్‌ ప్రతిపాదన వచ్చిందా అని లోక్‌సభలో ప్రశ్న అడగడం హాస్యాస్పదమన్నారు. బండి సంజయ్‌ సొల్లు పురాణం ఆపి.. గిరిజనుల బిల్లును ఆమోదింపజేసుకొని రావాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రభుత్వం గిరిజనులకు ఎంతో ప్రాధాన్యమిస్తుందని చెప్పారు. మూడువేలకు పైగా తండాలను గ్రామ పంచాయతీలుగా చేశామని, సొంత భవనాలు నిర్మించేందుకు ఈ బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించినట్లు తెలిపారు. సేవాలాల్‌ మహరాజ్‌ జయంతిని సైతం ప్రభుత్వ ఖర్చుతో చేస్తున్నామన్నారు. 


కేంద్ర మంత్రి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: సత్యవతి

తెలంగాణ నుంచి గిరిజన రిజర్వేషన్‌ బిల్లు ప్రతిపాదనే రాలేదన్న కేంద్ర మంత్రి వ్యాఖ్యలను ఖండిస్తున్నామని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ చెప్పారు. కేంద్ర హోం మంత్రికి లేఖ రాస్తే కోర్టులో పెండింగ్‌ ఉన్నట్లు సమాధానమిచ్చారన్నారు. కేంద్ర సర్కారు తీరుకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నిరసనలు, శవయాత్రలు చేపట్టనున్నట్లు ఆమె వెల్లడించారు. 

Updated Date - 2022-03-23T08:30:18+05:30 IST