ప్రభుత్వ నియంత్రణలోకి వాట్సాప్‌, టెలిగ్రాం

ABN , First Publish Date - 2022-09-23T07:27:31+05:30 IST

వాట్సాప్‌, టెలిగ్రామ్‌, సిగ్నల్‌ వంటి ఇంటర్నెట్‌ కాలింగ్‌, మెసేజింగ్‌ సేవలు అందించే యాప్‌లన్నీ త్వరలో కేంద్ర ప్రభుత్వ నియంత్రణ పరిధిలోకి రానున్నాయి. టెలికాం కంపెనీల మాదిరిగా ఈ సంస్థలూ ప్రభుత్వం

ప్రభుత్వ నియంత్రణలోకి వాట్సాప్‌, టెలిగ్రాం

యాప్‌ల ద్వారా కాలింగ్‌, మెసేజింగ్‌ టెలికాం సేవలే

మెసేజింగ్‌ యాప్‌లకూ లైసెన్స్‌ 

కొత్త టెలికాం బిల్లులో కేంద్రం


న్యూఢిల్లీ, సెప్టెంబరు 22: వాట్సాప్‌, టెలిగ్రామ్‌, సిగ్నల్‌ వంటి ఇంటర్నెట్‌ కాలింగ్‌, మెసేజింగ్‌ సేవలు అందించే యాప్‌లన్నీ త్వరలో కేంద్ర ప్రభుత్వ నియంత్రణ పరిధిలోకి రానున్నాయి. టెలికాం కంపెనీల మాదిరిగా ఈ సంస్థలూ ప్రభుత్వం నుంచి లైసెన్స్‌ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేగాక... కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వాట్సాప్‌, టెలిగ్రామ్‌ తదితర యాప్‌ల ద్వారా పంపే మెసేజ్‌లను ప్రభుత్వం పరిశీలించవచ్చు, లేదా నియంత్రించవచ్చు.


కేంద్రం బుధవారం విడుదల చేసిన ఇండియన్‌ టెలికాం ముసాయిదా బిల్లు-2022 ఈ మేరకు కొన్ని ప్రతిపాదనలు చేసింది. ఈ బిల్లును అనుసరించి... వాట్సాప్‌, జూమ్‌, గూగుల్‌ డ్యూ వంటి యాప్‌లు అందించే సేవలను కూడా టెలికమ్యూనికేషన్‌ సేవలుగా భావిస్తారు. తద్వారా... ఆయా యాప్‌ల ద్వారా చేసే బ్రాడ్‌కాస్టింగ్‌, వాయిస్‌ మెయిల్‌, వీడియో కాలింగ్‌, ఆడియో, వీడియో, టెక్స్ట్‌ సర్వీసెస్‌ వంటివన్నీ టెలికమ్యూనికేషన్‌ సేవల పరిధిలోకే వస్తాయి. అలాగే... ఈ యాప్‌ల కారణంగా ప్రజల భద్రత, దేశ సార్వభౌమత్వం, సమగ్రత, విదేశాలతో సంబంధాలు, పబ్లిక్‌ ఆర్డర్‌కు భంగం కలుగుతుందని భావించిన పక్షంలో మెసేజ్‌లను అడ్డుకునేందుకు ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. బిల్లులోని సెక్షన్‌ 24 ప్రకారం... ఎన్‌క్రిప్టెడ్‌ మెసేజ్‌లను, ఆడియో, వీడియో కాల్స్‌ను ప్రభుత్వం నిలిపివేయవచ్చు, లేదా సంబంధిత అధికారులకు ఆ సమాచారాన్ని వెల్లడించవచ్చు.


కాగా... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు పొందిన మీడియా ప్రతినిధులు ప్రచురణార్థం పంపించే మెసేజ్‌లకు ఈ సెక్షన్‌ నుంచి మినహాయింపు ఇచ్చారు. అయితే... తాజా బిల్లు చట్టంగా మారితే ఆయా యాప్‌ల ద్వారా పంపించే ఎన్‌క్రిప్టెడ్‌ సమాచారాన్ని కూడా ప్రభుత్వానికి సదరు కంపెనీలు వెల్లడించాల్సి ఉంటుంది. దీనివల్ల డేటా ప్రైవసీ హక్కు ప్రమాదంలో పడే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

Updated Date - 2022-09-23T07:27:31+05:30 IST