నిజమైన ఛాందసవాదులెవరో గుర్తిద్దాం!

ABN , First Publish Date - 2021-06-25T09:22:47+05:30 IST

అది1934 పిబ్రవరి. జర్మనీ చాన్స్‌లర్‌గా అడాల్ఫ్ హిట్లర్ బాధ్యతలు స్వీకరించి అప్పటికి ఏడాది పూర్తవుతున్న సమయమది. ఈ సందర్భంగా నాజీ పార్టీ ఉపాధ్యక్షుడు రుడాల్ఫ్ హెస్...

నిజమైన ఛాందసవాదులెవరో గుర్తిద్దాం!

అది1934 పిబ్రవరి. జర్మనీ చాన్స్‌లర్‌గా అడాల్ఫ్ హిట్లర్ బాధ్యతలు స్వీకరించి అప్పటికి ఏడాది పూర్తవుతున్న సమయమది. ఈ సందర్భంగా నాజీ పార్టీ ఉపాధ్యక్షుడు రుడాల్ఫ్ హెస్.. పార్టీ ముఖ్యనాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘అడాల్ఫ్ హిట్లర్ అంటే జర్మనీ, జర్మనీ అంటే అడాల్ఫ్ హిట్లర్. ఎవరైనా సరే హిట్లర్‌పై ప్రమాణం చేశారంటే జర్మనీపై ప్రమాణం చేసినట్లే’ అని ప్రకటించాడు. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత అంటే 1975 జూన్‌ నెలలో అలాంటి సందర్భం భారతదేశంలో పునరావృతమైంది. నాటి హిట్లర్ అనుచరుడు హెస్ లాగే.. ఇక్కడ అప్పటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన దేవ్‌కాంత్ బారువా నాటి ప్రధానమంత్రికి అత్యంత విశ్వాసపాత్రుడుగా ఉండేవారు. ‘ఇండియానే ఇందిర. ఇందిరే ఇండియా’ అని చెప్పడం ద్వారా ఆయన వార్తల్లోకి ప్రముఖంగా ఎక్కారు. దేవ్‌కాంత్ బారువా ఈ ప్రకటన చేసిన వారానికే అంటే 1975 జూన్ 25 అర్ధరాత్రి భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థను కాలరాస్తూ ఇందిరాగాంధీ దేశవ్యాప్తంగా ఆత్యయిక పరిస్థితి (ఎమర్జెన్సీ)ని ప్రకటించారు. అంతకు నాలుగు దశాబ్దాలకు పూర్వం హిట్లర్ ఏవిధంగానైతే 25 సూత్రాల ఆర్థిక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాడో.. అదే రీతిన ఇందిరాగాంధీ కూడా ఎమర్జెన్సీ సమయంలోనే 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు.


ఈ రోజుల్లో మనం అనుభవిస్తున్న వ్యక్తిగత స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, బలమైన బహుళపార్టీ ప్రజాస్వామ్య వ్యవస్థలకు భిన్నంగా, ఒకనాడు భారతదేశంలో ప్రజాస్వామ్యాన్నిఅణగదొక్కడానికి ఎమర్జెన్సీ చట్టాలను వాడిన నాటి ప్రభుత్వంలో ఆ దారుణ చీకటి రోజులను, అనుభవించిన అత్యంత బాధాకర పరిస్థితులను, నిరంకుశ విధానాలను గుర్తుచేసుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరం. అప్పుడే ప్రజాస్వామ్యం మనకు కల్పించిన హక్కులు, ఆదర్శాలను నిలుపుకుంటూ వాటిని సద్వినియోగం చేసుకుంటూ రాజ్యాంగం పట్ల మరింత గౌరవభావంతో మెలిగేందుకు స్ఫూర్తిని పొందుతాము.


21 నెలల పాటు కొనసాగిన ఈ నిరంకుశమైన ఆత్యయిక పరిస్థితిలో వేల సంఖ్యలో విపక్ష పార్టీ నేతలను, కార్యకర్తలను వివిధ అభియోగాలు మోపి జైళ్లలో బంధించారు. ఇందులో జయప్రకాశ్ నారాయణ్, మొరార్జీ దేశాయ్, అటల్ బిహారీ వాజపేయి, ఎల్‌కే ఆడ్వాణీ వంటి నేతలతోపాటు నాటి విద్యార్థి అరుణ్ జైట్లీ వంటి నేతలెందరో ఉన్నారు. 250 మందికి పైగా పాత్రికేయులు అరెస్టు అయ్యారు. ‘కామన్ మాన్’ పేరుతో భారతదేశ సామాన్య మానవుడి అభిరుచులను, భావాలను కార్టూన్ల రూపంలో ప్రతిబింబించే ప్రముఖ కార్టూనిస్టూ ఆర్కే లక్ష్మణ్ వంటివారు కూడా ప్రభుత్వం ఒత్తిడిని తట్టుకోలేక, భరించడం ఇష్టం లేక, అరెస్ట్ అవడానికి మనసొప్పుకోక మారిషస్‌కు పోవాల్సి వచ్చిందంటే అప్పటి దయనీయ పరిస్థితులను మనం అర్థం చేసుకోవచ్చు.


ఇదే సమయంలో జనాభా నియంత్రణకోసం బలవంతంగా కుటుంబనియంత్రణ అమలుకు పూనుకున్నారు. నాటి పరిస్థితులను గుర్తు చేసుకుని ఇప్పుడు దేశంలో జరుగుతున్న కరోనా టీకాకరణ కార్యక్రమంతోపాటు, ఇతర ప్రజారోగ్య సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సామాన్య ప్రజలు ముందుకు రాని పరిస్థితులు నెలకొన్నాయి. ఎమర్జెన్సీ సమయంలో బలవంతంగా రుద్దిన అనేక కుటుంబ నియంత్రణ కార్యక్రమాలను గుర్తుచేసుకోవడం ద్వారా ప్రజలు ఇంకా భయాందోళనలకు గురి అవుతున్నారు. ప్రజలలో నెలకొన్న అనేక అపోహలకు ఆనాటి సంఘటనలే ఓ కారణమని అర్థమవుతోంది. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కఠినమైన ఆంక్షలు వర్తింపజేశారు. వేతనం కావాలంటే ముందుగా నిర్దేశించిన సంఖ్యలో ప్రజలకు కుటుంబ నియంత్రణ చేయాల్సిందేనని ఆదేశాలు జారీచేశారు. గ్రామాల్లో సామూహిక, భారీ కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు చేపట్టారు. ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి సర్వేలు చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపించాల్సి వచ్చేది. దీనిపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. దీనిలో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లోని ఓ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో మొదలైన చిన్న ఘర్షణ చినికి చినికి గాలివానగా మారింది. పోలీసులు కాల్పులు జరపడంతో ఈ ఘటనలో 50 మందికి పైగా అన్యాయంగా బలికావాల్సి వచ్చింది.


పాత ఢిల్లీలోని తుకారాం గేట్ ప్రజలకైతే కాంగ్రెస్ ప్రభుత్వం చుక్కలుచూపించింది. ఒకవైపు కుటుంబ నియంత్రణ విషయంలో ఒత్తిడితోపాటు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లాలంటూ బెదిరించింది. చుట్టూ మోహరించిన బుల్డోజర్లు, అధికారుల ఆదేశాలతో తమ ఇళ్లపైకి భారీ వాహనాలు దూసుకొస్తున్న భయానక దృశ్యాలను ఆ ప్రాంతంలోని పెద్దవాళ్లు ఇప్పటికీ గుర్తుచేసుకుని ఆవేదన చెందుతున్నారు. ఇందిర ప్రభుత్వం చేసిన ఈ దురాగాతాల కారణంగా 70వేలకు పైగా పాత ఢిల్లీ వాసులు నిరాశ్రయులయ్యారు. దీని పర్యవసానంగా ప్రజలు తిరగబడటంతో హింస చెలరేగింది. దీని మూలంగా నెలరోజులపాటు అక్కడ కర్ఫ్యూ విధించారు.


ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించడం, ప్రజలపట్ల అత్యంత పాశవికంగా వ్యవహరించడాన్ని వామపక్ష ఉదారవాదులగా చెప్పుకున్నకొద్ది మంది కుహనా మేధావులు తమదైన శైలిలో సమర్థించారు. 


ఎమర్జెన్సీ విధించి ప్రజల హక్కులను కాలరాచివేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈనాడు దేశంలో ‘అప్రకటిత ఎమర్జెన్సీ’ నెలకొందని, ‘ఛాందసవాదం పెరిగిపోతోంద’ని విమర్శలు చేస్తుండటం హాస్యాస్పదం. వారి విమర్శ కేవలం అధికారంలో ఉన్న వారిపై ద్వేషభావంతో చేసేదే తప్ప అందులో ఇసుమంతైనా నిజం లేదు. సెప్టెంబర్ 11 (9/11-అమెరికాలో డబ్ల్యూటీసీ టవర్‌పై దాడి), నవంబర్ 26, (26/11 – ముంబైలో ఉగ్రదాడి) లాంటి భయంకరమైన ఉగ్రవాద ఘటనలు జరిగిన నేపథ్యంలో చట్టవ్యతిరేక, టెర్రరిస్టు కార్యక్రమాలను ముందుగానే నివారించడానికి ప్రజలను రక్షంచడానికి తెచ్చినటువంటి చట్టాలను కూడా వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. దేశ సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని రక్షించడం కోసం భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, చేస్తున్న చట్టాలను, నాటి ఎమర్జెన్సీ చట్టాలతో పోల్చడం వారి దివాలాకోరుతనానికి నిదర్శనం.


మేధావుల ముసుగులో ఇలాంటి కార్యక్రమాలను కొంతమంది వామపక్ష ఉదారవాదులు సమర్థిస్తున్నారు. వాళ్ళ ఉద్దేశ్యం హింసను పెంచడం, రక్తపాతం సృష్టించడం తద్వారా దేశంలో అల్లకల్లోలం సృష్టించడం. ఒకవేళ వీరి చర్యల పట్ల కేంద్రం తీవ్రంగా స్పందించి అణచివేసే ప్రయత్నం చేస్తే హింసను ప్రోత్సహించడం ద్వారా భారత సమాజంలో భయభ్రాంతులను కలుగజేయడంతోపాటు ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రతిష్టను మంటగలిపేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. 


పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వంటి చట్టాల ద్వారా పొరుగుదేశాల్లో (ఒకప్పుడు భారతదేశంలో భాగంగా ఉన్నటువంటి దేశాలు) వివక్ష, హింసకు గురవుతున్న మైనారిటీలకు భారతదేశ పౌరసత్వాన్ని కల్పించేందుకు ప్రయత్నం చేస్తే దీనిపైనా రాద్ధాంతం చేస్తున్నారు. జమ్మూ, కశ్మీర్ ప్రాంతాలకు స్వయంప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370, ఆర్టికల్ 35 (ఏ)లను తొలగించడం, మహిళలు, దళితులపై, వ్యవస్థాగతంగా జరుగుతున్న అన్యాయాలను తొలగించడం వంటి చట్టాలెన్నో నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చింది. వీటి ద్వారా ప్రజలకు మేలు జరుగుతుంటే చూసి ఓర్వలేని కాంగ్రెస్ పార్టీ.. ఒకవేళ తాము అధికారంలోకి వస్తే వీటన్నింటినీ తొలగిస్తామని చెబుతోంది. ఇంతకన్నా విలువల్లేని వ్యవస్థ మరొకటి ఉంటుందా? దేశంలో బాబా సాహెబ్ అంబేడ్కర్ నాయకత్వంలో రూపొందించుకున్న ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలను, పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షించడానికి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, ప్రజల మాన, ప్రాణాలను కాపాడడానికి అన్ని చర్యలు తీసుకుంటుంది. దేశంలో కశ్మీర్ నుంచి అండమాన్ వరకు అన్ని ప్రాంతాల ప్రజలకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను కాపాడుతుంది.


భారతదేశ ప్రజలు ఎల్లప్పుడు ప్రజాస్వామ్య స్ఫూర్తి కొనసాగుతూ ఉండేలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. అయితే, చాలా కాలంగా అధికారానికి దూరంగా ఉండటాన్ని తట్టుకోలేని కొన్ని రాజకీయ పక్షాలు దేశంలో ఎమర్జెన్సీ వంటి పరిస్థితులు నెలకొన్నాయని మొసలి కన్నీరు కారుస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ, దానికి మద్దతుగా ఉన్న ఇతర సోకాల్డ్ ఉదారవాద పార్టీలు.. ఎమర్జెన్సీ కాలంలో ప్రజలు ఎదుర్కున్న దారుణ పరిస్థితులను, కష్టాలను, అప్రజాస్వామికంగా ప్రజల గొంతునొక్కిన విధానాలను గుర్తుచేసుకుంటే బాగుంటుంది. తాము వ్యక్తిగతంగా, వ్యతిరేకించే, విద్వేషించే వ్యక్తి అధికారంలో ఉన్నాడన్న ఏకైక కారణంతో తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లో రెచ్చగొడుతున్నారు. జాతి ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలకోసం ఉద్దేశించిన ప్రతి కార్యక్రమాన్ని వ్యతిరేకించడం ప్రజాస్వామ్యంలో మంచి పరిణామం కాదు. ఇటువంటి ప్రమాదకరమైన మార్గం నుంచి బయటకు వచ్చి వాస్తవాలను, ప్రజల మేలును అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. 


జి. కిషన్‌ రెడ్డి

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి

Updated Date - 2021-06-25T09:22:47+05:30 IST