ఆదుకుంటాం!

ABN , First Publish Date - 2020-11-29T08:14:08+05:30 IST

నివర్‌ తుఫాను వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడంలోనూ, పంట నష్టం నివేదిక రూపకల్పనలోనూ మానవతా దృక్పథంతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ‘‘డిసెంబరు15లోగా తుఫాను నష్టంపై నివేదిక ఇవ్వండి.

ఆదుకుంటాం!

రైతులకు ఇబ్బంది లేకుండా అంచనాలు 

15 లోగా నివర్‌ తుఫాను నష్టం నివేదిక

వచ్చే నెల 31లోగా పరిహారం పంపిణీ

మృతులకు రూ.5లక్షలు ఎక్స్‌గ్రేషియా

అధికారులకు సీఎం జగన్‌ ఆదేశాలు

తుఫాన్‌ బాధిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే

నష్టంపై కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష 


అమరావతి, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): నివర్‌ తుఫాను వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడంలోనూ, పంట నష్టం నివేదిక రూపకల్పనలోనూ మానవతా దృక్పథంతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ‘‘డిసెంబరు15లోగా తుఫాను నష్టంపై నివేదిక ఇవ్వండి. అదే నెల 31వతేదీ లోగా నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటాం. తుఫాను బారినపడి ప్రాణాలు కోల్పోయిన ఒక్కో కుటుంబానికి రూ.5లక్షలు చొప్పున పరిహారం అందించాలి. వర్షాలు, వరదలతో నిరాశ్రయులై, పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న ప్రతి ఒక్కరికీ రూ.500చొప్పున తక్షణం అందజేయాలి’’ అని సీఎం నిర్దేశించారు. శనివారం నివర్‌ తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో జగన్‌ ఏరియల్‌ సర్వే నిర్వహించారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయంలో తుఫాన్‌ నష్టాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. నివర్‌ తుఫాన్‌ కలిగించిన నష్టాల అంచనాలో రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు.


చిత్తూరులో ఆరుగురు, కడపలో ఇద్దరు వరదల్లో చిక్కుకుని చనిపోయారని, వారి కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం వెంటనే అందజేయాలని జిల్లాకలెక్టర్లను కోరారు. ‘‘పంట నష్టపోయిన రైతులకు తక్షణం 80శాతం సబ్సిడీతో విత్తనాలు పంపిణీ చేయాలి. రోడ్లు, చెరువులు దెబ్బతిన్న చోట్ల వెంటనే మరమ్మతులు చేపట్టాలి. వరదలతో దెబ్బతిన్న కడపలోని ఫించా, అన్నమయ్య ప్రాజెక్ట్‌ పనులను వెంటనే పునరుద్ధరించాలి. అత్యధిక వర్షాల కారణంగా దెబ్బతిన్న ఇరిగేషన్‌ ప్రాజెక్టులను పునరుద్ధరించాలి. కడప నగరంలో బుగ్గవంక ప్రాజెక్ట్‌ పెండింగ్‌ పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలి. సంబంధిత పనులకు అనుమతులిస్తూ వెంటనే పనులు ప్రారంభించాలి’’ అని  అధికారులను ఆదేశించారు. 




మరికొన్ని ‘నివర్‌’లు.. పట్టణాలు జాగ్రత్త

అధికారులకు మంత్రి బొత్స ఆదేశాలు


  నివర్‌ తుఫాను ప్రభావిత పట్టణ ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరంగా చేపట్టడంతోపాటు వర ద నీటి నిల్వ కారణంగా అంటువ్యాధులు ప్రబలకుం డా పకడ్బందీ కార్యాచరణను అమలు పరచాల్సిందిగా పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. కమిషనర్లను ఆదేశించారు. మరో రెండు రోజుల్లో ఇంకొక తుఫాను వస్తుందన్న హెచ్చరికల దృష్ట్యా అవసరమైన అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, నివర్‌ కంట్రోల్‌ రూమ్‌లను కొనసాగించాలని కోరారు. విజయవాడలోని ఏఎంఆర్డీయే ప్రధాన కార్యాలయం నుంచి శనివారం రాష్ట్రంలోని మున్సిపల్‌ కమిషనర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కాగా,  టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు అర్హతా పత్రాలను అందించడంతోపాటు బ్యాంక్‌ రుణాలను ఇప్పించే ప్రక్రియను వేగవంతం చేయాలని, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందినివినియోగించుకోవాలని బొత్స సూచించారు. 

Updated Date - 2020-11-29T08:14:08+05:30 IST