ఇంటికొకరం సమిధలవుతాం!

ABN , First Publish Date - 2020-02-18T09:33:29+05:30 IST

‘‘ఇది 29 గ్రామాల సమస్య కాదు. రేపు మరో ప్రభుత్వం వచ్చి రాజధానిని మళ్లీ మారుస్తామంటే.. ఇదొక రాజకీయ వ్యవహారంగా, ఎన్నికల హామీగా మారిపోతుంది.

ఇంటికొకరం సమిధలవుతాం!

ఇప్పటిదాకా 12 గంటలు ధర్నాలలో..

ఇక ముందు 24 గంటలూ అక్కడే

రాత్రైనా శిబిరాలువీడని మహిళలు..

రాజధాని కోసం పూజలు, ప్రార్థనలు

‘షహీన్‌బాగ్‌’ను తలపించిన పట్టుదల..

రేపు గుంటూరులో మహిళల కవాతు

నేడు అమరావతికి జాతీయ బృందం..

రైతుల వద్దకు 2 బస్సుల్లో సీమవాసులుఇంటికొకరం 

సమిధలవుతాం!

62వ రోజు ఉధృతమైన ఆందోళనలు

గుంటూరు, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): ‘‘ఇది 29 గ్రామాల సమస్య కాదు. రేపు మరో ప్రభుత్వం వచ్చి రాజధానిని మళ్లీ మారుస్తామంటే.. ఇదొక రాజకీయ వ్యవహారంగా, ఎన్నికల హామీగా మారిపోతుంది. ఈ జబ్బు పక్క రాష్ట్రాలకు పాకి జాతీయసమస్యగా మారే పరిస్థితి రాకుండా యావత్‌  దేశం మా ఉద్యమంపై ఆలోచించాలి’’ అని అమరావతి రైతులు వేడుకొన్నారు. మూడు రాజధానులు రాష్ట్రానికి ఆర్థికభారమేనంటూ రాజధాని రైతులు చేపట్టిన ఆందోళనలు 62వ రోజుకు చేరాయి. ఇక నుంచి ఇంటికొకరం అమరావతి ఉద్యమంలో సమిధలుగా మారి పోరాడతామని నిరసన శిబిరాలు సోమవారం నిసదించాయి. అందులోభాగంగా ప్రతిరోజూ 12గంటలపాటు నిరాహార దీక్షలు చేస్తూ ప్రభుత్వానికి తమ నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు తుళ్లూరు శిబిరంలో 24 గంటలపాటు దీక్ష చేశారు. ఢిల్లీలో మహిళలు కొనసాగిస్తున్న ‘షహీన్‌బాగ్‌’ సుదీర్ఘ నిరసనలను తలపించేలా.. రాత్రంతా మహిళలు, రైతులు దీక్షా శిబిరంలోనే గడిపారు.


ఇకనుంచి ఇదే పంథాలో పోరాడతామని తేల్చిచెప్పారు. ఇప్పటివరకు సాయంత్రం ఆరు గంటలకు శిబిరం ఖాళీ చేస్తున్నామని.. ఇక నిరంతరం శిబిరంలో రైతులు కూర్చొని నిరసన ప్రదర్శనలు చేయనున్నట్లు తెలిపారు. మందడం, తాడికొండలో జరిగిన మహాధర్నాలకు మహిళలు భారీగా తరలివచ్చారు. రాజధానిని రాజకీయ అంశం చేసి.. రోజుకో మంత్రి రోజుకో మాట చెప్తూ తమ చెబుల్లో పూలు పెట్టవద్దంటూ నిరసన తెలిపారు. వెలగపూడి, పెదపరిమి, కృష్ణాయపాలెం, యర్రబాలెం, గుంటూరు కలెక్టరేట్‌ ఎదురు రిలే నిరాహారదీక్షలు కొనసాగించారు. కాగా, బుధవారం మహిళా జేఏసీ అధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించున్నట్లు నేతలు తెలిపారు. పాత గుంటూరు బ్రహ్మానందరెడ్డి స్టేడియం నుంచి జిన్నాటవర్‌ సెంటర్‌, కూరగాయల మార్కెట్‌, హిందూ కళాశాల, మహిళా కళాశాల, నాజ్‌సెంటర్‌ మీదగా విజ్ఞాన్‌ మందిర్‌ వరకు ర్యాలీ కొనసాగుతుందని తెలిపారు. దారి పొడువున ఉన్న అన్ని దేవాలయాలు, దర్గాలు, చర్చీల్లో ప్రత్యేక ప్రార్థనలు, పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు.


అలాగే, శని, ఆదివారం భారీగా అమరావతికి తరలిరావాలని కూడా మహిళా జేఏసీ నిర్ణయించింది. సోమవారం  వేలమంది రైతులతో విజయవాడలో నిరసన తెలపాలని నిశ్చియించారు. వచ్చే బుధవారం మహిళలు, రైతులతో విజయవాడ ధర్నాచౌక్‌లో 24 గంటలు దీక్ష చేపట్టాలని కూడా మహిళా జేఏసీ తీర్మానించింది. ఇదిలాఉండగా, రైతుల పోరాటానికి మద్దతుగా జాతీయ నాయకుల బృందం మంగళవారం రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నట్లు జేఏసీ నేతలు తెలిపారు. ఎంపీ కేకే రాగేశ్‌, మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, అలిండియా కిసాన్‌ సభ, సహాయ కార్యదర్శులు రావుల వెంకయ్య, విజూక్రిష్ణన్‌ తదితరులు పాల్గొంటారని సంఘ నేతలు తెలిపారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే వీరి పర్యటన యర్రబాలెం, కృష్ణాయపాలెం, మందడం, రాయపూడి, తుళ్లూరు వరకు కొనసాగుతుందని తెలిపారు.


ఫోన్‌లోనే హర్షకుమార్‌ బాసట

పార్లమెంట్‌ మాజీ సభ్యుడు హర్షకుమార్‌  రైతులకు ఫోన్‌లోనే తన సంఘీభావం తెలిపారు. ఆయన ఫోన్‌ సంభాషణను శిబిరంలో మైక్‌లో వినిపించారు. ‘‘నన్ను ఈ ప్రభుత్వం రాజమండ్రి కూడా దాటనివ్వడం లేదు. ఎన్నోసార్లు అమరావతికి వచ్చి మీకు అండగా ఉందమనుకుంటే పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు. రైతుల డిమాండ్‌లో న్యాయముంది. వారి పక్షాన రెండురోజుల్లో వచ్చి పోరాడతాను’’ అని హర్షకుమార్‌ భరోసా ఇచ్చారు.


అమరావతి రైతుల ఆందోళనకు అనంతపురం, కదిరి రైతులు సంఘీభావం తెలిపారు. ఆ ప్రాంతం నుంచి రెండు బస్సులో రైతులు వచ్చి వారు అమరావతికి వచ్చారు. ఒక్క హైకోర్టు కర్నూలుకు వస్తే కొత్తగా ఒరిగేది ఏమీలేదని వారంతా పెదవి విరిశారు. తాడికొండ అడ్డరోడ్డులో జరుగుతున్న నిరసన దీక్షలు 45వ రోజుకు చేరుకున్నాయి. సోమవారం రైతు సంఘం నాయకులు.. దీక్షలు చేస్తున్న వారికి సంఘీభావం తెలియజేశారు. పెనుమాక గ్రామంలో నిరసన కార్యక్రమాలు సోమవారంతో 62వ రోజుకు చేరుకున్నాయి. స్థానిక బొడ్డురాయి సెంటర్‌లో ‘వన్‌ స్టేట్‌ వన్‌ క్యాపిటల్‌’ అంటూ గ్రామస్థులు ప్లకార్డులు పట్టి నినదించారు. 

Updated Date - 2020-02-18T09:33:29+05:30 IST