హృదయం చెప్పేది విందాం...

ABN , First Publish Date - 2022-06-17T08:00:38+05:30 IST

ఇది సాంకేతిక యుగం. సాంకేతిక పరిజ్ఞాన వికాసం వల్ల మన సమస్యలన్నీ తొలగిపోతాయనీ, ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయనీ అందరూ అనుకుంటారు.

హృదయం చెప్పేది విందాం...

ది సాంకేతిక యుగం. సాంకేతిక పరిజ్ఞాన వికాసం వల్ల మన సమస్యలన్నీ తొలగిపోతాయనీ, ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయనీ అందరూ అనుకుంటారు. కానీ నిజానికి సమస్య ఏమిటంటే... ఒకానొకప్పుడు... అంటే కొన్నేళ్ళ కిందట... ఎవరికైనా ఉత్తరం రాయాలనుకుంటే... ఒకసారి రాసి, చదువుకొని, అందులో మార్పు చేర్పులు అవసరమనిపిస్తే చేసి, ఆ తరువాత పోస్ట్‌ చేసేవారు. ఆ ఉత్తరం అవతలి వ్యక్తికి చేరడానికి వారమో, పది రోజులో పట్టేది. విదేశాల్లో ఉన్నవారికి కూడా ఉత్తరాలు రాసి, ప్రత్యుత్తరం కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూసేవారు. అది వచ్చాక ఇంట్లో అందరూ కలిసి చదువుకొనేవారు. దాని గురించి మాట్లాడుకొనేవారు. ఇప్పుడు... ఉత్తరం రాయగానే... తక్షణమే చేరుకోవడానికి అన్ని ఉపాయాలనూ మనం కనుక్కున్నాం. కానీ ఉత్తరంలో ఏం రాయాలో... అది మాత్రం నేర్చుకోలేదు. ప్రేమ అంటే ఏమిటో, గౌరవం అంటే ఏమిటో, సభ్యత, సంస్కారం అంటే ఏమిటో మరచిపోతున్నాం. వాటి విలువలు క్రమేపీ కనుమరుగవుతున్నాయి. ప్రస్తుతం ఉత్తరం రాసి, ఆ పక్కన ఉన్న బటన్‌ క్లిక్‌ చెయ్యగానే... సెకెన్ల వ్యవధిలో అది చేరిపోతోంది. కానీ అందులో మనం రాస్తున్నదేమిటి? 


ప్రేమ, ఆదరణ, అభిమానం, గౌరవం, పక్కవారిని అర్థం చేసుకోవడం, మరొకరి గురించి మంచిగా ఆలోచించడం... ఇవన్నీ మనిషి హృదయంలో జనిస్తాయి. కనుక, మనిషి తనను తాను తెలుసుకోకపోతే, తన హృదయం చెప్పేది వినకపోతే... అతని పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మాటల్లో చెప్పలేం. ఎందుకంటే... పూర్వం ఉత్తరం రాయాలనుకున్నప్పుడు, కూర్చొని, కాసేపు ఆలోచించి, ఆ తరువాతే రాసేవారు. కానీ ఇప్పుడు... ఏమాత్రం ఆలోచించకుండా రాయడం, పంపడం... రెండు క్షణాల్లో జరిగిపోతున్నాయి. అనరాని మాటలను, నొప్పించే విషయాలను కూడా ఒక్కోసారి పంపించి, ఆ తరువాత బాధపడుతూ ఉంటారు. దీనివల్ల గొడవలు, మనస్ఫర్ధలు తలెత్తుతున్నాయి. నేటి ప్రపంచంలో మానవుడు ఎంతో పురోగతి సాధించినా శాంతి మాత్రం చేకూరలేదంటే... ఇదంతా దేని కోసం? శాంతికి మనం ఏం విలువ ఇస్తున్నట్టు? ప్రతి ఒక్కరూ తమ స్వప్రయోజనాలకే కాకుండా, తమ చుట్టూ ఉన్నవారందరి ప్రయోజనాలకూ తోడ్పడే విధంగా సాంకేతికతను ఉపయోగించడం సాధ్యపడుతుందా?


నేటి యువతరాన్ని పీడిస్తున్న ఒక పెద్ద సమస్య... నిరాశ. దీనివల్లనే ఎంతోమంది యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అన్యాయాలకూ, అక్రమాలకూ ఒడిగడుతున్నారు. అలాంటి వాళ్ళందరూ శాంతి వైపు ప్రయాణం చెయ్యాలంటే ఎలా సాధ్యమవుతుంది? దీనికంతటికీ కారణం సమాజం వారిపై మోపుతున్న భారం. సోషల్‌ నెట్వర్కింగ్‌లో... ఇ-మెయిల్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్‌... వీటిలో యువత మునిగి తేలుతున్నారు. తన హృదయం తనకు ఏం చేయమని చెబుతుందో... దాని మీద దృష్టి పెట్టడానికి ఒక్క క్షణమైనా తీరిక లేకుండా ఉన్నారు. కానీ మనిషి తన జీవితాన్ని బ్యాలెన్స్‌ చేసుకోనంత వరకూ, తన హృదయం పిలుపును ఆలకించనంత వరకూ నిరాశ వేధిస్తూనే ఉంటుంది. పిల్లల మీద ఇంత భారం ఒకప్పుడు ఉండేది కాదు. అప్పట్లో వాళ్ళు తమ చుట్టూ ఉన్నవారితో స్నేహం చేసేవారు. కానీ ఇప్పుడు ఇతర దేశాల వాళ్ళు కూడా స్నేహితులు అవుతున్నారు. వారి ప్రభావం వీళ్ళ మీద ఎన్నో రకాలుగా పడుతోంది. దీంతో హృదయం చెప్పేది నిర్లక్ష్యం చేస్తున్నాం. అదే నిరాశకు మూలకారణం అవుతోంది. మీ హృదయం చెప్పేది ఒక్క నిమిషమైనా వినండి, ఫేస్‌బుక్‌లో ఏముందనేది కాదు... హృదయం అనే పుస్తకంలో ఏముందో చూడండి. ట్విట్టర్‌ను కాదు, మీ మెదడులో ఏముందో చూడండి. ఇన్‌స్టాగ్రామ్‌ను చూడడం కాదు, మీలో కృతజ్ఞతా భావం ఎంత ఉందనేది గమనించండి. 


సాంకేతికత ఎప్పుడూ ఉండేదే. కానీ దాని ప్రభావం మన జీవితాల మీద ఎంతవరకూ ఉందో, తత్పరిణామాలేమిటో మనం గమనించుకోవాలి. ‘ఇది నా జీవితం. నేను నా జీవితాన్ని ఆనందంగా జీవించాలి. నా జీవితంలో నిరాశకు లోనైతే... అది నాకే మంచిది కాదు. దాని పరిణామాలను నేనే ఎదుర్కోవాలి’ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలాగని ఈ సాంకేతికతనంతా పక్కన పెట్టెయ్యాలని కాదు... కానీ జీవితంలో ఒక రకమైన సమతుల్యత అవసరం. ఈ తరం వారి జీవితాలు సైన్స్‌తో, టెక్నాలజీతో ముడిపడి ఉన్నాయి. కానీ మనం ప్రగతి సాధిస్తూ పోయే కొద్దీ మనకు మనమే దూరమవుతున్నాం. ఒకరికొకరం దూరమవుతున్నాం. సాంకేతికతను మానవ వినాశనానికి దారితీసే వాటి తయారీకి బదులు... మానవ శ్రేయస్సుకు ఉపయోగించినప్పుడే అది సద్వినియోగం అవుతుంది. తన జీవితం విలువ మనిషికి తెలిసినప్పుడు... అతను సాంకేతికతను సద్వినియోగం చేసుకోగలడు. ఇదంతా పూర్తిగా మీమీదే ఆధారపడి ఉంటుంది. 

Updated Date - 2022-06-17T08:00:38+05:30 IST