ఎల్‌ఐసీ ఐపీఓ వాయిదా?

ABN , First Publish Date - 2022-03-02T05:48:35+05:30 IST

ఎల్‌ఐసీ బాహుబలి పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ) వాయిదా పడే

ఎల్‌ఐసీ ఐపీఓ వాయిదా?

  • సంకేతాలిచ్చిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌


న్యూఢిల్లీ: ఎల్‌ఐసీ బాహుబలి పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ) వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ది హిందూ బిజినె్‌సలైన్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనికి సంబంధించి స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ‘ఎల్‌ఐసీ ఐపీఓపై ముందుకు వెళ్లాలనే ప్రభుత్వం భావిస్తోంది. అదే సమయంలో అంతర్జాతీయ పరిణామాలు అనుకూలించకపోతే, ఐపీఓపై సమీక్షకూ వెనకాడం’ అని అన్నారు. దీన్నిబట్టి  ఎల్‌ఐసీ ఐపీఓపై ప్రభుత్వం పునరాలోచనలో పడినట్టు భావిస్తున్నారు. నిజానికి ఈ నెల 11న ఎల్‌ఐసీ ఐపీఓ ఉండొచ్చని మర్చంట్‌ బ్యాంకులు ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇచ్చాయి. అయితే రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గత నాలుగైదు రోజుల్లోనే సెన్సెక్స్‌, నిఫ్టీ మూడు నుంచి 3.1 శాతం వరకు నష్టపోయాయి. 


పరిస్థితులు మారాయి: ఎల్‌ఐసీ ఐపీఓ గురించి తాను గతంలో మాట్లాడినపుడు ఉన్న పరిస్థితిని, ఇప్పుడు ఉన్న పరిస్థితులనూ ఆర్థిక మంత్రి సీతారామన్‌ వివరించారు. ‘గతంలో నేను దీనిపై మాట్లాడే నాటికి రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇప్పుడు ఆ రెండు దేశాల మధ్య పూర్తి స్థాయిలో యుద్ధం నడుస్తోంది. కాబట్టి ఎల్‌ఐసీ ఐపీఓ విషయం సమీక్షించాల్సిన అవసరం ఏర్పడింది’ అన్నారు. 


కష్టమే : దాదాపు రూ.65,000 కోట్ల ఈ బాహుబలి ఐపీఓను విజయవంతం చేసేందుకు ప్రభుత్వం చేయాల్సిన పనులన్నీ ఇప్పటికే పూర్తి చేసింది. ఎల్‌ఐసీ ఈక్విటీలో 20 శాతం ఎఫ్‌డీఐకీ శనివారం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అయినా మార్కెట్‌ తీవ్ర ఆటుపోట్లకు లోనవుతోంది. ఎఫ్‌ఐఐలూ.. ఎల్‌ఐసీ ఐపీఓ మీద అంత ఆసక్తితో లేవనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు రెగ్యులేటరీ సంస్థలు కూడా ఇంత హడావుడిగా ఐపీఓను క్లియర్‌ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నట్టు మార్కెట్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్‌ఐసీ ఐపీఓపై తొందరపడడం కంటే మార్కెట్లు కుదుటపడే వరకు వేచి చూసి, వచ్చే ఆర్థిక సంవత్సరం (2022-23) మార్కెట్‌కు వెళ్లడమే మేలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. 


Updated Date - 2022-03-02T05:48:35+05:30 IST