Abn logo
Apr 10 2020 @ 02:52AM

కలిసికట్టుగా ఎదుర్కొందాం

ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా ఉన్న మీడియా పెద్దలతో స్వయంగా మాట్లాడి వారి సలహాలు, సూచనలను కోరారు. అయితే, రాష్ట్ర పెద్దలు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రశ్నలడిగిన పాత్రికేయులను అదిలించడం తప్ప సూచనలు కానీ, సలహాలు కానీ అడగలేదు. కరోనా ఉపద్రవంపై ఈ పోరులో  సమాజంలోని అన్ని వర్గాలు పరస్పర సహకారాలతో, సమన్వయంతో సాగాల్సిన అవసరాన్ని ఇప్పటికైనా గుర్తించాలి. 


‘బతికుంటే బలుసాకైనా తిని బతకొచ్చు’ అని అంటారు. అందుకే, కష్టమైనా సరే మనం కరోనా నిర్మూలన కోసం ఎవరింట్లో వారుండాలి. తమ కోసం, తమ ఉనికి కోసం, భారత జాతి మనుగడ కోసం శుభ్రతను పాటిస్తూ భారత సమాజాన్ని కాపాడుకోవాలి. కరోనా కట్టడి కోసం, మనందరి భవిష్యత్తు కోసం మన ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించారు. సమస్త వ్యవస్థలు పుంజుకుని ప్రజల దైనందిన జీవితాలు తిరిగి గాడిన పడడానికి ఎన్నోచర్యలు తీసుకుంటున్నారు. దేశ శ్రేయస్సుకోసం ఎంతో కృషి చేస్తున్నారు.


ఇలాంటి నియంత్రణలు చేపట్టక పోబట్టే జర్మనీ, స్పెయిన్‌, ఇటలీ, అమెరికా వంటి దేశాలు కోవిడ్‌ 19 విలయంలో చిక్కి విలవిల్లాడుతున్నాయి. ప్రపంచ దేశాలన్నీ కొట్టుమిట్టాడుతున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితులు భారత్‌కు రావొద్దనే ప్రధాని మోదీ ముందు జాగ్రత్తగా విదేశాల నుండి భారత భూభాగంపై అడుగిడిన వెంటనే విమానాశ్రయాల్లోనే దాదాపు 15 లక్షల మందికి స్క్రీనింగ్‌ నిర్వహింపజేశారు. దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయా ణాలపై నిషేధం విధించారు. ఒక రోజు జనతా కర్ఫ్యూ ద్వారా ప్రజలను అప్రమత్తం చేశారు. దేశమంతటా లాక్‌డౌన్‌ విధించి పరిస్థితులను అదుపులోకి తీసుకొస్తున్న నేపథ్యంలో ప్రాణాంతక మహమ్మారిపై దేశం మొత్తం కలిసికట్టుగా సమరం సాగిస్తున్న వేళ, ఒక మత సంబంధ కార్యక్రమంలో పాల్గొన్న విదేశీయుల కారణంగా కరోనా ఆందోళనకరంగా వ్యాపిస్తూవుంది. ఏ మాత్రం ఉదాసీనతతో వ్యవహరించినా అది ఉత్పాతం సృష్టించగలదు. అందుకని, తగు జాగ్రత్తలను తీసుకుంటూ ముందుకు సాగాలి.


ఢిల్లీలోని మర్కజ్‌లో పాల్గొని తాము కరోనా వ్యాధిని  తెచ్చు కోవడమే కాకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరించి సభ్య సమాజాన్ని ప్రమాదంలోకి నెట్టిన వ్యక్తులు.. వైద్య సిబ్బందిపై దాడికి పాల్పడడం క్షమించరాని నేరం. తమ ప్రాణాలను పణంగా పెట్టి కరోనా బాధితులకు సేవలందిస్తున్న గాంధీ ఆస్పత్రిలో డాక్టర్లపై, ఢిల్లీకివెళ్లిన వారిని రక్షించడానికి పాతబస్తీకి వెళ్లిన ఆశా వర్కర్లు, ఆరోగ్య సిబ్బందిపై దాడి చేయడం హేయమైన చర్య. నిజామాబాద్‌ పట్టణంలో కరోనా సోకిన వారి సర్వేకు వెళ్లిన సిబ్బందిపై దాడికి దిగడం వంటి చర్యలు సహించదగ్గవి కాదు. కరోనా వైరస్‌ సోకిన కొంత మంది నిబంధనలను ఉల్లంఘిస్తూ క్వారంటైన్‌కు వెళ్లేందుకు నిరాకరిస్తున్నారు. ఇలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి. వ్యక్తి కంటే, మతం కంటే దేశం గొప్పదని గుర్తుంచుకుని మెదలాలి. యుద్ధంలో ముందుండి పోరాడుతున్న డాక్టర్లు, వైద్య సిబ్బందిలో ఉత్సాహం నింపేలా ప్రొత్సహించాలి. వారికి విధిగా అందరం సహకరించాలి.


ఇప్పటి వరకు కరోనా కేసుల్లో 90 శాతం ముస్లింలవే. కనీసం  ముస్లిం సమాజానికైనా అసదుద్దీన్‌ ఓవైసీ భరోసా ఇవ్వలేకపోయారు. జనతా కర్ఫ్యూ సందర్భంగా డాక్టర్లకు, నర్సులకు, ఇతర వైద్య సిబ్బందికి, పోలీసులకు దేశ ప్రజలందరూ చప్పట్లతో కృతజ్ఞత ప్రకటిస్తే ఓవైసి మాత్రం కృతజ్ఞతా భావం ప్రకటించలేని అజ్ఞానిగా వ్యవరించారు. భారతీయుల ఐక్యతను ప్రదర్శించడానికి రాత్రి 9గంటలకు లైట్లను ఆపేసి దీపం వెలిగించమన్న ప్రధాని మోదీ సూచనలను కూడా మత మౌఢ్యంతో చూడటం ఓవైసీ అవివేకానికి నిదర్శనం. కానీ, ముస్లిం, హిందూ అని చూడకుండా అందరూ దేశ ప్రజలే అనే భావంతో మోదీ వ్యవహరిస్తున్నారు. అసదుద్దీన్‌ ఓవైసీకి ఆస్పత్రులు, మెడికల్‌ కాలేజీలు ఉన్నాయి, అయినా మానవతా దృక్పథంతో తన హాస్పిటల్‌ను ఐసొలేషన్‌ వార్డుకు ఇచ్చి వాళ్ళకు దైర్యం చెప్పలేకపోయారు. ఎంతో మంది ప్రైవేట్‌ వైద్యులు, ప్రైవేట్‌ ఆస్పత్రులను స్వచ్ఛందంగా ఇస్తున్నారు. 


మన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభంలో సీరియస్‌గా తీసుకోకుండా కరోనాది ఏముంది పారాసిటమల్‌ వేసుకుంటే తగ్గిపోతుంది అని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కరోనా మహమ్మారిపై ప్రధాని మోదీ తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారు. కానీ, ధనిక రాష్ట్రం అని చెబుతూ ఉచిత పథకాల కోసం వేల కోట్లు వెచ్చిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, ప్రజలందరికీ భరోసా కల్పించాల్సిన విపత్తు వేళ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలతో మాటమాత్రం చెప్పకుండా వారి జీతాల్లో 50 శాతం తగ్గించడం, సింగరేణి కార్మికుల వేతనంలో కోత విధించడం సహేతుకమైన చర్య కాదు. సమస్య మొదలైన మొదటి నెలలోనే ఉద్యోగులకు జీతాలు పూర్తిగా ఇవ్వలేని దారుణమైన ఆర్థిక పరిస్థితులు నెలకొన్నాయంటే నమ్మశక్యంగా లేదు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రైవేట్‌ ఉద్యోగులు, కార్మికులకు పూర్తి వేతనాలు చెల్లించాలని దేశ ప్రధాని చెప్పారు. సీఎం కేసీఆర్‌ ఈ నిర్ణయాన్ని అలుసుగా తీసుకుని ప్రైవేట్‌ కంపెనీలు, వ్యాపారులు వారి సంస్థల ఉద్యోగులు, కార్మికుల జీతాల్లో కోతలు పెడుతున్నారు. తెలంగాణలో దాదాపు 14 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయారు. ప్రస్తుతం వీరందరికి పని దొరికే పరిస్థితులు లేవు. తెలంగాణ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సెస్‌లో ఉన్న రూ.2300 కోట్లతో వారిని ఆదుకోవాలి. ఆన్‌ లైన్‌లో నమోదు చేసుకున్న 8 లక్షల 50 వేల కార్మికులతో పాటు నమోదు చేసుకోని వారికి కూడా ఆర్థిక సాయమందించాలి. 


మరోవైపు, ఐసీయూలో మాత్రమే డాక్టర్లకు, నర్సులకు పీపీఈ కిట్స్‌ ఇస్తున్నారు. కానీ, నిబంధనల పేరుతో ఐసొలేషన్‌ వార్డులో డాక్టర్లు, నర్సులకు, ఇతర సిబ్బందికి నిరాకరిస్తున్నారు. ఆశా వర్కర్లకు, ఇతర సర్వే సిబ్బందికి కనీసం మాస్క్‌లను, శానిటైజర్లు వంటి సదుపాయాలను కూడా కల్పించలేకపోతున్నారు. 


ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా ఉన్న మీడియా పెద్దలతో స్వయంగా మాట్లాడి వారి సలహాలు, సూచనలను కోరారు. అయితే, రాష్ట్ర పెద్దలు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రశ్నలడిగిన పాత్రికేయులను అదిలించడం తప్ప సూచనలు కానీ, సలహాలు కానీ అడగలేదు.


పేద, సామాన్య ప్రజల కోసం లక్షా డెబ్బైవేల కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని ప్రధానమంత్రి ప్రకటించారు. రైతులు మొదలుకొని జన్‌ ధన్‌ యోజన అకౌంట్లు ఉన్న మహిళల వరకు, గ్రామీణ ఉపాధి హామీ కూలీల నుంచి చిరుద్యోగుల వరకు.. అందరికీ లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి వైద్య సేవలందిస్తున్న ఆశా వర్కర్లు, వైద్య సాంకేతిక, పారిశుద్ధ్య, పారా మెడికల్‌ సిబ్బంది, నర్సులు, వైద్యులకు రూ.50 లక్షల వ్యక్తిగత వైద్య బీమా సదుపాయం, నిరుపేదలకు మూడు నెలల ఉచిత రేషన్‌ ఇస్తున్నారు. లాక్‌డౌన్‌ దృష్ట్యా పీఎం కిసాన్‌ కింద రైతులకు రూ.2వేలు, జన్‌ ధన్‌ ఖాతాలున్న మహిళలకు మూడు నెలల పాటు రూ.500 డిపాజిట్‌ చేస్తున్నారు. ఉపాధిహామీ కూలీ రూ.202కి పెంపు, అలాగే ఉజ్వల స్కీమ్ కింద గ్యాస్‌ కనెక్షన్‌ తీసుకున్న వారికి 3 నెలల పాటు ఉచితంగా గ్యాస్‌ సిలిండర్ల సరఫరా, సింగరేణి లాంటి బొగ్గు గని కార్మికుల ఆరోగ్య అవసరాలకు డిస్ట్రిక్ట్‌ మినరల్‌ ఫండ్‌ను ఉపయోగించుకునేలా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర అనుమతి, వంద లోపు ఉద్యోగులున్న కంపెనీల్లో రూ. 15వేల కంటే తక్కువ జీతం ఉన్నవారికి రాబోయే 3 నెలల పాటు ఈపీఎఫ్‌ ఎంప్లాయర్‌, ఎంప్లాయి కంట్రిబ్యూషన్‌ను కేంద్రమే చెల్లిస్తుంది. స్వయం సహాయక సంఘాలకు రుణపరిమితి రూ.10 లక్షల నుండి 20 లక్షలకు పెంపు వంటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల పేద, మధ్య తరగతి వర్గాలకు లబ్ధి చేకూరుతుంది. రాష్ట్రంలో 60 లక్షల మందికి ఉపయోగపడేలా పీఎం గరీబ్‌ కల్యాణ్‌ ప్యాకేజీలో భాగంగా మహిళల జన్‌ ధన్‌ ఖాతాల్లో మూడు నెలల పాటు నెలకు రూ.500 చొప్పున ఇచ్చే ప్యాకేజీ తొలి విడత నగదును కేంద్రం విడుదల చేసింది. అలాగే కరోనా విపత్తును సమర్థంగా ఎదుర్కోవడానికి కేంద్రం రాష్ట్ర విపత్తు నిర్వహణ కింద తెలంగాణకు రూ.224.50 కోట్లు విడుదల చేసింది. ఇంతటి విషమ పరస్థితుల్లో ప్రధాని మోదీ ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిరుపేదలను. భారత సమాజాన్ని ఆదుకోవాలనే దృఢ సంకల్పంతో, కరోనాపై విజయం సాధించడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు. అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్‌ వైద్య సామగ్రి కోసం ప్రధాని మోదీని సహాయం అడిగారు. కరోనా కట్టడిలో ఇండియా---, అమెరికా భాగస్వామ్యాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఈ విపత్తు సమయంలో మోదీ మన దేశ ప్రధానిగా ఉండడం భారతీయల అదృష్టం.


కరోనా ఉపద్రవంపై ఈ పోరులో సమాజంలోని అన్ని వర్గాలు పరస్పర సహకారాలతో, సమన్వయంతో సాగాల్సిన అవసరాన్ని ఇప్పటికైనా గుర్తించాలి. భారత సమాజానికి ఇంత పెద్ద విపత్తు సంభవించినప్పుడు ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించాలి. తమ వంతుగా చేయదగ్గ పనులు చేయాలి. ఎవరి గడప ముందు వారు లక్ష్మణ రేఖ గీసుకుని తమ ఇంట్లో తాము ప్రాణాలను కాపాడుకుంటూ దేశ సేవ చేయాల్సిన సమయమిది. కరోనాను ఓడించడంలో మనందరం భాగస్వాములం కావాలి. ‘ధనం ఉంటే దాచుకోవాలి, రోగం వస్తే చెప్పుకోవా’లంటారు. ముఖ్యంగా ఇప్పుడు రోగాన్ని దాచుకుంటే తనకు, తన కుటుంబంతో పాటు సమాజానికీ ప్రమాదమని గ్రహించాలి. అవిశ్రాంతంగా సేవలందిస్తున్న వైద్య సిబ్బందిని దైవానికి ప్రతిబింబంగా ప్రధాని మోదీ అభివర్ణించడంలో అతిశయోక్తి లేదు. 


ఐసొలేషన్‌ వార్డులో అనుమానిత పేషెంట్లు తుమ్ముతుంటే, దగ్గుతుంటే అక్కడి ఓ నర్సు అర్ధరాత్రి తన భర్తకు ఫోన్‌ చేసి నాకు నా పిల్లలు గుర్తొస్తున్నారు, పిల్లలను చూడాలనిపిస్తున్నది అని చెప్పిందంటే వారెంత దయనీయ పరిస్థితుల్లో పని చేస్తున్నారో కదా! డాక్టర్లు, నర్సులు, పోలీసులు, ఆశా వర్కర్లు, రెవెన్యూ సిబ్బంది ఏ స్థాయిలో తమ ఉద్యోగం, వృత్తిని నిర్వర్తిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. కాబట్టే ప్రధాని మోదీ చప్పట్లతో వారికి కృతజ్ఞత తెలియజేయమన్నారు.


ఈ పరిస్థితుల్లోనూ మీకు సేవలందించడానికి మానవత్వంతో మీ గల్లీలకు వస్తున్న వైద్య సిబ్బంది, పోలీసులు, ఆశా వర్కర్లు, రెవెన్యూ సిబ్బంది, ఐఏఎస్‌, ఐపీఎస్‌లను అసభ్యంగా తిట్టడం, రాళ్ల దాడులకు పాల్పడం పట్ల సభ్యసమాజానికి ఏ రకమైన సంకేతాలు ఇస్తున్నామో అర్థంచేసుకోవాలి. ఇప్పటికైనా మానవతా దృక్పథంతో ఆలోచిద్దాం. మన కోసం వచ్చే వారిని ఆదరించడం, గౌరవించడం సంస్కారం.., మన దేశంలో అన్ని మతస్థుల సంప్రదాయం. అందుకని, వారు అడిగిన వాటికి జవాబు ఇచ్చి సహకరిద్దాం. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునకు స్పందించి పారిశ్రామిక వేత్తలు, సంపన్నులు, సినీ తారలు మాత్రమే కాదు, ప్రజలు కూడా పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు పీఎం కేర్స్‌కు అందిస్తున్నారు. మనం కూడా మన వంతుగా విరాళాలిచ్చి ప్రజల కోసం, దేశ భవిత కోసం పాటుపడదాం. l బండి సంజయ్‌ కుమార్‌


కరీంనగర్‌ ఎంపీ,

బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు

Advertisement
Advertisement
Advertisement