ప్రకృతికి దగ్గరగా నివసిద్దాం

ABN , First Publish Date - 2020-06-06T07:36:57+05:30 IST

కరోనా మనకు నేర్పిన పాఠం ప్రకృతికి దగ్గరగా నివసించడం; కృత్రిమత్వాన్ని తొలగించుకోవడం. పారిశ్రామిక విప్లవం తర్వాత మనిషి ప్రకృతికి దూరం జరుగుతూ వచ్చాడు. తాను నిర్మించుకున్న ఆకాశ హర్మ్యాలలో జంక్‌ఫుడ్‌ తింటూ, వేగంగా పరిగెడుతూ..

ప్రకృతికి దగ్గరగా నివసిద్దాం

మానవ నాగరికత విపరీత పోకడల కారణంగానే కరోనా వైరస్‌ ఏర్పడిందనేది నేడు అందరూ నమ్ముతున్నారు. తల్లిదండ్రులే నిజమైన సృష్టికర్తలు, దేవుళ్ళు అని నమ్మినప్పుడు మతాడంబరాలతో మనం ప్రకృతికి చేస్తున్న చేటును కూడా నివారించవచ్చు. ప్రకృతి ప్రకోపించకుండా చూసుకోవలసిన బాధ్యత మనమీదన ఉంది.


కరోనా మనకు నేర్పిన పాఠం ప్రకృతికి దగ్గరగా నివసించడం; కృత్రిమత్వాన్ని తొలగించుకోవడం. పారిశ్రామిక విప్లవం తర్వాత మనిషి ప్రకృతికి దూరం జరుగుతూ వచ్చాడు. తాను నిర్మించుకున్న ఆకాశ హర్మ్యాలలో జంక్‌ఫుడ్‌ తింటూ, వేగంగా పరిగెడుతూ, ఫ్యాషన్లతో వింత పోకడలు పోతూ, అన్ని విషయాల్లోనూ కృతిమత్వానికి ప్రాధాన్యతనిస్తూ, తాను ప్రకృతికి దూరంగా వెళుతున్నాననీ, ప్రమాదపు అంచులలోకి జారిపోతున్నాననే స్పృహలో కూడా లేకుండా ఉన్నాడు. ఈ కృత్రిమ పరుగును ఆధునిక మనిషి కరోనా వలన ఆపవలసి వచ్చింది. నాలుగైదు నెలలుగా ప్రపంచం మొత్తం ఇండ్లకే పరిమితమవ్వవలసిన గతి ఏర్పడింది. దీని పర్యవసానం ఆలోచిస్తేనే భయంగా ఉంటోంది.


ఇప్పటికే వలస కార్మికులు ఉపాధి లేక ఇంటి బాట పట్టారు. విదేశాల్లో ఉన్న వైట్‌ కాలర్‌, బ్లూ కాలర్‌ ఉద్యోగులు స్వరాష్ట్రాలకు చేరారు. ప్రైవేట్‌ రంగంలో జీతభత్యాలు కోతలకు గురైనట్టు వినికిడి. ఆర్ధిక రంగం కుదేలవ్వబోతోంది. పర్యాటక రంగం, ఎంటర్‌టైన్‌మెంట్‌, రియలెస్టేట్‌ రంగాలకు కనుచూపు మేర కాంతి కనిపించడం లేదు. ఈ 2020–21 ఆర్థిక సంవత్సరం మొత్తం ఇలాగే ఉండబోతున్నదా అన్న అనుమానం కలుగుతున్నది. ఇన్ని అనర్ధాలకు కారణమైన కరోనా వైరస్‌ కేవలం మానవ నాగరికత విపరీత పోకడల కారణంగానే ఏర్పడిందనేది నేడు అందరూ నమ్ముతున్నారు. అపసవ్య జీవన విధానాన్ని పరిహరించి సరైన భవిష్యత్‌ ప్రణాళికలను ఆవిష్కరించవలసిన సమయం ఆసన్నమైనది. ప్రకృతి మూలాలను వెతుక్కొంటూ వెళ్ళి ప్రకృతి ఒడిలో నివసించగలిగిన నాడు మానవుడు నేటి సమస్యలన్నింటికీ చరమ గీతం పాడగలడు. దీని విషయమై నేడు ఆమోదించవలసిన విషయాలు రెండు. సర్వమానవాళినీ ప్రేమించగలగడం, తల్లి దండ్రులలో దైవాన్ని చూడడం ఒకటి. పంచభూతాలను కాపాడి రక్షించుకోవడం రెండవది. 


ఇప్పటి వరకూ ఏ మానవుడూ దైవాన్ని చూడలేదు, దర్శించలేదు. శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం ప్రకారం ఒక బిడ్డ జననానికి 100% కారకులు తల్లిదండ్రులే. కరోనా సమయంలో ఏ మత సంబంధమైన బాబాలు, బోధకులు విముక్తిని ప్రసాదించలేకపోయారు. అంతా సవ్యంగా ఉన్న కాలంలో ప్రజల నమ్మకాలను, భయాన్నీ సొమ్ము చేసుకోవడంలో ఆరితేరిన అన్ని మతాలూ ఈ క్లిష్ట సమయంలో చేతులెత్తేశాయి. ఇప్పటికైనా మానవుడు నిజాన్ని గ్రహించి శాస్త్రీయతను ప్రాతిపదిక చేసుకొని మనుగడ సాగించడం అలవర్చుకోవాలి. కరోనా వైరస్‌ ఎక్కువగా పరివ్యాప్తి చెందినది మత విశ్వాసులు గుమిగూడిన చోటే అన్న విషయం అంత త్వరగా మస్తిష్కాలలో నుండి తొలగించుకోరాదు.


వైరస్‌ పరివ్యాప్తికి రెండవ అతి ముఖ్యకారణం టూరిజం. టూరిజంలో అతిముఖ్యమైనదీ, పేదలను కూడా ఆకర్షించేదీ మత సంబంధ పర్యాటకమే. ఆర్థిక రాబడి, ఆదాయం గణనీయంగా పడిపోనున్న ఈ సంధికాలంలో ప్రతి ఒక్క పైసాను ఒడిసిపట్టి జాగ్రత్తగా వాడడం నేర్చుకోవాలి. ఆడంబరాలకు పోకుండా తమ ఆచార వ్యవహారాలను, అలవాట్లను తగిన విధంగా మార్చుకోవాలి. అసంబద్ధ అశాస్త్రీయ నమ్మకాలను వదిలి తల్లిదండ్రులే తమ సృష్టికర్తలనే నిజాన్ని విశ్వసించాలి. తమ కష్టార్జితాన్ని ఎవడి నెత్తిమీదనో పోయకుండా ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను పూజించడం, గౌరవించడం అలవరచుకోవాలి. ఇంకో  సంవత్సరం వరకూ ఎలాంటి అదనపు ఆదాయం చేకూరే పరిస్థితి లేదుగాబట్టి ఆర్థిక పొదుపు లేకుంటే ఆత్మహత్యలే గతి అయ్యే పరిస్థితి రావచ్చు. తల్లిదండ్రులే నిజమైన సృష్టికర్తలు, దేవుళ్ళు అని నమ్మినప్పుడు మతాడంబరాలతో మనం ప్రకృతికి చేస్తున్న చేటును కూడా నివారించవచ్చు. ప్రకృతిని కాపాడడం మన తక్షణ కర్తవ్యం. ప్రకృతి ప్రకోపించకుండా చూసుకోవలసిన బాధ్యత మనమీదన ఉంది.


మతం, మూఢవిశ్వాసాలు ఏమాత్రం కొరగాకుండా పోయి కేవలం డాక్టర్లు, నర్సులు, మందులు, శాస్త్రజ్ఞులు మాత్రమే మానవాళిని కాపాడుతున్నారని తేటతెల్లమైన ప్రస్తుత తరుణంలో మానవుడు గుర్తించి పూజించవలసినవి పంచభూతాలు. జననానికి తల్లిదండ్రులు ఏవిధంగా కారణమో, ఆ విధంగానే మనిషి ఎదుగుదలకూ, మనుగడకూ, మరణానికి కారణమవుతున్నవి పంచభూతములే. ఈ విషయం అర్ధమవడానికి ఎలాంటి శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అవసరం లేదు. మత విశ్వాసాలు, మూఢ నమ్మకాల అజ్ఞానపు పొరలు తొలగించుకొని చూడగలిగితే ఈ విశ్వంలో ప్రతిజీవి మనుగడకు, మరణానికి, పంచభూతములు ఏ విధంగా ఆధారంగా నిలుస్తాయో విశదమవుతుంది. 


పర్యావరణం లేదా ప్రకృతి అంటే పంచభూతాలే అనడం అతిశయోక్తి కాదేమో! పర్యావరణ సమతౌల్యం ఉన్నంతకాలం అంతా సజావుగానే ఉంది, మానవుడు అనుకున్నట్లుగానే గడిచింది. ఎప్పుడైతే వీటికి నోరు లేదా గదా అని విపరీతమైన దోపిడికి దాడికి మనిషి పాల్పడ్డాడో అప్పటి నుంచే అరాచకం మొదలైంది మానవ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా గడచిన శతాబ్దంలో అన్ని రంగాల్లో మానవుడు విపరీతమైన accelerated growthకు అలవాటు పడ్డాడు. పంచభూతాల విధ్వంసమే ఆధారంగా, భూమికగా గత వందేళ్ళలో మానవుని అభివృద్ధి పురోగమించింది. జబ్బుపడిన గుర్రాన్ని పట్టించుకోకుండా రైతు దానిని ఇంకా విపరీతంగా పరిగెట్టించాలని ప్రయత్నించినప్పుడు ఉన్న ప్రాణం ఉసూరుమన్నట్లుగా ఈ విపరిణామాల ఫలితమే కరోనా వైరస్‌. 


ఇప్పటికైనా మనం గాలి, నీరు, భూమి, అగ్ని మొదలైన ప్రకృతికి ఆలంబనగా ఉన్న వాటిని కాపాడుకోవడం, పదిల పరచుకోవడం అవసరం. అవి మనకు సహజంగా ఏమి ఇస్తాయో వాటిని మాత్రమే స్వీకరించి కొన్ని ఏళ్లపాటు వాటి జోలికి పోకుండా ఉంటే మేలు. మానవ మనుగడకు అనుకూలమైన ప్రణాళికలను రచించి అమలు చేయడమే తక్షణ కర్తవ్యం. ప్రత్యామ్నాయ బ్రతుకు దెరువులను ఆవిష్కరించి పర్యావరణాన్ని తొలచి వేసే mining, forest cutting, drilling, space exploration లాంటి ఆధునిక పోకడలను తక్షణం ఆపుచేయవలసిన ధర్మం మనమీద ఉంది. అలాకాదని గతంలో మాదిరే పర్యావరణ విధ్వంసం దిశగా అడుగులేస్తే ఇక మిగిలేది ఏమీ ఉండదు. పర్యావరణ హితమైన మనుగడ, ఎండ మావుల్లాంటి విపరీత అభివృద్ధిలో ఏదో ఒకటి ఎంచుకోవలసిన సమయం ఆసన్నమైంది. తల్లిదండ్రులను దైవాలుగా పూజిస్తూ, పంచభూతములను ప్రాణాలుగా ఆరాధిస్తూ పర్యావరణ హితమైన నాగరికత విలసిల్లాలని ఆకాంక్షిద్దాం. 

నేలపట్ల అశోక్‌ బాబు (ఐఆర్‌ఎస్‌) 

పూణే (మహారాష్ట్ర) 

Updated Date - 2020-06-06T07:36:57+05:30 IST