వ్యవసాయ వెతలపై వేదనాక్షరాలు

ABN , First Publish Date - 2021-07-11T05:54:16+05:30 IST

డా.యలమంచిలి శివాజీ రాసిన ‘పల్లెకు పట్టాభిషేకం’ గత ఐదు దశాబ్దాలలో వ్యవసాయ రంగంలో ఆశించిన విధానపర అంశాలపై పేర్కొనదగిన వ్యాసాల సంపుటి...

వ్యవసాయ వెతలపై వేదనాక్షరాలు

డా.యలమంచిలి శివాజీ రాసిన ‘పల్లెకు పట్టాభిషేకం’ గత ఐదు దశాబ్దాలలో వ్యవసాయ రంగంలో ఆశించిన విధానపర అంశాలపై పేర్కొనదగిన వ్యాసాల సంపుటి. వ్యవసాయ అభివృద్ధిలో నెలకొన్న సంక్షోభం వ్యవసాయంపై ఆధారపడిన వారిలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. రైతుల పట్ల అమితమైన ఆవేదనను వ్యక్తపరుస్తూ రచయిత సాగునీరు, విద్యుత్‌, ఎరువులు, రుణసదుపాయం, పెరుగుతున్న అనుత్పాదక భూమి వంటి అనేక అంశాలను ప్రస్తావించారు.


స్థూలంగా చెప్పాలంటే గ్రామీణ జీవనంలో నెలకొన్న వివిధ దుష్ప్రభావాలు, రైతులలో వక్రీకరణకు కారణమైన వివిధ అంశాలను, ఈ గ్రంథం ప్రస్తావించింది. రైతులు అందిస్తున్న సేవలు, వారికి లభిస్తున్న ఫలితాల మధ్య గల అసంబద్ధతను ఇది ప్రస్తావిస్తుంది. పలు పరిశ్రమలకు ముడి పదార్థాలను అందిస్తున్నది రైతులే అయినప్పటికీ వారి ఆదాయం పెరగటం లేదు. మరోవంక పరిశ్రమలు అనేక రెట్లు సుసంపన్నం అవుతున్నాయి.


ఈ సందర్భంగా, స్వాతంత్య్రం వచ్చిన తొలి రోజులలో జాతీయ ఆదాయానికి వ్యవసాయ రంగం 59 శాతం సమకూర్చేదని రచయిత తెలిపారు. అయితే నేడు జాతీయ ఆదాయంలో వ్యవసాయం వాటా 20 శాతం కూడా లేదు. కానీ, గత 71 ఏళ్ళల్లో తమ జీవనాధారం కోసం వ్యవసాయంపై ఆధారపడుతున్న వారి సంఖ్య కేవలం 71 నుండి 63 శాతానికి మాత్రమే తగ్గింది. వ్యవసాయ ఉపకరణాల ధరలు వరుసగా పెరుగుతూ ఉండడంతో 63 మంది రూపాయిలో 20 పైసలు మాత్రమే పంచుకొనవలసి వస్తుండగా, వ్యవసాయేతర రంగాలలో ఉన్న 37 మంది 80 పైసలు పంచుకొంటున్నారు. ఆ విధంగా ఆదాయాల మధ్య అంతరాలు పెరిగిపోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల నుండి ఆదాయం పట్టణ ప్రాంతాలకు తరలిపోతూన్నది. ఈ సందర్భంగా, దేశంలో వ్యవసాయ అభివృద్ధిని పెంపొందింప చేయడం కోసం ఈ గ్రంథంలో పలు సూచనలు చేయడం జరిగింది.


వ్యయం తగ్గించుకోవడం, సాంకేతికతను ఉపయోగించుకోవడం, ప్రాసెసింగ్‌, మార్కెటింగ్‌ వంటి అంశాలపై రైతులకు మార్గదర్శకం లేకపోవడం, వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు అందకపోవడంతో గ్రామీణ ఆదాయం తగ్గిపోయి, వ్యవసాయ రంగానికి అందవలసిన ప్రయోజనాలను చాలావరకు పట్టణ ప్రజలే ఎగరేసుకుపోతున్నారు. అదే సమయంలో మెరుగైన జీవనం కోసం పట్టణ ప్రాంతాలకు వలస వస్తున్న వారిని వాణిజ్య, పారిశ్రామిక రంగం అక్కున చేర్చుకోలేక పోవడంతో పట్టణ ప్రాంతాలలో పుట్టగొడుగుల వలే మురికివాడలు పెరిగి పోతున్నాయి. ఈ ప్రక్రియను నిరోధించడం కోసం గ్రామీణ ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలని రచయిత సూచించారు. అందుకోసం, పట్టణ ప్రాంతాలతో సమానంగా రహదారులు, సమాచారం, విద్య, వైద్యం, విద్యుత్‌ సరఫరా, గృహ నిర్మాణం, తాగునీరు వంటి సదుపాయాలను గ్రామీణ ప్రాంతాలలో కల్పించాలి.


ఒక అధ్యాయంలో, రైతులు చాలావరకు ప్రగతిశీలురై, మెరుగైన సాంకేతికతను ఉపయోగిస్తున్న గుంటూరు జిల్లాలోని వ్యవసాయ పరిస్థితుల గురించి రచయిత వివరించారు. ఈ జిల్లాలో అత్యధికంగా రైతులు ప్రైవేటు రుణాలపై ఆధారపడి, పెద్ద మొత్తంలో వడ్డీ చెల్లించవలసి వస్తోంది. అధిక పెట్టుబడులతో వారు అనేక రకాల పంటలు పండిస్తున్నారు. కానీ చివరకు వారి ఉత్పత్తులను తక్కువ ధరలకే అమ్ముకోవాల్సి వస్తున్నది. ఫలితంగా రైతులు ఋణాల ఊబిలో కూరుకుపోవడం, వ్యాపారులు అత్యధిక ప్రయోజనాలు పొందుతూ ఉండటం జరుగుతున్నది.


భారత్‌, చైనాల మధ్య ఆసక్తికరమైన సారూప్యతను రచయిత చూపారు. చైనా కూడా మనవలె వ్యవసాయ ఆధారిత దేశం. ఉత్పాదకత, వ్యవసాయంలో సాంకేతికతలలో అద్భుతమైన ప్రగతి సాధించింది. మన దేశంలో సాగులో ఉన్న భూమిలో 60 శాతంలోపే ఉన్న చైనా పెద్దగా దిగుమతులు లేకుండానే తన ఆహార అవసరాలను తీర్చుకోగలుగుతున్నది. భారత దేశంలో వలె చైనాలో భూమి సారవంతమైనది కాదు. కానీ, ప్రభుత్వం రైతులకు అందిస్తున్న ప్రోత్సాహకాలు, సాంకేతిక మద్దతు కారణంగా తన ఆహారపు అవసరాలను తీర్చుకోగలుగుతున్నది. నేడు, చైనా రైతులు మెరుగైన సాంకేతికతను ఉపయోగించుకొంటూ, అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా ఉత్పాదకతను మెరుగుపరచుకోగలుగుతున్నారు. చైనాలో వ్యవసాయ కుటుంబాల సంఖ్య పెరుగుతూ, వ్యవసాయంపై ఆధారపడటం కూడా పెరుగుతున్నది.


దేశంలో వివిధ సమయాలలో, వివిధ ప్రాంతాలలో జరిగిన రైతు ఉద్యమాల చరిత్ర గురించిన తన అనుభవాలను డా.శివాజీ పంచుకున్నారు. రైతుల సమస్యలను ప్రస్తావించడంతో ఈ రచయితకు గల అంకితభావం ప్రశంసనీయమైనది. నేటి తరాలకేగాక, భవిష్యత్‌ తరాల వారికి కూడా ఈ గ్రంథం విలువైన వనరుగా, మార్గదర్శిగా ఉండగలదు.


‘పల్లెకు పట్టాభిషేకం’ గ్రంథానికి ముందుమాట రాయమని కోరడం నేను గౌరవంగా భావిస్తున్నాను. రైతుల పరిస్థితుల పట్ల హృదయాన్ని కదిలించివేసే రచయిత తీవ్రమైన ఆవేదన దాదాపు ప్రతి వ్యాసంలో ప్రతిధ్వనిస్తుంది. తన ప్రయత్నాలలో రచయితకు అంతా మంచి జరగాలని కోరుకొంటున్నాను.

ఎస్‌.ఎ. బోబడే

విశ్రాంత భారత ప్రధాన న్యాయమూర్తి


యలమంచిలి శివాజీ రచన ‘పల్లెకు పట్టాభిషేకం’ గ్రంథానికి ముందు మాట ఇది. 

ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు నేడు హైదరాబాద్‌లో దీనిని ఆవిష్కరిస్తారు.

Updated Date - 2021-07-11T05:54:16+05:30 IST